
బషీర్బాగ్, వెలుగు: సోషల్ మీడియాను నియంత్రించాల్సిన అవసరం ఉందని తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ కె.శ్రీనివాస్ రెడ్డి అన్నారు. కంచ గచ్చిబౌలిలో నెమళ్లు, జింకలు, ఏనుగులు పరిగెత్తినట్లు సోషల్ మీడియాలో పోస్టులు చేశారన్నారు. సోషల్ మీడియా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డిజిటల్ మీడియా నియంత్రణపై త్వరలో జాతీయ స్థాయిలో సెమినార్ నిర్వహిస్తామని ఆయన తెలిపారు. ఉర్దూ భాషను బతికించుకోవాలని, ప్రాంతీయ భాషలను కాపాడుకోవాల్సిన బాధ్యత ఆయా ప్రాంతాల ప్రజలపైనే ఉందన్నారు.
శనివారం హైదరాబాద్ బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో నసీమ్ ఆరిఫ్ ఉర్దూ మీడియా అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం జరిగింది. అవార్డు విజేతలు డాక్టర్ రుష్దా షాహీన్ (ఢిల్లీ), మహ్మద్ అర్షద్ (హైదరాబాద్), సయ్యద్ సజ్జదుల్ హుస్సేన్ (హైదరాబాద్), జకారియా(మధుబని, బిహార్) లను ఘనంగా సన్మానించి రూ.15 వేల నగదు, అవార్డులను అందజేశారు. లైఫ్ టైమ్ అచీవ్ మెంట్ అవార్డును ఖుర్బాన్ అలీ (ఢిల్లీ) కి అందజేశారు. ఈ సందర్భంగా కె.శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ తాను 1970లో జర్నలిజంలోకి వచ్చినప్పటి నుంచి నసీమ్ ఆరిఫ్ తనకు మంచి మిత్రడని తెలిపారు.
అమెరికా అధిపత్యంతో ఇంగ్లిష్ భాష ప్రాంతీయ భాషలను మింగేస్తున్నదన్నారు. ఇండియా, రష్యా, చైనా, వియత్నాం, జర్మనీ, ఫ్రెంచ్ ఇలా 47 దేశాలు తమ భాషలనే అమలు చేస్తున్నాయని తెలిపారు. తెలంగాణలో కూడా ఇటీవల ఇంటర్ బోర్డు బలవంతంగా సంస్కృత భాషను అమలు చేసేందుకు నోటిఫికేషన్ ఇచ్చిందని, దాదాపు 160 సంస్కృత భాషా పండిత్ పోస్టులను భర్తీ చేశారని, దీనిని అందరూ వ్యతిరేకిస్తున్నారని చెప్పారు. డీలిమిటేషన్ అంశంపై ఇచ్చిన లేఖపై తమిళంలో కాకుండా ఇంగ్లిష్ లో ఎందుకు సంతకం పెట్టారని ఆ రాష్ట్ర సీఎం స్టాలిన్ ను ప్రధాని నరేంద్ర మోదీ ప్రశ్నించారన్నారు.
సోషల్ మీడియా, కానీ డిజిటల్ మీడియా సంస్థల రిజిస్ట్రేషన్ అంశం కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉంటుందన్నారు. అమీనుల్ జాఫ్రీ మాట్లాడుతూ సోషల్ మీడియా రాజకీయాలలో ఉన్న మలినాన్ని మొత్తం సమాజంపై రుద్దుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. సోమశేఖర్ మాట్లాడుతూ ప్రస్తుతం మీడియా సంస్థలు పరోక్షంగానో, ప్రత్యక్షంగానో రాజకీయ పార్టీలు, కార్పొరేట్ సంస్థల ద్వారా నడుస్తున్నాయన్నారు. అంతకు ముందుకు జరిగిన చర్చలో ఉర్దూ జర్నలిజం, ఉర్దూ భాషను రక్షించుకోవాల్సిన ఆవశ్యకతను వక్తలు తెలియజేశారు.