బీఆర్ఎస్​​లో సోషల్' వార్ .. సోషల్​ మీడియాలో జగ్గు బాధితుల లిస్ట్​

  • గుంటకండ్లపై విమర్శలు
  • జగ్గు.. మగ్గు అంటూ వెటకారం 
  • ఫెక్సీల్లో ఫొటోలు కూడా పెట్టరా అంటూ నిలదీత 
  • ఎంతమందిని బయటకు పంపిస్తారని సూటి ప్రశ్న

యాదాద్రి, వెలుగు : బీఆర్ఎస్​లో సోషల్​మీడియా వార్ జరుగుతోంది. లీడర్ల తరఫున కొందరు కార్యకర్తలు వకాల్తా పుచ్చుకొని ఫేస్​బుక్​అకౌంట్లలో తీవ్ర స్థాయిలో పోస్టులు పెడుతున్నారు. ‘జగ్గు.. మగ్గు’ అంటూ మాజీ మంత్రి గుంటకండ్ల జగదీశ్​రెడ్డిని ప్రస్తావిస్తూ వెటకారంగా పోస్టులు పెడుతున్నారు. సోషల్​మీడియాలో కొనసాగుతున్న కామెంట్ల వార్​చూస్తున్న బీఆర్ఎస్​ కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు. 

జగదీశ్​రెడ్డి కారణంగానే ఇబ్బందులు..  

మాజీ మంత్రి గుంటకండ్ల జగదీశ్​రెడ్డి కారణంగా ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని బీఆర్ఎస్​మాజీ ఎమ్మెల్యేలు, లీడర్లు ఇబ్బంది పడ్డారని, దీంతో బీఆర్ఎస్​కు నష్టం జరిగిందన్న వాదన వినిపిస్తోంది. ఆయన వ్యవహారం నచ్చక పార్టీ నుంచి చాలా మంది వెళ్లిపోయారంటూ ఆ మధ్య విమర్శలు వచ్చాయి. పార్టీలో కొనసాగుతున్న వారిలో మాజీ ఎమ్మెల్యేలు సహా అనేక మంది నాయకులతో గుంటకండ్లకు విబేధాలు ఉన్నాయన్నది బహిరంగ రహస్యమే. 

మాజీ సీఎం కేసీఆర్​తో గుంటకండ్లకు ఉన్న సాన్నిహిత్యం కారణంగా ఎవరూ నోరు విప్పే సాహసం చేయలేని పరిస్థితుల్లో ఉన్నారు. లోక్​సభ ఎన్నికల్లో పోటీ చేయడానికి భువనగిరి, నల్గొండ సీట్లను అనేకమంది ఆశించారు. వీరిలో గుత్తా అమిత్​రెడ్డి, కంచర్ల కృష్ణారెడ్డి, దూదిమెట్ల బాలరాజు యాదవ్, జిట్టా బాలకృష్ణారెడ్డి, బూడిద భిక్షమయ్యగౌడ్, క్యామ మల్లేశ్​సహా పలువురు టికెట్ఆశించిన విషయం తెలిసిందే. 

అయితే, నల్గొండలో గుత్తా అమిత్​కు టికెట్​ఇస్తే ఓడిస్తామంటూ అక్కడి బీఆర్ఎస్ ​లీడర్లు ముఖ్యనేతల వద్ద వ్యాఖ్యానించారు. దీంతో ఆయన భువనగిరి వైపు దృష్టి సారించారు. కొడుకు అమిత్​రెడ్డి పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నారని ప్రకటించారు. రెండుచోట్ల అమిత్​రెడ్డికి టికెట్​రాకుండా జగదీశ్​రెడ్డి అడ్డుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ పరిణామాలతో గుత్తా అమిత్​రెడ్డి పోటీ చేయడానికి వెనుకంజ వేశారు. అయితే, నల్గొండలో కంచర్ల కృష్ణారెడ్డి, భువనగిరిలో క్యామ మల్లేశ్​కు అధిష్టానం టికెట్లు కేటాయించడంతో బీఆర్ఎస్​నాయకులు ఆశ్చర్యపోయారు. 

డీబీఆర్​ సైన్యం పేరుతో పోస్టులు..  

ఇటీవల భువనగిరి లోక్​సభ నియోజకవర్గంలో నిర్వహించిన సన్నాహక సమావేశాల్లోని బ్యానర్లలో మాజీ చైర్మన్లు దూదిమెట్ల బాలరాజుయాదవ్, పల్లె రవికుమార్​గౌడ్​సహా కొందరి ఫొటోలు పెట్టలేదన్న విమర్శలు వచ్చాయి. ఫొటోలు పెట్టకపోవడంపై బీఆర్ఎస్​యాదాద్రి జిల్లా అధ్యక్షుడు కంచర్ల రామకృష్ణారెడ్డిని కూడా ప్రశ్నించినట్టుగా సమాచారం. ఈ తరుణంలోనే సోషల్​మీడియాలో డీబీఆర్​సైన్యం పేరుతో పలు పోస్టులు ప్రత్యక్షమయ్యాయి.

 ‘జగ్గు.. మగ్గు’ బాధితులంటూ బీఆర్ఎస్​నుంచి కాంగ్రెస్​లో చేరి ఎమ్మెల్యేలు అయిన వేముల వీరేశం, మందుల సామెల్​పేర్లు, బీజేపీ అభ్యర్థిగా బరిలో ఉన్న బూర నర్సయ్యగౌడ్ పేర్లు ఉన్నాయి. వీరితోపాటు గుత్తా అమిత్​రెడ్డి, కర్నె ప్రభాకర్, వట్టే జానయ్యయాదవ్, నేతి విద్యాసాగర్,  తెలంగాణ తొలి అమరుడు శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మతోపాటు పలువురి పేర్లు ఉన్నాయి. ఇంకెంత మందిని పార్టీ వ్యతిరేకులుగా ముద్రవేసి బీఆర్ఎస్​నుంచి బయటకు పంపిస్తారని పోస్టులో సూటి ప్రశ్నించారు. అధికారం కోల్పోయి ఒకపక్క నైరాశ్యంలో ఉంటే.. లీడర్ల మధ్య ఈ పోస్టుల గొడవ ఏంటని బీఆర్ఎస్ ​శ్రేణులు​ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

పోస్టుల సారాంశం.. 

  •  పార్లమెంట్​సన్నాహక సమావేశాల్లో రాష్ట్ర మాజీ కార్పొరేషన్ల చైర్మన్ల ఫొటోలు కూడా పెట్టరా..? 
  •  కేసీఆర్​కు సైనికులుగా పనిచేస్తున్న వారికి కనీసం గౌరవం కూడా ఇవ్వరా..?
  •  క్రమశిక్షణతో ఉంటూ పార్టీ కోసం పనిచేస్తున్న వారిని వ్యతిరేకులుగా ముద్ర వేస్తారా..? 
  •  ఇప్పటికే కొందరు బయటకు పంపించారు. ఇంకెంతమందిని పంపిస్తరు..? 
  •    పార్టీ కష్టాల్లో ఉన్న సమయంలో ఎంపీ అభ్యర్థుల ఎంపికపై ఎవరి సలహాలు కూడా తీసుకోరా..?

కౌంటర్​పోస్ట్.. 

డీబీఆర్​సైన్యం పేరుతో సోషల్ మీడియాలో వచ్చిన పోస్టులకు మాజీ మంత్రి గుంటకండ్ల జగదీశ్​రెడ్డి వర్గం నుంచి సోషల్​మీడియాలో కౌంటర్​పోస్టు కూడా వచ్చింది. దూదిమెట్ల బాలరాజును ఉద్దేశించి వచ్చిన ఈ పోస్టులో గుత్తా సుఖేందర్​రెడ్డి, గుత్తా అమిత్​రెడ్డి, జిట్టా బాలకృష్ణారెడ్డి బీఆర్ఎస్​లో ఎప్పుడు సభ్యత్వం తీసుకున్నారో చెప్పాలని డిమాండ్​చేశారు. దీంతోపాటు మీ సభ్యత్వం ఎప్పుడు తీసుకున్నారో చెప్పాలని పోస్టులో ప్రశ్నించారు.