-
4 రోజుల పాటు 11 క్రీడల్లో పోటీలు
హైదరాబాద్, వెలుగు: ఎస్సీ గురుకులాల్లో సోమవారం నుంచి 10వ జోనల్ స్పోర్ట్స్ మీట్ జరగనుంది. నాలుగు రోజుల పాటు రాష్ట్రంలోని 241 ఇనిస్టిట్యూషన్స్ లో 11 క్రీడల్లో పోటీలు జరుగనున్నాయి. 20 చోట్ల జరుగనున్న పోటీల్లో 20,485 మంది గురుకుల స్టూడెంట్స్ పాల్గొననున్నారు. ఆయా జోన్లలో వీటిని మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రారంభిస్తారని ఎస్సీ గురుకుల సెక్రటరీ అలుగు వర్షిణి ఆదివారం పత్రిక ప్రకటనలో పేర్కొన్నారు.
అండర్ 14, 17,19 కేటగిరీల్లో పోటీలు జరుగుతాయని ఆమె తెలిపారు. వాలీబాల్, కబడ్డీ, హ్యాండ్ బాల్, బాల్ బ్యాడ్మింటన్, ఖో ఖో, చెస్, క్యారమ్, టెన్నిస్, ఫుట్ బాల్ క్రీడల్లో పోటీలు జరుగుతాయని చెప్పారు. వీటి నిర్వహణకు ఫిజికల్ డైరెక్టర్లను ఒక్కో స్కూల్ ఇన్ చార్జ్ గా, పీఈటీలను ఆర్గనైజర్లుగా నియమించామని వివరించారు.
క్రీడల నిర్వహణకు మొత్తంగా 17 కమిటీలను ఏర్పాటు చేశామని సెక్రటరీ వెల్లడించారు. ఈ క్రీడల్లో గెలిచిన సుమారు 4 వేల మందిని స్టేట్ లెవెల్ స్పోర్ట్స్ మీట్ కు ఎంపిక చేస్తామన్నారు. హైదరాబాద్ లోని గచ్చిబౌలి స్టేడియంలో వచ్చే నెలలో స్టేట్ లెవెల్ క్రీడలు జరుగుతాయని తెలిపారు.