
- తన హయాంలో నష్టం రూ.2.5 కోట్లు, ఆస్తులు రూ.20 కోట్లు
- సొసైటీలో అవినీతి చేసిన వారి నుంచి రికవరీ చేయిస్తాం
కోటగిరి, వెలుగు : ఎత్తొండ సొసైటీ అభివృద్ధి కోసం రూ. 2 కోట్ల టర్నోవర్ ఉంటే రూ.100 కోట్లకు పెంచానని సొసైటీ మాజీ చైర్మన్ సోమశేఖర్ రావు తెలిపారు. ఎత్తొండలో సోమవారం నిర్వహించిన ప్రెస్ మీట్లో ఆయన మాట్లాడారు. 2018 నుంచి అవినీతి జరగడం వల్ల దాదాపు రూ. 14 కోట్ల నష్టం వచ్చిందని ఆరోపించారు. ప్రస్తుత పాలకవర్గం అసత్య ప్రచారం చేయడం తగదన్నారు. ఎంక్వయిరీ ప్రకారం సొసైటీ సివిల్ సప్లై ధాన్యం రూ.9 కోట్లు, 1.40 కోట్ల క్యాష్ క్రెడిట్ లోన్తో పాటు వడ్డీ, పెనాల్టీ కలుపుకుని దాదాపు రూ.14 కోట్ల వరకు సొసైటీ బాకీ ఉందని, ప్రస్తుత పాలకవర్గం చెల్లించాలని నోటీసులు వచ్చినట్లు తెలిపారు.
సొసైటీ సిబ్బంది పేర్లతో బిల్లులు చేసి డబ్బులు కాజేశారని, ఆ డబ్బులు రికవరీ చేయిస్తామని తెలిపారు. తాను పదవీ విరమణ చేసేటప్పుడు సొసైటీలో రూ.70 లక్షల విలువ చేసే బియ్యం స్టాక్ ఉందని, ప్రస్తుతం ప్రభుత్వానికి బియ్యం బాకీ ఎందుకున్నదో రైతులు ప్రశ్నించాలన్నారు. సొసైటీ డబ్బులు తిన్న ప్రతి ఒక్కరి నుంచి డబ్బులు రికవరీ చేయాలని అధికారులను కోరారు.
సంఘం ఆస్తులు అమ్ముతామంటే ఊరుకోం.. సంఘ సభ్యులు
ఎత్తొండ సొసైటీని 1995 నుంచి 2018 వరకు అధ్యక్షుడిగా ఉన్న సోమశేఖర్ రావు రూ.2 కోట్ల నుంచి రూ.వంద కోట్లకు టర్నోవర్ పెంచాడని, ఏమీలేని సొసైటీకి రూ.20 కోట్ల స్థిరాస్తి సమకూర్చారని సంఘ సభ్యులు పేర్కొన్నారు. గతంలో సంఘానికి నష్టం చేసిన ఓ వ్యక్తికి చెందిన మూడెకరాల పొలం అమ్మి డబ్బులు రికవరీ చేసినట్లు గుర్తు చేస్తూ ప్రస్తుతం అవకతవకలకు పాల్పడిన వారి నుంచి వసూలు చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే ధర్నాలు, నిరాహార దీక్షలు చేస్తామని హెచ్చరించారు. సమావేశంలో సొసైటీ డైరెక్టర్ గంగులు, రైతులు రాజుదేశాయ్, దశరథ్, బర్ల హన్మంతు, సంజీవ్, అరుణ్ కుమార్, మన్నె నారాయణ, రత్నాకర్, ప్రసాద్ రావు, సూరిబాబు, సిద్దాపూర్ చందు, మున్వార్ తదితరులు పాల్గొన్నారు.