
- ఎక్కడికెళ్లినా బుట్టల కొద్ది వినతిపత్రాలు ఇస్తున్నరు
- మధ్యప్రదేశ్ మంత్రి ప్రహ్లాద్ పటేల్ వివాదాస్పద వ్యాఖ్యలు
- బీజేపీ నేతలు దురహంకారంతో మాట్లాడుతున్నరు: కాంగ్రెస్
భోపాల్: మధ్యప్రదేశ్ మంత్రి ప్రహ్లాద్ పటేల్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వాన్ని అడుక్కోవడానికి ప్రజలు అలవాటు పడ్డారని ఆయన వ్యాఖ్యానించారు. శనివారం రాయ్‌గఢ్ జిల్లాలో వీరాంగనా రాణి అవంతిబాయి లోధి విగ్రహావిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ప్రహ్లాద్ పటేల్ మాట్లాడుతూ.. ‘‘ప్రభుత్వాన్ని అడుక్కోవడం ప్రజలకు అలవాటుగా మారింది.
నేతలు వచ్చినప్పుడల్లా బుట్టలకొద్దీ వినతిపత్రాలు తెస్తున్నారు. స్టేజ్ మీద మెడలో దండేసి, చేతిలో వినతిపత్రం పెడుతున్నారు. ఇది మంచి అలవాటు కాదు. అడగడానికి బదులు.. ఇవ్వడం నేర్చుకోండి. అప్పుడు జీవితం ఆనందంగా ఉండడంతో పాటు మంచి సొసైటీ నిర్మితమవుతుంది” అని అన్నారు. ఉచితాలపై ఎక్కువగా ఆధారపడకూడదని, అలా చేస్తే సొసైటీ బలహీనపడుతుందని పేర్కొన్నారు. ‘‘ఈ బిచ్చగాళ్ల సైన్యం సొసైటీని బలోపేతం చేయడం లేదు.. బలహీనపరుస్తున్నది. ఉచితాలకు ఆకర్షితులవడం.. ధీర వనితలకు ఇచ్చే గౌరవం కాదు. వాళ్ల సిద్ధాంతాలకు అనుగుణంగా నడుచుకోవడమే వాళ్లకు ఇచ్చే నిజమైన గౌరవం. అమరులు ఎవరైనా అడుక్కున్నట్టు చరిత్రలో ఉందా? నర్మదా పరిక్రమ యాత్రికుడిగా నేను దానం అడిగాను. కానీ నాకోసం ఎప్పుడూ ఏదీ ఎవరినీ అడగలేదు. నాకు ఏదైనా ఇచ్చానని ఎవరూ చెప్పలేరు” అని అన్నారు.
ప్రజలను అడుక్కునేది మీరే: కాంగ్రెస్
ప్రహ్లాద్ పటేల్ చేసిన కామెంట్లు వివాదాస్పదమయ్యాయి. మంత్రి వ్యాఖ్యలపై ప్రతిపక్షాలు మండిపడ్డాయి. రాష్ట్ర ప్రజలను బిచ్చగాళ్లతో పోల్చి అవమానించారని కాంగ్రెస్ స్టేట్ ప్రెసిడెంట్ జీతూ పట్వారీ ఫైర్ అయ్యారు. ‘‘ప్రజలు ప్రభుత్వాన్ని అడుక్కుంటున్నారా? బీజేపీ దురహంకారానికి నిదర్శనమిది. వాళ్లు ఎన్నికలకు ముందు అబద్ధపు హామీలు ఇచ్చారు. అధికారంలోకి వచ్చాక వాటిని పక్కనపెట్టారు. ఆ హామీల గురించి ప్రజలు గుర్తు చేస్తుంటే.. వాళ్లను బిచ్చగాళ్లు అని పిలుస్తూ అవమానిస్తున్నారు. కానీ బీజేపీ నేతలు ఒక్కటి గుర్తుంచుకోవాలి.. ఓట్ల కోసం ప్రజలను అడుక్కోవడానికి త్వరలో వాళ్లే వస్తారు!” అని విమర్శించారు.