సోషియాలజీ గ్రూప్స్ స్పెషల్ : గోండుల సంస్కృతి ఇదే

సోషియాలజీ గ్రూప్స్ స్పెషల్ : గోండుల సంస్కృతి ఇదే

గోండులు తమను తాము కోయ్​తుర్​ లేదా కోయ్​గా అని గోండి భాషలో పిలుచుకుంటారు. ధుర్​ లేదా ధర్వే అని పిలిచే సంఖ్యాపరంగా పెద్దగా ప్రాధాన్యత లేని గోండులు ఉన్నారు. వీరికి తక్కువ సామాజిక హోదా ఇచ్చారు. వీర్​ రాజ్​గోండులతో వివాహ సంబంధాలు పెట్టుకోరు. తెలంగాణ, మహారాష్ట్ర, ఛత్తీస్​గఢ్​ రాష్ట్రాల్లో గోండులు ఎక్కువగా జీవిస్తున్నారు.

 తెలంగాణ రాష్ట్రంలో ఆదిలాబాద్​ జిల్లాలో ఎక్కువగా నివసిస్తున్నారు. వీరు మహారాష్ట్రలోని చాందా నుంచి తెలంగాణలోని ఆదిలాబాద్​ వరకు ప్రముఖ రాజ్యవంశాలుగా పాలించేవారు. వీరినే రాజ్​గోండులు అని కూడా వ్యవహరిస్తారు. గోండుల్లో మరియాలు, కొండమరియాలు, భిషోమార్​ మరియాలు అనే మూడు ఉప తెగలు కూడా ఉన్నాయి. గోండులు స్థిర వ్యవసాయం చేస్తారు. వీరు నాగదేవత, పెర్సిపెన్​ అనే దేవతను ఎక్కువగా ఆరాధిస్తారు. ఎద్దు కొమ్ములను వీరు అలంకారంగా ధరిస్తారు. ప్రధాన్​లు గోండుల వారసత్వ కళాకారులుగా భావించవచ్చు. గోండులు, కోలామ్​ల కంటే ఉన్నతమైన సామాజిక హోదాను నాయక్​పోడులు ప్రకటించుకున్నారు. 

దండారీ పండుగ

దండారీ అనేది గోండుల ముఖ్యమైన పండుగ. దీపావళికి కొద్దిరోజుల ముందే గోండులు నివసించే ప్రాంతం డప్పులు, డోలు, గమేలా, పార, పెప్రె, ఖాలికోమ్​ తదితర వాయిద్యాలతో మారుమోగుతుంది. అడవుల్లో కాలిబాటన బారులు తీరిన జనం ఒక గ్రామం నుంచి మరో గ్రామానికి తరలివెళ్తుంటారు. ప్రధాన్​లు ఖాలికోమ్​ను ఊదుతుంటే వారి వెనుక డప్పులు వాయిస్తుంటే తెల్లటి చొక్కా, పంచె, కండువా, తలపాగ పెట్టుకొని రాజఠీవితో గోండులు వస్తుంటారు.

గోండుల వెనుక గుస్సాడిలు వీరికి కాపలా కాస్తున్నట్లు నడుస్తారు. ఈ గుంపునంతటిని ఆ గ్రామం దండారి అని అంటారు. సామాన్యంగా ఒక్కో సంవత్సరం ఒక్కో గ్రామంలో దండారి జరుగుతుంది. ఒక గ్రామస్తులు ఈ సంవత్సరం మరో గ్రామానికి వెళ్తే ఆ గ్రామస్తులు వచ్చే సంవత్సరం ఈ గ్రామానికి రావాలి అనేది ఆచారం. కానీ ఆచరణలో ఈ విధంగా జరగదు. ఎందుకంటే దండారి పండుగకు పిలవాలంటే ఆర్థిక స్తోమత ఉండాలి.  10 నుంచి 15 గ్రామాల నుంచి దండారిలు వస్తే ఈ గ్రామస్తులు కూడా కలుపుకుంటే సుమారు 1000 మందికి తక్కువకారు.

దండారి పండుగలో ఆటపాటలే కాకుండా దండారి గౌర్​, అతని తమ్ముడు సిపిసెరమరౌర్​లను కొలవడం ముఖ్య భాగం. వీరు ఐదు అన్నదమ్ముల సగవారు అయినా, గోండులందరికీ ఆరాధ్య దేవతలు. వారిని ఏత్మాసర్ దేవతలు అంటారు. అంటే నృత్య దేవతలు అని అర్థం.  దండారి పనులు జూన్​, జులై నెలల్లో అంటే సుమారు 4, 5 నెలల ముందే ప్రారంభమవుతాయి. అకాడీ(వాయిద్యాలు) పూజలతో ప్రారంభమవుతుంది. కాబట్టి ఈ నెలను అకాడీ నెల అంటారు. పౌర్ణమికి ముందు మంచి రోజు చూసి అకాడీ డప్పుల యజమానులు, అటక మీద నుంచి దించి, శుభ్రం చేసి ఇంటి ముందు ఉంచుతారు. కోడిని కోసి రక్తాన్ని డప్పుల మీద చిమ్మి దండారీ పండుగ అయ్యే వరకు అందరూ బాగుండాలని రౌర్​ అన్నదమ్ములను ప్రార్థిస్తారు. భోగి పండుగతో మొదలై దీపావళి రోజు చివరి రోజవుతుంది. 

ఖేల్​

నృత్యాలు, పాటల మధ్యలో చిన్న చిన్న హాస్య నాటికలే ఖేల్​. దీంట్లో ముఖ్యంగా చిన్నతరహా అటవీ అధికారుల పాత్రలు ఉంటాయి. వారు గిరిజనులను హింసించి డబ్బులు వసూలు చేసే విధానం, వారి దేహశుద్ధి చేయడం ఒక అంకం. డబ్బు వసూలు చేసేది నిజమైనా దేహశుద్ధి చేయడం వారి మనసులో ఉండే కోరిక. నిజ జీవితంలో వీలుకానిది ఈ ఖేల్​లో చూపిస్తారు. ఇది చూసి గిరిజనులందరు ఎంతో ఆనందిస్తారు. ఈ ఖేల్​లో ముఖ్యమైన అంశాలు మేకలను దొంగలించేవారు, సారా తాగి భార్యను కొట్టేవారు, మరొకరి భార్యతో పారిపోయినప్పుడు చేసే పంచాయతీ, పోలీసు శాఖలో కింది స్థాయి ఉద్యోగుల ఆగడాలు. ఈ హాస్యనాటికలు పూర్తయిన తర్వాత మళ్లీ నృత్యం, భజనలు ఉంటాయి. 

ప్రముఖ వాయిద్యాలు

వీటిలో కొన్ని ప్రధాన్​లు వాయిస్తే మరికొన్ని గోండులు వాయిస్తారు. కాలికోం, పెప్రె, కింగ్రి ప్రధాన్​లు వాయిస్తే డప్పు, గుమేలా, డోలు గోండులు వాయిస్తారు. 
గుమేలా: బుర్రకథల్లో వంతపాడే వాళ్లు వాయించే వాయిద్యం లాగ ఉంటుంది. సామాన్యంగా ఇద్దరు వాయిస్తారు. పాట పాడుతున్నప్పుడు చరణానికి, చరణానికి మధ్య వాయిస్తారు. మధ్యన ఉబ్బినట్టుండి, ఒక పక్కన చర్మంతో మూసివేసి, రెండో వైపు మూతిలా తెరుచుకొని ఉంటుంది. చర్మం మీద కొడుతూ తెరుచుకున్న మూతిని తెరిచి, మూసివేయడం ద్వారా వింతైన శబ్దాలు చేస్తారు. 
పార: ఇది కూడా చర్మ వాయిద్యమే. మోకాళ్ల మధ్యన పెట్టుకొని చేతివేళ్లతో వాయించే చిన్న వాయిద్యం.

వెలె లేక పార: మట్టితో కాని చెక్కతో కాని ఇనుముతో కాని సాసర్​లాగ  తయారు చేసిన దానికి పైన చర్మం అతికిస్తారు. దీనిపై వెదురు బద్దలతో లయబద్దంగా వాయిస్తారు. ఇది పది అంగుళాల వ్యాసం కంటే ఎక్కువ ఉండదు. 

డోల్​: గ్రామీణ ప్రాంతాల్లో వాడే డోలు లాగే ఉంటుంది. అయితే, సన్నాయి వారి సహకార వాయిద్యం డోలు లాగ ఉండదు. 

డప్పు: గ్రామీణ ప్రాంతాల్లో మనం చూసే డప్పు లాంటిదే ఇది. ఏమి తేడా ఉండదు. 
పెప్రె: సెహనాయిని పోలిన, గాలి ఊదే వాయిద్యం. ప్రధాన్​లు వాయిస్తారు. 
కాలికోం: పూర్వకాలం రాజులు వచ్చేటప్పుడు వాయించే వంకర బాకాలాంటిది. ఇదే కాకుండా సన్నగా, చాలా పొడవుగా ఉండే బాకాలు కూడా ఉన్నాయి. దీనిని ప్రధాన్​లు వాయిస్తారు. 
కింగ్రి: ప్రధాన్​లు పాటలు పాడేటప్పుడు వాయించే సహకార వాయిద్యం. వయిలెన్​ను పోలి ఉంటుంది. 

ప్రధాన్​లు

ఆదిలాబాద్​ జిల్లాలో నివసించే ముఖ్యమైన ఆదిమ గిరిజన తెగ ప్రధాన్​. వీరు ద్రావిడ సంతతికి చెందినవారు. ప్రధాన్​ల సంస్కృతి సింధూ నాగరికతకు చెందింది. వీరి సామాజిక వ్యవస్థ వీరి పూర్వీకులైన పాహాన్డీ కుపార్​ లింగో ప్రతిపాదించిన టోటెం వాదం అంటే గుర్తింపు చిహ్నంపై ఆధారపడి ఉంది. ప్రధాన్​ అనే తెగవారు గోండుల ఇతిహాసాలు, జానపదాలను పాడి వినిపించే సంప్రదాయ కళాకారులు.

తెలంగాణలోని ఆదిలాబాద్​లోని ప్రధాన్​లు భాషాపరంగా మరాఠీ మాట్లాడుతారు. కానీ మాతృ భాష గోండి కావడంతో అందరికీ గోండి భాష మాట్లాడటం కూడా వచ్చు. వీరి ప్రధాన వృత్తి గోండుల సంస్కృతిని ప్రచారం చేయడం. ప్రధాన్​లలో శిశువు పుట్టిన మూడు రోజులకు ఆడవారి కొరకే పుట్టి సభ ఏర్పాటు చేస్తారు. ఈ సభకు ముత్తైదువులు హాజరై నువ్వులు, బెల్లంతో తయారు చేసిన ఎంజూర్​ అనే దానిని పంచిపెడుతారు. ప్రధాన్​లలో వరకట్న సంస్కృతి లేదు. కానీ ప్రస్తుతం మెల్లమెల్లగా వరకట్నం అడుగు పెడుతున్నది. 

ప్రధాన్​లు ముఖ్యంగా పూజించే దేవతలు

1. పెర్సుపన్​  2. పెద్ద దేవుడు 3. జంగోభాయి 4. పాహాన్దీకుపార్​ లింగొ 5. అవ్వల్​ పేన్​ 6. ఆకిపేన్​ 7. భీమల్​పేన్​ 8. రాహుడ్​ పేన్​
తెలంగాణ ప్రాంతంలో ఎక్కువగా నాలుగో సగా నుంచి ఏడో సగా వరకు ఉన్నవారు అధికంగా ఉంటారు. 
నాలుగో సగా దేవుళ్ల గోత్రాల టోటెం తాబేలు
ఐదో సగ దేవుళ్ల గోత్రాల టోటెం గువ్వరకానికి చెందిన పిట్ట
ఆరో సగా దేవుళ్ల గోత్రాల టోటెం పులి 
ఏడో సగా దేవుళ్ల గోత్రాల టోటెం నాగసర్పం
పైన తెలిపిన టోటెంలను చంపడం గానీ తినడం గానీ చేయరు. 
ప్రధాన్​ల ముఖ్యమైన పండుగలు 
ధురాడి (హోళి), మాండావుస్​ (ఉగాది), చైత్​ బీంగా మర్మింగ్​, ఆకాడి, జామూర్ ఆవూస్, నాగ పంచమి, పోరా, బడీగా, దసరా, దీపావళి, పేర్సాపేన్​ పూజ సంక్రాంతి. 

గోండు నృత్యం

ఇది గోండులు ప్రదర్శించే కళా రూపం. ఈ నృత్యం ఆదిలాబాద్​ జిల్లా కేస్లాపూర్​లోని భీమదేవ్​ ఆలయం గోండు జాతికి సంబంధించింది. ఇక్కడ గోండు జాతివారు 15 రోజులపాటు గొప్ప జాతరను జరుపుకుంటారు. ఈ జాతరలో పాల్గొనడానికి అధిక సంఖ్యలో వాయిద్యకారులు, గాయకులు, నృత్యకారులు అందరూ హాజరై భక్తి గీతాలను పాడుతూ వివిధ రకాల నృత్య ప్రదర్శనలు చేస్తారు. ఈ ప్రదర్శనకు గోండు జాతి ప్రజలే కాకుండా ఇతర కులాలకు చెందిన వారు కూడా హాజరై ఆనందిస్తారు. ఈ ఉత్సవాల్లో పెండ్లి కూతుళ్లు ప్రధాన పాత్ర పోషిస్తారు.