
సంపూర్ణేష్ బాబు, సంజోష్ హీరోలుగా మన్మోహన్ మేనంపల్లి దర్శకత్వంలో చంద్ర చాగంలా నిర్మించిన చిత్రం ‘సోదరా’. ఏప్రిల్ 25న సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా సంపూర్ణేష్ బాబు మాట్లాడుతూ ‘అన్నదమ్ముల అనుబంధం ఎంత గొప్పదో చూపించే చిత్రమే ‘సోదరా’. అమాయకుడైన అన్న, అప్‌డేట్ అయిన తమ్ముడు మధ్య జరిగే కథ ఇది. ఇందులో అన్నగా బరువు బాధ్యతలు ఉన్న పాత్రను పోషించాను. నా రియల్ లైఫ్‌లో ఉండే నరసింహాచారికి ఈ చిత్రంలో చేసిన పాత్రకు దగ్గరి పోలికలు ఉంటాయి. నా నుంచి కోరుకునే వినోదంతో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్ కూడా ఉంటాయి. సినిమా చూసిన ప్రతి ఒక్కరూ తమ అన్నాదమ్ములను తలచుకుంటారు. వారి రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్‌ను గుర్తు చేసేలా సినిమా ఉంటుంది.
నటుడిగా విభిన్న పాత్రలు పోషించాలని ఉంది. ప్రస్తుతం కొన్ని సినిమాలతో పాటు ‘సూపర్ సుబ్బు’ అనే వెబ్ సిరీస్ చేస్తున్నా’ అని చెప్పాడు. మరో హీరో సంజోష్ మాట్లాడుతూ ‘ఇంతకుముందు ‘బేవర్స్’ అనే సినిమాలో నటించా. సంపూతో కలిసి బ్రదర్‌గా నటించడం చాలా ఆనందంగా ఉంది. బ్రదర్స్ అంతా కనెక్ట్ అయ్యేలా సినిమా ఉంటుంది. ఇందులో అన్నదమ్ముల అనుబంధం అందర్నీ నవ్విస్తుంది, ఏడిపిస్తుంది. స్వచ్ఛతకు మారుపేరుగా బ్రదర్స్ రిలేషన్ ఉండాలి. కానీ ఈ రోజుల్లో అలాంటి అనుబంధం కరువైపోయింది. ఎక్కడో కానీ అలాంటి అనుబంధాలు చూడటం లేదు. ఈ సినిమా చూసిన తర్వాత ఒకరిద్దరు మారినా మాకు సంతోషమే’ అని చెప్పాడు.