హైదరాబాద్ లో కలకలం సృష్టించిన గచ్చిబౌలి ప్రిజం పబ్ కాల్పుల కేసులో మరొకరిని అరెస్టు చేశారు పోలీసులు. ఈ కేసులో సాఫ్ట్ వేర్ ఇంజినీర్ రంజిత్ ను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. ఇప్పటికే మోస్ట్ వాంటెడ్ ప్రభాకర్ ను అరెస్టు చేసిన పోలీసులు తాజాగా సాఫ్ట్ వేర్ ఇంజినీర్ ను అదుపులోకి తీసుకున్నారు.
ఈ కేసులో మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ బత్తుల ప్రభాకర్ (30) కు రంజిత్ షెల్టర్ ఇచ్చినట్లుగా పోలీసులు గుర్తించారు. ప్రభాకర్ దొంగతనాల కోసం రంజిత్ ను వాడుకునేవాడని పోలీసుల దృష్టికి వచ్చింది. ప్రభాకర్ దొంగతనం చేసి వచ్చిన డబ్బును దాచుకోవడానికి రంజిత్ బ్యాంక్ అకౌంట్లను ఉపయోగించేవాడు. ఈ అంశపై పోలీసులు రంజిత్ ను విచారిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ కు చెందిన ప్రభాకర్ 2022లో వైజాగ్ జైలు నుంచి తప్పించుకుని పోలీసులకు దొరకకుండా హైదరాబాద్ లో నేరాలకు పాల్పడుతున్నాడు. ఇటీవళే హైదరాబాద్ గచ్చిబౌలి ప్రిజం క్లబ్ లో ఉన్నట్లు తెలుసుకున్న పోలీసులు.. అరెస్టు చేయడానికి వెళ్లినపుడు ప్రభాకర్ కాల్పులు జరిపిన విషయం తెలిసిందే. ఈ కేసులు ప్రభాకర్ కు సహకరిస్తూ వస్తున్న సాఫ్ట్ వేర్ రంజిత్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. ప్రభావర్ వెనుక ఇంకా ఎవరెవరు ఉన్నారన్న కోణంలో విచారణ జరుపుతున్నారు.
ఇంజినీరింగ్ కాలేజీలే లక్ష్యంగా...
గత రెండేండ్లుగా బత్తుల ప్రభాకర్‌ను ట్రాక్ చేస్తున్నామని సీపీ అవినాశ్ మహంతి తెలిపారు. నిందితుడు ఇంజినీరింగ్ కాలేజీలను టార్గెట్ చేసి దొంగతనాలు చేస్తున్నట్లు వివరించారు. అడ్మిషన్లు, పరీక్షలు, హాస్టల్ ఫీజుల రూపంలో వచ్చిన డబ్బును కాలేజీలో పెడతారని వాటిని సులభంగా దొంగతనం చేయవచ్చని డిసైడ్ అయ్యి టార్గెట్ చేసుకొని దొంగతనం చేస్తున్నాడు. 2022లో ప్రభాకర్‌ను అనకాపల్లి కోర్టు నుంచి వైజాగ్ సెంట్రల్ జైలుకు తరలిస్తుండగా తప్పించుకున్నాడు. అప్పటి నుంచి పరారీలో ఉంటూ సైబరాబాద్, హైదరాబాద్ లో దొంగతనాలు చేస్తూ వస్తున్నాడు..
ఇటీవల మొయినాబాద్‌లో జరిగిన ఒక దొంగతనం కేసులో పోలీసులకు ప్రభాకర్ వేలిముద్రలు దొరికాయి. దీంతో పోలీసులు ప్రభాకర్ కదలికలపై నిఘా పెట్టారు. అయితే, ప్రభాకర్ తనను గుర్తుపట్టకుండా ముసుగులు ధరిస్తూ, మకాం మారుస్తూ వస్తున్నట్లు చెప్పారు. ఈక్రమంలో శనివారం అతడిపై నిఘా పెట్టి పట్టుకున్నట్లు సీపీ తెలిపారు.