- పొలం తన పేరిట రాయమని ఒత్తిడి
- తట్టుకోలేక గడ్డి మందు తాగింది
- హైదరాబాద్ లోని మియాపూర్ లో ఘటన
మియాపూర్, వెలుగు: భర్త వేధింపులు తట్టుకోలేక ఓ సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన హైదరాబాద్ మియాపూర్‌లో జరిగింది. ఏపీలోని ఏలూరు జిల్లా చాట్రాయి మండలం చిట్టాపూర్ గ్రామానికి చెందిన వెంకట నాగలక్ష్మి(29) గచ్చిబౌలిలోని అసెంచర్ కంపెనీలో ఐటీ ఎంప్లాయ్. ఆమెకు భీమవరానికి చెందిన సతీశ్‌తో 2018లో పెండ్లి అయింది. 2019లో వీరికి పాప పుట్టింది. అనంతరం దంపతులు మధ్య మనస్పర్థలు రావడంతో 2023లో విడాకులు పొందారు.
గత ఆగస్టు 22న ఏలూరు జిల్లా లింగంపాలెం మండలం తోచిలుకకు చెందిన సివిల్ కాంట్రాక్టర్ మొవ్వ మనోజ్‌తో నాగలక్ష్మికి రెండో పెండ్లి అయింది. కట్నం కింద 1.5 ఎకరాల వ్యవసాయ భూమి ని తండ్రి కూతురి పేరిట రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చాడు. ఐదేండ్ల పాపతో కలిసి దంపతులు మియాపూర్ గోకుల్‌ప్లాట్స్ లో కాపురం పెట్టారు. ఆమె ఆఫీసుకు వెళ్తుండగా, మనోజ్ఖాళీగా ఇంటి వద్దే ఉంటున్నాడు. ఇటీవల మనోజ్ భార్యను వేధించడం మొదలుపెట్టాడు. కట్నం కింద ఇచ్చిన భూమిని తన పేరున రిజిస్ట్రేషన్ చేయాలని ఒత్తిడి చేస్తున్నాడు.
మానసికంగా, శారీరకంగా వేధిస్తున్నాడు. ఆమెను అనుమానిస్తూ బూతులు తిడుతూ కొడుతున్నాడు. ఐదేండ్ల పాపను హాస్టల్లో జాయిన్చేయాలని, తమతో వద్దని వేధిస్తున్నాడు. తన అవసరాలకు డబ్బు ఇవ్వాలని, ఫోన్‌పే, గూగుల్‌పే పాస్వర్డ్లు చెప్పాలంటూ ఒత్తిడి చేస్తున్నాడు. నెల రోజుల కింద మరోసారి తీవ్రంగా భార్యను కొట్టాడు. ఆమె తన అత్త లక్ష్మి దృష్టికి తీసుకెళ్లగా కొడుకుకే మద్దతుగా మాట్లాడింది. తట్టుకోలేకపోయిన బాధితురాలు ఫోన్ చేసి విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పింది.
ఆన్ లైన్ ఆర్డర్ లో గడ్డి మందు తెప్పించుకుని..
వెంకట నాగలక్ష్మి ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకుంది. గత నెల 28న బిగ్ హాట్.కామ్ వెబ్సైట్లో గడ్డిమందును ఆర్డర్ చేయగా.. ఈనెల 4న డెలివరీ అయ్యింది. ఈ నెల 11న మధ్యాహ్నం ఇంట్లో ఎవరూ లేనప్పుడు గడ్డి మందు తాగింది. ఇంటి యజమాని చూసి వెంటనే ఆమె కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చాడు. ఆమెను కేపీహెచ్‌బీలోని ఓ ప్రైవేటు హాస్పటల్ కు తరలించగా చికిత్స పొందుతూ గురువారం రాత్రి మృతి చెందింది. తన కూతురు మృతికి భర్త మనోజ్, అత్త లక్ష్మి కారణమని శ్రీనివాసరావు మియాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన శుక్రవారం మృతురాలి భర్త మనోజ్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.