ప్రేమించిన యువతి మాట్లాడడం లేదని ఓ సాఫ్ట్ వేర్ ఉద్యోగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన హైదరాబాద్ లోని చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. సదాశివపేట మండలం ఆరూరు గ్రామానికి చెందిన సాఫ్ట్ వేర్ ఉద్యోగి అఖిల్ (28) చందానగర్ లోని ఓ లాడ్జ్ లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అఖిల్ గచ్చిబౌలిలోని ఓ సాఫ్ట్ వేర్ కంపెనీలో గత కొంతకాలంగా పని చేస్తున్నాడు. ఈ క్రమంలో అతను ఓ యువతిని ప్రేమించాడు. రోజు ఆమెను కలవడం.. ఫోన్ లో గంటల తరబడి మాట్లాడుకోడం చేసేవారు. ఇలా వారి ప్రేమాయణం సాగుతున్న సమయంలో.. ఒక్కసారిగా ప్రేమించిన యువతి అతనితో మాట్లాడడం మానేసింది. అఖిల్ ఫోన్ చేసినా ఆ యువతి స్పందించడం లేదు. అంతేకాదు తన ఫోన్ నెంబర్ ను కూడా బ్లాక్ చేసింది ఆ యువతి.
దీంతో అఖిల్ తీవ్ర మనస్తాపం చెందాడు. మార్చి 17న చందానగర్ పీఎస్ పరిధిలోని ఓ లాడ్జ్ లో రూం తీసుకుని అఖిల్ బలవన్మరణానికి పాల్పడ్డాడు. అయితే ఇంత చిన్న దానికే చనిపోడం ఏంటని అఖిల్ సన్నిహితులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సమాచారం అందుకున్నా పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేశారు..మృతదేహాన్ని పోస్ట్ మార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. తాను ప్రేమించిన యువతి తనతో మాట్లాడడం లేదని, తన ఫోన్ నెంబర్ బ్లాక్ లో పెట్టిందని సూసైడ్ నోటు రాసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు.