డెత్ మిస్టరీ : మురికి కాలువలో సాప్ట్ వేర్ ఉద్యోగి డెడ్ బాడీ

వరంగల్ జిల్లాలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. పట్టణంలోని ఎస్.ఆర్.నగర్ లో ఓ సాప్ట్ వేర్ ఉద్యోగి మృతదేహం అనుమానాస్పద స్థితిలో కనిపించింది. మే 20వ తేదీ శనివారం ఉదయం రోడ్ పక్కన మురుగు కాలువలోని దృశ్యాన్ని చూసి షాక్ అయ్యారు స్థానికులు. అతనికి కొంత దూరంలోనే  బైక్ పడి ఉంది. స్థానికుల సమాచారంతో పోలీసులు విచారణ చేస్తున్నారు. వివరాల్లోకి వెళితే..

వరంగల్ పట్టణానికి చెందిన కిరణ్ కుమార్ ఓ సాఫ్ట్ వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. మే 19వ రాత్రి ఇంటి నుంచి బయటకు వెళ్లిన కిరణ్.. తిరిగి రాలేదు. ఉదయానికి వస్తాడులే.. ఫ్రెండ్స్ దగ్గరకు వెళ్లి ఉంటాడని అతని కుటుంబ సభ్యులు భావించారు. ఉదయానికి ఎస్.ఆర్.నగర్ కాలనీలోని.. ఓ మురికి కాలువలో కిరణ్ డెడ్ బాడీ కనిపించింది. కిరణ్ తీసుకెళ్లిన బైక్.. కొంత దూరంలో పడి ఉంది.

బైక్ పై వెళుతూ ప్రమాద వశాత్తు కాలువలో పడి చనిపోయాడా లేక ఏదైనా వాహనం ఢీకొని వెళ్లిందా లేక ఎవరైనా చంపి కాలువలో పడేశారా అనేది తెలియాల్సి ఉంది. పోలీసులు మాత్రం అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసి.. విచారణ చేస్తున్నారు. కాలనీలోని సీసీ టీవీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. కిరణ్ కుమార్ తో ఎవరికైనా వివాదాలు ఉన్నాయా అనే కోణంలోనూ విచారణ చేస్తున్నారు పోలీసులు.