- హైదరాబాద్‌లో బెంగళూరు సాఫ్ట్వేర్ ఉద్యోగి నిర్వాకం
- ఐటీ కారిడార్ లో అదుపులోకి తీసుకున్న పోలీసులు
గచ్చిబౌలి, వెలుగు: హైదరాబాద్‌లో ఆదివారం అర్ధరాత్రి భారీగా గంజాయి పట్టుబడింది. గచ్చిబౌలీలోని ప్రశాంతీ హిల్స్ టింబర్ లేక్ వ్యాలీ వద్ద గంజాయి విక్రయిస్తున్న ఓ సాఫ్ట్వేర్ ఇంజినీర్‌ను శంషాబాద్ ఎక్సైజ్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుంచి 1 కేజీ ఎండు గంజాయి(లోకల్)ని, 175 గ్రాముల ఓజి కుష్(విదేశీ గంజాయి)ని, బైకు, సెల్‌ఫోన్ ను స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల ప్రకారం..ఏపీలోని ఈస్ట్ గోదావరి జిల్లా రాయవరం గ్రామానికి చెందిన శివ రామ్(28) బెంగుళూరులోని డెలాయిట్ కంపెనీలో సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నాడు. ఏడాదికి 14 లక్షల జీతం తీసుకుంటున్నాడు. మరింతగా డబ్బు సంపాదించాలనే అత్యాశతో గంజాయి అమ్మాలని ప్లాన్ చేశాడు.
సోమవారం నుంచి శుక్రవారం వరకు జాబ్ చేసి.. రెండు నెలలుగా శని, ఆదివారాల్లో గంజాయి విక్రయిస్తున్నాడు. బెంగుళూరులోనే ఉండే అజయ్(ఈస్ట్ గోదావరి) అనే వ్యక్తి వద్ద ఓజి కుష్.. గ్రాముకి రూ. 1500 చొప్పున కొనుగోలు చేశాడు. దానితోపాటు లోకల్ గంజాయిని కొన్నాడు. ప్రైవేట్ ట్రావెల్ బస్సులో వచ్చి హైదరాబాద్ ఐటీ కారిడార్ లోని గచ్చిబౌలి, మాదాపూర్, కొండాపూర్, రాయదుర్గం ఏరియాల్లో నివసించే ఐటీ ఉద్యోగులకు అమ్ముతున్నాడు.
ఓజి కుష్ గ్రామ్ కి రూ. 3వేల చొప్పున అమ్ముతూ సొమ్ము చేసుకుంటున్నాడు. సమాచారం అందుకున్న శంషాబాద్ టాస్క్ ఫోర్స్ పోలీసులు ఆదివారం అర్ధరాత్రి ప్రశాంతి హిల్స్ కాలనీ వద్ద అనుమానాస్పదంగా కనిపించిన శివరామ్ ను తనిఖీ చేశారు. అతని వద్ద బ్యాగ్ లో 1కేజీ గంజాయి, 175 గ్రాముల ఓజి కుష్ స్వాధీనం చేసుకున్నారు. దీంతో పాటు బైక్, సెల్ ఫోన్ స్వాధీనం చేసుకొని శేరిలింగంపల్లి ఏక్సైజ్ పోలీసులకు అప్పగించారు.శివ రామ్ కి గంజాయి విక్రయించిన వ్యక్తి పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు చెప్పారు.