అమెరికాలో రోడ్డు ప్రమాదం.. వీఎం బంజర్​వాసి మృతి

పెనుబల్లి, వెలుగు: అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో వీఎం బంజర్​కు చెందిన సాఫ్ట్​వేర్ ​ఇంజినీర్​ చనిపోయాడు. ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం వీఎం బంజర్​ గ్రామానికి చెందిన కల్లూరు షుగర్​ఫ్యాక్టరీ  కేన్ డెవలప్​మెంట్ ​చైర్మన్ ​ముక్కర భూపాలరెడ్డి కొడుకు సాయిరాజీవ్​రెడ్డి(33) పదేండ్లుగా అమెరికాలోని టెక్సాస్ ​రాష్ట్రంలోని ఆస్ట్రీన్ ​ప్రాంతంలో సాఫ్ట్​వేర్ ​ఇంజినీర్​గా పని చేస్తున్నాడు.

అతను ఉండే ప్రాంతంలో కొత్తిల్లు కొన్నాడు. ఆదివారం రాత్రి పాత ఇంటి నుంచి కంటైనర్​లో అతడి భార్య ఆశారెడ్డితో కలిసి సామగ్రి తరలిస్తుండగా రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ యాక్సిడెంట్​లో సాయి రాజీవ్​రెడ్డి అక్కడికక్కడే చనిపోయాడు. ఆశారెడ్డి గాయపడగా హాస్పిటల్​ కు తరలించారు. రెండు నెలల కింద రాజీవ్​రెడ్డి తండ్రి భూపాలరెడ్డి అనారోగ్యంగా ఉండడంతో వీఎం బంజర్​కు వచ్చిన సాయి రాజీవ్​రెడ్డి చికిత్స చేయించి తిరిగి అమెరికాకు వెళ్లిపోయాడు. ఇంతలోనే కొడుకు మృతి చెందడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.