
- ముంబైలో సరికొత్త సైబర్ మోసం వెలుగులోకి
ముంబై: సైబర్ నేరగాళ్లు కొత్త కొత్త ఎత్తులతో ప్రజలను దోచుకుంటున్నారు. ప్రభుత్వం ఓవైపు అవగాహన చేపడుతున్నా ఈ మోసాలు ఆగడంలేదు. తాజాగా మహారాష్ట్రలోని ముంబైలో జ్యోతిష్యం పేరుతో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ నుంచి కేటుగాళ్లు రూ.12 లక్షలు కాజేశారు. బాంద్రా కుర్లా కాంప్లెక్స్‌కు చెందిన 25 ఏండ్ల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ తన వ్యక్తిగత సమస్యలకు పరిష్కారం కోసం జ్యోతిష్యాన్ని ఆశ్రయించాడు. తన భవిష్యత్తు ఎలా ఉండబోతోందని తెలుసుకోవడానికి ఈ ఏడాది జనవరిలో 'డివైన్ టాక్' అనే జ్యోతిష్య యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకున్నాడు. అందులో నిశాంత్ అనే నకిలీ స్పిరిచువల్ గైడ్ నంబర్ తీసుకుని ఫోన్ చేశాడు.
జీవితం సంతోషంగా సాగాలంటే పూజలు చేయాలని స్పిరిచువల్ గైడ్ సూచించాడు. అందుకు రూ.6,300 ఖర్చు అవుతుందన్నాడు. నిశాంత్ మాటలు నమ్మిన యువకుడు.. పూజలు జరిపించడానికి రూ. 6,300 ఆన్ లైన్ ద్వారా చెల్లించాడు. దాంతో నిశాంత్.. బడే మహారాజ్ అనే మరో వ్యక్తిని వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా యువకుడికి పరిచయం చేశాడు. బడే మహారాజే పూజలు చేస్తాడని చెప్పి వీడియో కాన్ఫరెన్సింగ్ నుంచి వెళ్లిపోయాడు.
కానీ బడే మహారాజ్ మరో రూ.15,300 డిమాండ్ చేశాడు. ఇంతకు ముందు ఇచ్చిన రూ. 6,300 కేవలం కన్సల్టేషన్ ఫీజు మాత్రమేనని తెలిపాడు. దాంతో చేసేదిలేక సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ రూ. 15,300 యూపీఐ ద్వారా చెల్లించాడు. ఆ తర్వాత బడే మహారాజ్ వివిధ సాకులు చెప్పి రూ.28,000 వసూలు చేశాడు. పూజ అసంపూర్తిగా జరిగిందని, మధ్యలో ఆపడం వల్ల ప్రాణాలకు ముప్పు వాటిల్లుతుందని యువకుడిని బెదిరించి.. జనవరి నుంచి మార్చి మధ్య పలు విడతలుగా రూ.12.50 లక్షలు వసూలు చేశాడు. చివరికి మోసపోయానని గ్రహించి పోలీసులను ఆశ్రయించాడు.