కరోనా టైమ్ చాలామందిని కొత్తగా ఆలోచించేలా చేసింది. అప్పటిదాకా చేస్తున్న బిజినెస్, జాబ్స్ నుంచి కొత్త వాటి వైపు నడిపించింది. అలాంటివాళ్లలో ఒకడు కొచ్చికి చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ రెంజిత్ జార్జ్. అందరికీ హెల్దీ, టేస్టీ ఫుడ్ అందించాలనే లక్ష్యంతో ఫుడ్ బిజినెస్‌లోకి వచ్చాడు. ఫుడ్ ఫ్లేవర్స్ అనే స్టార్టప్ మొదలుపెట్టాడు. ఐదు రకాల రెడీ టు కుక్ చపాతీలు అమ్ముతున్నాడు. ఫుడ్ప్రెనూర్గా రాణిస్తున్న రెంజిత్ జర్నీ ...
కంప్యూటర్ ఇంజనీరింగ్ చదివాడు రెంజిత్. మొదట్లో స్కూలు పిల్లలకు ఫుడ్ అందించే కంపెనీ పెట్టాడు. అయితే, కరోనా వచ్చిన తర్వాత స్కూళ్లు మూతపడ్డాయి. దాంతో బిజినెస్ దెబ్బతిన్నది. బిజినెస్ నడవాలంటే కొత్తగా ఏదైనా చేయాలి అనుకున్నాడు. ఆ టైమ్‌లోనే క్రియేటివ్‌గా ఆలోచించే చింజు ఫిలిప్‌ని కలిశాడు. రెడీ టు కుక్ చపాతీల బిజినెస్ బాగుంటుందని చింజు సలహా ఇచ్చింది. ఇద్దరూ కలిసి ‘ఫుడ్ ఫ్లేవర్స్’ అనే స్టార్టప్ తెచ్చారు. ఆరోగ్యాన్ని పెంచే మునగాకులు, రాగులు, అవిసె గింజలు, పాలకూర, కొర్రలు కలిపి తయారుచేసిన చపాతీలు అమ్మడం మొదలుపెట్టారు.
ఒక్క ప్యాకెట్ వంద రూపాయలు
పది చపాతీలు ఉన్న ప్యాకెట్ ధర వంద రూపా యలు. ఒకదానికొకటి అంటుకోకుండా చపాతీల మధ్య ఆయిల్ పేపర్ ఉంటుంది. చపాతీలు ఫ్రెష్‌గా ఉండేందుకు, ఎక్కువ రోజులు స్టోర్ చేయడానికి కార్టన్ బోర్డులతో తయారుచేసిన బాక్సులు వాడతారు. ఎక్కువమందికి ఈ రెడీ టు కుక్ చపాతీలు చేరాలనే ఆలోచనతో సూపర్ మార్కెట్లు, బేకరీలు, ఆర్గానిక్ షాపుల్లో... లైఫ్‌స్టయిల్ డిసీజ్‌లు ఉన్నవాళ్లకోసం మెడికల్ షాపుల్లో పెడుతున్నారు. అంతేకాదు కస్టమైజ్డ్ చపాతీలు కూడా తయారుచేస్తున్నారు. ప్రిజర్వేటివ్స్ ఎక్కువగా కలపని చపాతీలు కూడా దొరుకుతాయి. రాష్ట్రమంతటా ఒక్కరోజులోనే డెలివరీ చేసేందుకు ఒక కొరియర్ కంపెనీతో అగ్రిమెంట్ చేసుకున్నారు. ఈ మధ్యే ఆన్లైన్ www.foodflavours.in అమ్మకాలు కూడా మొదలుపెట్టారు. ఈ చపాతీలకి మంచి రెస్పాన్స్ వస్తుండడంతో చిరుధాన్యాలతో తయారుచేసిన నూడుల్స్, టొట్రిల్లా ర్యాప్స్ వంటివి కూడా అమ్మాలనే ఆలోచనల్లో ఉన్నాడు రెంజిత్.
త్వరలో చిరుధాన్యాల నూడుల్స్
‘‘కరోనా వల్ల హెల్దీఫుడ్ తినేవాళ్ల సంఖ్య పెరిగింది. దాంతో అప్పుడే ఫుడ్ బిజినెస్‌లోకి రావాలి అనుకున్నాం. ఆరోగ్యాన్ని పెంచే ఫుడ్ అందించాలనే ఉద్దేశంతో రెడీ టు కుక్ చపాతీలు అమ్మాలి అనుకున్నాం. అయితే, వెంటనే మార్కెట్లోకి రాలేదు. ఏడాదిన్నర పాటు ఈ చపాతీలను అమ్మి, కస్టమర్ల ఒపీనియన్ తీసుకున్నాం. చాలామంది ‘బాగున్నాయి’ అని చెప్పడంతో స్టోర్ ఓపెన్ చేశాం. ప్రస్తుతం రోజుకు 15 వేల నుంచి 20 వేల చపాతీలు చేస్తున్నాం. రాబోయే రోజుల్లో 50 వేల చపాతీలు చేయాలనే ప్లాన్‌తో ఉన్నాం” అంటున్నాడు రెంజిత్.