మన ఇంజనీర్లకు జాబే కావాలట!

దేశంలోని అన్ని రాష్ట్రాల్లో కంటే దక్షిణాది రాష్ట్రాల్లోనే ఇంజినీరింగ్‌ సీట్లు ఎక్కువ. మొత్తం సీట్లలో 50 శాతం దక్షిణాది అయిదు రాష్ట్రాల్లోనే ఉన్నాయి. ఇక్కడ గ్రాడ్యుయేట్లయినవాళ్లలో 54 శాతం ఉద్యోగావకాశాలు పొందుతున్నారు. హ్యూమన్‌ రీసోర్స్‌ డెవలప్‌ మెంట్‌ మినిస్ట్రీకి ఇటీవల అందిన ఒక రిపోర్ట్‌ ప్రకారం… దేశంలో గ్రాడ్యుయేట్లవుతున్న ఇంజినీర్లలో 3.45 లక్షల మంది ఉద్యోగాల్లో చేరడానికే ఆసక్తి చూపుతున్నారు. వీరిలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ , కర్నాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో 1.88 లక్షల మంది జాబ్స్‌ లో చేరుతున్నారు. ఇంజినీరింగ్‌ విద్యలో నాణ్యతను పెంచడానికి ఉద్దేశించిన ఈ నివేదికను బీవీఆర్‌‌ మోహన్‌ రెడ్డి కమిటీ రూపొందించింది. నిజానికి దేశంలో 16.35 లక్షల ఇంజినీరింగ్‌ సీట్లుండగా, సగానికి కంటే తక్కువగా 8 లక్షల సీట్లు మాత్రమే భర్తీ అవుతున్నాయి. వారిలో 3.45 లక్షల మంది మాత్రమే ఇంజినీరింగ్‌ పట్టాతో బయటకు వస్తున్నారు. ఇంజినీరింగ్‌ విద్యకు దేశంలో డిమాండ్‌ బాగానే ఉన్నప్పటికీ, గ్రాడ్యుయేట్లలో నాణ్యత లోపిస్తుందన్నది రిపోర్టు ప్రత్యేకంగా ప్రస్తావించింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా బయటకు వస్తున్న ఎనిమిది లక్షల మంది ఇంజినీర్లలో కేవలం ఒక్క శాతం మాత్రమే ఎంటర్‌‌ప్రెన్యూర్‌‌షిప్‌ వైపు వెళ్తున్నారు. మిగతావాళ్లలో చాలామటుకు ఉద్యోగాలు వెతుక్కుంటూ సెటిల్‌ అవుదామన్న ఆలోచనలతోనే ఉంటున్నారు. ఆయా ఇంజినీరింగ్‌ కాలేజీల్లో ఇంక్యుబేషన్‌ సెంటర్లున్నాయన్న వివరాలుగానీ, ఒక్కో కాలేజీ నుంచి ఎన్ని స్టార్టప్స్‌ వస్తున్నాయన్నది కానీ స్పష్టంగా తెలియడం లేదు. 2017-18 విద్యా సంవత్సరానికి సంబంధించి మొత్తం 3,500 కాలేజీల నుంచి కేవలం 1,500 మాత్రమే స్టార్టప్స్‌ వచ్చినట్లుగా అంచనా. ఇక ఎనిమిది లక్షల మంది ఇంజినీర్లలో 6,000 మంది మాత్రమే ఎంటర్‌‌ప్రెన్యూర్‌‌షిప్‌ దిశగా అడుగులేశారు.

ఉద్యోగావకాశాలను మెరుగు పరచడానికిగాను ఆన్‌ లైన్‌ కోర్సులు, అప్రెంటీస్‌ షిప్‌ , ఇంటర్న్‌‌షిప్‌ వంటివి ఇంజినీరింగ్‌ కాలేజీల్లో విధిగా అమలు చేయాల్సి ఉంటుంది. అప్రెంటీస్‌ షిప్‌ ని గనుక తప్పనిసరి చేసినట్లయితే, కంపెనీలలో మూడు నుంచి ఎనిమిది నెలల వరకు ఇంజినీరింగ్‌ విద్యార్థులకు అప్రెంటీస్‌ షిప్‌ దొరుకుతుంది. ప్రతి ఒక్క విద్యార్థికి నెలకు 2,500 చొప్పున కంపెనీలకు ప్రభుత్వం చెల్లించాల్సి ఉంటుంది. దీనివల్ల కంపెనీలకు వర్స్‌ ఫోర్స్‌ కి కొదవ ఉండదు. దరిదాపుగా రెండున్నర వంతులు అప్రెంటీస్‌ షిప్‌ ద్వారానే భర్తీ కావచ్చు. 2017లో ఐటీ సెక్టార్‌‌ సుమారు 26 వేల మందికి అప్రెంటీస్‌ షిప్‌ ని కల్పించగా, పోయినేడాది ఒక్కరికి కూడా అప్రెంటీస్‌ షిప్‌ ఇవ్వకపోవడం గమనార్హం. దీనివల్ల విద్యార్థి దశలోనే ఇంజినీరింగ్‌ నైపుణ్యం దక్కకుండా పోతోంది. బ్రాంచీలను ఎంచుకోవడంలోకూడా ఇంజినీరింగ్‌ విద్యార్థుల్లో ముందు చూపు ఉండడం లేదు. మొత్తం దేశంలో భర్తీ అవుతున్న 8 లక్షల సీట్లలో సంప్రదాయిక బ్రాంచీలను ఎంచుకునేవారే ఎక్కువగా ఉంటున్నారు. సివిల్‌ , మెకానికల్‌ , కెమికల్‌ వంటి బ్రాంచీలవైపు విద్యార్థులు ఆసక్తి చూపుతున్నారు. సాంకేతికంగా చోటు చేసుకుంటున్న మార్పులకు అనుగుణంగా ఆలిండి యా టెక్నికల్‌ ఎడ్యుకేషన్‌ కౌన్సిల్‌ (ఏఐసీటీఈ)వారు ఇంజినీరింగ్‌ కరికులమ్‌ లో పలు అంశాలను చేర్చాల్సి ఉంది. ఏరోనాటికల్‌ , అగ్రికల్చర్‌‌, మెటలర్జికల్‌ తదితర బ్రాంచీలలో టీచిం గ్‌ మెథడ్స్‌ ని రివైజ్‌ చేయాలి. ఇది ఇండియాలోనే కాకుండా, ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న ఉద్యోగావకాశాలను మెరుగు పరుస్తుం ది. ఆయా రంగాల్లో కొత్త పారిశ్రామికవేత్తలు ప్రవేశించడానికికూడా వెసులుబాటు కల్పిస్తుంది.