- రోడ్డు బాగు చేయాలని గాంధీ విగ్రహానికి వినతిప్రతం
రామచంద్రాపురం (అమీన్పూర్), వెలుగు: సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపల్ పరిధిలో పలు కాలనీలలో నివాసం ఉంటున్న సాఫ్ట్వేర్ ఉద్యోగులు, ఇతర ఉద్యగోలు తాము ప్రయాణించే రోడ్డు నరకప్రాయంగా మారిందని రోడ్డెక్కారు. చందానగర్ నుంచి బందంకొమ్ము మీదుగా అమీన్పూర్ వరకు ఉన్న రోడ్డుపై అడుగుకో గుంత పడి ప్రమాదకరంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. చుట్టు పక్కల కాలనీ వాసులంతా కలిసి ఆదివారం రిపబ్లిక్ డే సందర్భంగా అమీన్పూర్ రోడ్డుపై భారీ ర్యాలీ చేపట్టి గాంధీ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇంటి పన్నుల రూపంలో లక్షల ట్యాక్స్‌లు కడుతున్న తమకు సురక్షిత రవాణా వ్యవస్థను ఏర్పాటు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. చందానగర్ నుంచి వచ్చే బందంకొమ్ము రోడ్డు గుంతలమయంగా మారిందన్నారు. గర్భిణులు, చిన్న పిల్లలు, వృద్ధులు ఈ రోడ్డు వల్ల ఆస్పత్రుల పాలవుతున్నారన్నారు. ఈ విషయంపై అధికారులకు, నాయకులకు ఎన్నిసార్లు విన్నవించినా సమస్య పరిష్కారం కాలేదన్నారు. ఇప్పటికైనా అమీన్పూర్ రోడ్డును బాగు చేసి పన్ను చెల్లింపుదారులకు సహకరించాలని వారు డిమాండ్ చేశారు.