కరీంనగర్, వెలుగు: జిల్లాలోని పలు చెరువుల్లో మట్టి దందా యథేచ్చగా కొనసాగుతోంది. సర్కార్ నుంచి కొద్ది మేర అనుమతులు తీసుకుని అంతకు పదింతల మట్టిని తోడేస్తున్నారు. సిల్ట్ కు బదులు ప్రైవేట్ వెంచర్లు, ఇళ్ల నిర్మాణాల కోసం మొరాన్ని కూడా తరలిస్తూ కోట్లాది రూపాయలను కొల్లగొడుతున్నారు. ఇటీవల రామడుగు మండలం వెలిచాలలో మట్టి దందాను ప్రశ్నించిన జెడ్పీ కోఆప్షన్ సభ్యుడు షుక్రుద్దీన్ పై ఎమ్మెల్యే సుంకె రవి శంకర్ సమక్షంలో బీఆర్ఎస్ నేత దాడికి దిగడం చర్చనీయాంశంగా మారింది. దందాకు అడ్డొస్తే దాడులకు దిగడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఇటుకబట్టీలకు, ఖాళీ ప్లాట్లు నింపేందుకు..
జిల్లాలో ఇటుకబట్టీల కోసం, ఖాళీ ప్లాట్లు నింపేందుకు ఎక్కువగా చెరువుల్లో మట్టి తరలిస్తున్నారు. కరీంనగర్ జిల్లా రామడుగు మండలం వెలిచాల, రామచంద్రపురం, చిప్పకుర్తి గ్రామాల శివారు చెరువులలో, చొప్పదండి లోని చెరువులో నుంచి అధికార పార్టీ నాయకుల కనుసైగల్లో జిల్లాతోపాటు ఇతర ప్రాంతాల్లోని ఇటుకబట్టీలకు మట్టిని తరలిస్తున్నారు. మట్టి తరలింపు కోసం ఇరిగేషన్ అధికారుల అనుమతితోపాటు గ్రామపంచాయతీలో తీర్మానం తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంటుంది. కొద్దిపాటి మట్టి తరలింపు కోసం పర్మిషన్ తీసుకుని, ఆ పర్మిషన్ లెటర్ తో వేలాది ట్రిప్పుల మట్టిని తరలించుకుపోతున్నారు. పోలీస్, రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులకు మామూళ్లు ముట్టజెప్పడంతో అడ్డూఅదుపు లేకుండా పోయింది. అనుమతి పత్రంలో లారీ నంబర్ ను పేర్కొనకపోవడంతో ఎన్ని లారీల మట్టిని తరలించారో లెక్క లేకుండా పోతోంది.
అలాగే మట్టి తరలింపు కేవలం ఉదయం నుంచి సాయంత్రం వరకు కొనసాగాల్సి ఉండగా రాత్రి, పగలు తేడా లేకుండా తరలించడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. ఇటీవల రామడుగు మండల కేంద్రం మీదుగా ఇతర ప్రాంతాలకు మట్టి తరలిస్తుండగా రామడుగు గ్రామస్తులు లారీలను వారం రోజుల క్రితం అడ్డుకొని పోలీస్ స్టేషన్ కు తరలించినా మట్టి అక్రమ రవాణా ఆగడం లేదు. ఇష్టారాజ్యంగా తవ్వకాలు చేపట్టడంతో చెరువుల ఎఫ్ టీఎల్ అంచనాలు తప్పే అవకాశముందని, నీటి నిల్వ సామర్థ్యం పెరిగితే చెరువు కట్టలకు ప్రమాదం పొంచి ఉంటుందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
నాయిని చెరువులో మట్టి దొంగలు..
జమ్మికుంట నాయిని చెరువుతోపాటు మండలంలోని కోరపల్లి, వెంకటేశ్వర్లపల్లి గ్రామాల పరిధిలో చెరువులు, కుంటల నుంచి మట్టిని గత రెండు వారాలుగా అక్రమంగా తరలిస్తున్నారు. కొందరు ప్రజా ప్రతినిధులు, అధికారుల అండదండలతో కొందరు వ్యక్తులు ముఠాగా ఏర్పడి పర్మిషన్ లేకుండానే మట్టి తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ఒకప్పుడు సెలవు రోజులు, రాత్రిపూట మాత్రమే గుట్టుగా మట్టిని తరలించే అక్రమార్కులు ప్రస్తుతం పట్టపగలే బరితెగించి తరలిస్తున్నారు. ప్రొక్లయినర్లతో చెరువుల్లోని మట్టిని తోడేస్తూ చెరువులు, కుంటలను లోయలుగా మారుస్తున్నారని స్థానికులు వాపోతున్నారు.
అనుమతులు లేకుండానే తవ్వకాలు..
వాల్టా చట్టం ప్రకారం.. సొంత భూమిలోనైనా, ప్రభుత్వ భూమిలోనైనా మట్టి తీయాలంటే ముందుగా తహసీల్దార్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలి. భూగర్భ గనుల శాఖ నుంచి సైతం అనుమతి తీసుకోవాలి. చెరువులు, కుంటల్లో మట్టి తీయాలంటే ఇరిగేషన్ ఇంజినీర్లు, తహసీల్దార్ పర్మిషన్ తప్పనిసరి. కానీ ఇవేమి లేకుండా వాల్టా చట్టాన్ని ఉల్లంఘిస్తున్నారు. ఇప్పటికైనా రెవెన్యూ, ఇరిగేషన్, భూగర్భ గనుల శాఖ అధికారులు స్పందించి చెరువుల్లో మట్టి అక్రమ తవ్వకాలను నిలిపివేయాలని కోరుతున్నారు.
కలెక్టర్ కు ఫిర్యాదు
రామడుగు మండలం వెలిచాల గ్రామంలోని పెద్ద చెరువు నుంచి ఇటుక బట్టీల కోసం ఒక కాంట్రాక్టర్ 3,300 క్యూబిక్ మీటర్ల మట్టిని తరలించేందుకు పర్మిషన్ తీసుకుని 30 వేల క్యూబిక్ మీటర్ల మట్టిని తరలించుకుపోయాడని అదే గ్రామానికి చెందిన అధికార పార్టీకి చెందిన జిల్లా పరిషత్ కోఆప్షన్ సభ్యుడు షుక్రుద్దీన్ జిల్లా కలెక్టర్ కు ఇటీవల కంప్లైంట్ చేశారు. మట్టి అక్రమ తరలింపు పై నీటిపారుదల శాఖ అధికారులకు తొలుత కంప్లైంట్ చేయగా వారికి కూడా ఖర్చులు ఉంటాయని ఉచిత సలహాలు ఇచ్చారని కంప్లైంట్ లో పేర్కొన్నారు. పర్మిషన్ కంటే అదనంగా తరలించిన 27 వేల క్యూబిక్ మీటర్ల మట్టికి డబ్బులు లెక్కగట్టి ప్రభుత్వ ఖజానాలో జమ చేయకుండ మట్టిని అమ్ముకుంటూ కాంట్రాక్టర్ సొమ్ము చేసుకుంటున్నాడని ఫిర్యాదులో ఆరోపించారు.