
మనిషి అభివృద్ధి పేరిట ప్రకృతి వినాశనం చేస్తున్నకొద్దీ భూమి సహజ స్వరూపం మారిపోతోంది. వ్యవసాయానికి కీలకమైన భూసారం రోజురోజుకూ తగ్గిపోతోంది. ఒకప్పుడు ఎంతో సారవంతంగా అన్ని రకాల పంటలు పండించేందుకు వీలుగా ఉండే భూమి ఇప్పుడు నిస్సారంగా మారుతోంది. మన పూర్వీకులు ఎటువంటి ఎరువులు, పురుగులు మందులు వాడకుండానే అన్ని రకాల పంటలను భూమిలోని సహజ పోషకాల సహాయంతో పండించేవారు.
ఎటువంటి అనారోగ్య సమస్యలు లేకుండా వారు చాలా సంవత్సరాలపాటు ఆరోగ్యకరమైన జీవితాన్ని గడిపేవారు. కానీ, ప్రస్తుతం పెరుగుతున్న జనాభాకు తగినంత ఆహార లభ్యత కోసం హరిత విప్లవం, హైబ్రిడ్ వంగడాలు రావడం, విరివిగా రసాయన ఎరువులు, పురుగు మందుల వాడకం పెరగడం వలన నేల ఆరోగ్యస్థితి పూర్తిగా దెబ్బతిన్నది. అలాగే నానాటికీ సాగు విధానాలు పూర్తిగా మారిపోయి భూమిని నిస్సారంగా మారుస్తున్నాయి.
భూసారం అంటే ఏమిటి..?
భూసారం అనేది మట్టిలో ఉండే పోషకాలు, ఖనిజ పదార్థాలు, సూక్ష్మజీవుల సమతుల్య సమూహం. ఇవి పంటల పెరుగుదలకు, భూమి జీవశక్తిని నిలిపి ఉంచేందుకు కీలకం. మట్టిలో నత్రజని (N), భాస్వరం (P), పొటాషియం (K), సేంద్రీయ పదార్థాలు, సూక్ష్మజీవులు ఉండటం వల్లనే పంటలు అధిక దిగుబడులు సాధించడం జరుగుతోంది. భూమి సారం కోల్పోతే పంటల పెరుగుదల మందగిస్తుంది.
భవిష్యత్తులో ఆహార సంక్షోభం, పర్యావరణ అసమతుల్యత ఏర్పడే ప్రమాదం ఉంది. భూసారం క్షీణించడానికి చాలా కారణాలు ఉన్నాయి. వ్యవసాయంలో యాంత్రీకరణ, పారిశ్రామికీకరణ ప్రారంభించినప్పటి నుంచి ప్రపంచమంతటా నేలలోని సేంద్రీయ పదార్థం గణనీయంగా తగ్గింది. ఏ నేల అయినా వ్యవసాయానికి పనికొచ్చేదిగా ఉండాలంటే, అందులో కనీసం 3 నుంచి 6% వరకు సేంద్రీయ పదార్థం ఉండాలి. అయితే, ప్రపంచంలోని అనేక ప్రాంతాలలో ఇది 1% కంటే తక్కువగా ఉంది. భారతదేశంలోని 62% మట్టిలో సేంద్రీయ పదార్థం 0.5% కంటే తక్కువగా ఉంది.
దిగుబడి తగ్గితే ఆహార సంక్షోభం
మనం ఒక టన్ను పంట పండించాం అంటే మనం నేల పైపొరలోని ఒక టన్ను మట్టిని తీసేశామని దానర్థం. మరి దాన్ని తిరిగి భర్తీ చేయడం ఎలా? పంట భూముల్లో జంతువులు, చెట్లు ఉన్నప్పుడు సహజంగానే అది తిరిగి భర్తీ అవుతుంది. సేంద్రీయ సారాన్ని మట్టిలోకి తిరిగి చేర్చే ఏకైక మార్గం చెట్ల నుంచి వచ్చే చెత్త ఇంకా జంతువుల వ్యర్థాలు. విరివిగా యూరియా, డీఏపీ, పొటాష్ వంటి రసాయన ఎరువుల వినియోగం వల్ల మట్టిలో సహజ పోషక విలువలు తగ్గిపోతాయి. దీర్ఘకాలంలో సూక్ష్మజీవులు నశించి, భూసారం క్షీణతకు లోనవుతుంది.
అలాగే మితిమీరిన పురుగు మందులు, కలుపు మందుల వాడడం కూడా భూమిలో సారం తగ్గడానికి కారణం అవుతుంది. ఇది జీవుల ఆరోగ్యంపై కూడా తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది. అడవులను నరికివేయడం వల్ల భూమి పై పొరల క్షీణత (సాయిల్ ఈరోషన్) పెరిగి, వరదల సమయంలో భూమి కోతకు గురి అయి సహజ పోషకాలను భూమి కోల్పోతుంది. భూమిలో సారం తగ్గితే, పంటలు ఎదుగుదల ఆశించినంతగా ఉండదు. దిగుబడులు తగ్గుతాయి. దీనివల్ల ఆహార సంక్షోభం ఏర్పడే అవకాశం ఉంది.
భూసారాన్ని పెంచే మార్గాలు
రసాయనాల వాడకాన్ని తగ్గించి జీవ, సేంద్రీయ ఎరువులు, పచ్చిరొట్ట ఎరువులు(గోమూత్రం, కంపోస్ట్, వర్మీ కంపోస్ట్, పిల్లిపెసర, జనుము వంటివి) వాడడం ద్వారా భూమిలో సూక్ష్మజీవులు పెరిగి, సేంద్రీయ పదార్థం వృద్ధి చెంది భూమి
సారవంతమవుతుంది. రసాయన ఎరువులు, పురుగు మందుల వాడకాన్ని తగ్గించి సహజ వ్యవసాయ పద్ధతులను ప్రోత్సహించడం ద్వారానే నేలను సారవంతంగా మార్చగలం.
పంటల మార్పిడి (క్రాప్ రొటేషన్) ద్వారా భూమిలో ఒకే రకమైన పంటను ఏళ్ల తరబడి సాగు చేయకుండా పంటల మార్పిడి ద్వారా వివిధ పంటలను సాగుచేయడం వలన నేలలో పోషక విలువలు పెరుగుతాయి. నేల ద్వారా సంక్రమించే రోగాలు, చీడ పీడల ప్రబావం తగ్గుతుంది. క్రాప్ హాలిడేస్ కూడా భూసారం పునరుద్ధరణకు సహాయపడుతుంది. చెట్ల పెంపకాన్ని ప్రోత్సహించడం ద్వారా భూసారం పరిరక్షించవచ్చు. మట్టి క్షీణతను అడ్డుకోవడం ద్వారా పర్యావరణాన్ని రక్షించవచ్చు. ప్రభుత్వాలు, రైతు సంఘాలు, శాస్త్రవేత్తలు భూసార సంరక్షణ విధానాలు రూపొందించాలి.
-జి.అజయ్ కుమార్,
వ్యవసాయ నిపుణుడు