సారంగపల్లి చెరువులో అక్రమంగా మట్టి తరలింపు

కోల్​బెల్ట్​, వెలుగు: మందమర్రి మండల పరిధిలోని సారంగపల్లి ఊర చెరువు, బొక్కలగుట్ట ఊర చెరువు, రాళ్లవాగులోని మట్టిని గుట్టుచప్పుడు కాకుండా రాత్రుళ్లు తరలిస్తున్నారు. ఈ మట్టిని తరలించుకునేందుకు శంకర్​పల్లి ప్రాంతంలోని ఇద్దరు ఇటుక బట్టీల యాజమానులు10  రోజుల కిందట సారంగపల్లి  ప్రజా ప్రతినిధులతో ఒప్పందం చేసుకున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.  ప్రతిఫలంగా గ్రామంలో నిర్మిస్తున్న గుడికి రూ.2.20 లక్షల చందాను కట్టాలనే ఒప్పందం చేసుకున్నట్లు సమాచారం. కొంతమంది ఇటుకబట్టీ వ్యాపారులతో వ్యక్తిగత లావాదేవీలు జరిపినట్లు ఆరోపణలున్నాయి.

 గ్రామస్థాయి ప్రజాప్రతినిధి బంధువే ఇందులో కీలకంగా వ్యవహరించినట్లు తెలుస్తోంది.  25 ట్రాక్టర్లతో  రాత్రి 8 గంటల నుంచి సొమవారం తెల్లవారుజామున 6 గంటల వరకు సుమారు 500 ట్రాక్టర్ల లోడు మట్టిని శంకర్​పల్లిలోని ఇటుకబట్టీలకు తరలించుకుపోయారు. మూడు వేల ట్రాక్టర్ల మట్టిని తరలించాలని ఆగ్రిమెంట్ చేసుకున్నారు.  అవసరమైతే పంచాయతీ తీర్మానం చేసేందుకు  సిద్దమైనట్లు సమాచారం.  మట్టి తవ్వకాలు చేపట్టాలంటే మండల రెవెన్యూ, ఇరిగేషన్​, భూగర్భ గనులశాఖ ఆఫీసర్ల పర్మిషన్​ తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంటుంది. మట్టి తరలింపు వ్యవహారంపై ఆఫీసర్లు స్పందించడంలేదు.