పెనుబల్లి, వెలుగు : నేషనల్ హైవే పనులకోసం చెరువు నుంచి మట్టిని తరలిస్తున్నారు. మళ్లీ ఆ గుంతలను చెత్తాచెదారం, చెట్ల మొద్దులతో నింపేస్తున్నారు. పెనుబల్లి మండలం మర్లకుంట గ్రామంలోని మర్లకుంట చెరువు నుంచి ఖమ్మం టు దేవరపల్లి వరకు నిర్మిస్తున్న నేషనల్ హైవే పనుల కోసం రెండు నెలలు నుంచి మట్టి తరలిస్తున్నారు. ఇన్నాళ్లు చెరువు లోతు పెరగడం కోసం ఇరిగేషన్ అధికారుల అనుమతితో మట్టి తీసుకెళ్తుండడంతో ఎవరూ అడ్డు చెప్పలేదు. నేషనల్ హైవే పనులు చేస్తున్న సబ్ కాంట్రాక్టర్ చెరువులో మట్టిని తీసిన తరువాత అడుగున ఉన్న గ్రావెల్ ను హైవే పనులకు తరలించి పైన తీసిన మట్టిని మళ్లీ పూడ్చాలి.
కానీ ఇతరప్రదేశాలలో హైవే పనులలో పనికిరాని మట్టిని, చెట్ల మొద్దులను, వేస్టేజ్‌ను తీసుకొచ్చి గుట్టుచప్పుడు కాకుండా చెరువులో పోసి పూడ్చుతున్నారు. ఈ విషయమై బుధవారం వేస్టేజ్‌ను తీసుకొస్తున్న టిప్పర్లను రైతులు అడ్డుకున్నారు. సమాచారం అందుకున్న ఇరిగేషన్ ఆఫీసర్లు ఎన్‌హెచ్ పనులు చేపడుతున్న కాంట్రాక్టర్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. చెరువులో వేసిన వేస్టేజ్ ను వారం రోజుల్లో తొలగించాలని, లేకపోతే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.