కరీంనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జిల్లాలో పర్మిషన్‌‌‌‌‌‌‌‌ కొంత .. తవ్వేది కొండంత

కరీంనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జిల్లాలో పర్మిషన్‌‌‌‌‌‌‌‌ కొంత .. తవ్వేది కొండంత
  • కరీంనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జిల్లాలో జోరుగా మట్టి తవ్వకాలు 
  • పర్మిషన్‌‌‌‌‌‌‌‌ తీసుకునేది ఒక్క మీటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు.. తవ్వేది మూడు మీటర్లు 
  • పర్మిషన్ ఇచ్చి చేతులు దులుపుకుంటున్న ఇరిగేషన్ ఆఫీసర్లు
  • చెరువులు, కుంటల్లో ఇష్టారాజ్యంగా మట్టి తవ్వకాలు

కరీంనగర్, వెలుగు: కరీంనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జిల్లాలో మట్టి దందా జోరుగా సాగుతోంది. ఖాళీ ప్లాట్లలో పోయడానికి కొందరు మొరం మట్టి తరలిస్తే.. ఇటుక బట్టీల కోసం మరికొందరు రేగడి మట్టిని తరలిస్తున్నారు. చెరువులు, కుంటల్లో మట్టి తవ్వడానికి ఇరిగేషన్ ఆఫీసర్లు ఇష్టారాజ్యంగా పర్మిషన్ ఇస్తూ చేతులు దులుపుకుంటున్నారు. మట్టి దందా చేస్తున్న వ్యక్తులు మాత్రం.. మీటర్ లోతు వరకు తవ్వేందుకు అనుమతులు తీసుకుని, మూడు, నాలుగు మీటర్ల లోతు తవ్వేస్తున్నారు.  పగలు రాత్రీ తేడా లేకుండా జేసీబీలతో మట్టిని తవ్వి టిప్పర్లు, లారీలతో కరీంనగర్ సిటీ, పెద్దపల్లి ఇటుక బట్టీలకు తరలిస్తున్నారు.  అరికట్టాల్సిన అధికారులు.. మామూళ్లు తీసుకుని చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు. 

ఫిర్యాదు చేసినా చర్యలు శూన్యం

జిల్లాలోని మానకొండూరు, శంకరపట్నం, హుజూరాబాద్ మండలాల్లో మట్టి దందా జోరుగా సాగుతోంది.  చెరువులు, కుంటల్లో పూడిక తీసే పేరిట మట్టి తరలించేందుకు అనుమతి తీసుకుని ఇష్టారాజ్యంగా జేసీబీలతో తవ్వేస్తున్నారు.  దీంతో చెరువులు, కుంటల్లో తీసిన గోతులు బావులను తలపిస్తున్నాయి. వర్షాకాలంలో చెరువులు, కుంటల్లో నీళ్లు నిండాక ఈత రాని వారు లోతు తక్కువ ఉందని  తెలియక దిగితే గల్లంతయ్యే ప్రమాదం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరో వైపు మట్టి దందాతో కొందరు దళారులు లక్షలాది రూపాయలు ఆర్జిస్తున్నారు. 

మానకొండూరు మండలంలోని దేవంపల్లి గ్రామశివారులోని పాలకుంట చెరువు నుంచి నల్ల రేగడి మట్టిని పెద్దపల్లి జిల్లాలోని ఇటుక బట్టీలకు తరలిస్తుండగా.. ఇదే మండలంలోని అన్నారం శివారు జవహర్ కుంట, ముంజపల్లిలోని ఒడుకుంట, ముంజంపల్లి, ఈదులగట్టెపల్లి చెరువులు, కుంటల నుంచి కూడా రోజూ జేసీబీలతో మట్టి తవ్వుతూ అమ్మేస్తున్నారు. 

శంకరపట్నం మండలం రాజాపూర్ గ్రామంలోని తుమ్మలకుంటలో ఎలాంటి అనుమతులు లేకుండా జేసీబీలతో  అక్రమంగా మట్టి తవ్వేస్తూ ట్రాక్టర్లతో తరలిస్తున్నారు. మట్టి అక్రమ వ్యాపారం పై అధికారులకు ఫిర్యాదు చేసినా బాధ్యులపై కేసులు నమోదు చేయడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు.  అలాగే ఇరిగేషన్ ఆఫీసర్లు కూడా తాము పర్మిషన్ ఇచ్చింది ఎంత.. వారు తవ్వుతున్నది ఎంత అనే విషయాలను పరిశీలించేందుకు అటువైపు కన్నెత్తి చూడడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.