మార్చి 29న షష్ఠగ్రహ కూటమితోపాటు సూర్యగ్రహణం : ఏ రాశులపై ఎలాంటి ప్రభావం.. పరిహారాలు ఏంటీ..?

మార్చి 29న షష్ఠగ్రహ కూటమితోపాటు సూర్యగ్రహణం : ఏ రాశులపై ఎలాంటి ప్రభావం.. పరిహారాలు ఏంటీ..?

2025 మార్చి నెల వచ్చేసింది.. ఇప్పుడు అందరిలో ఒకటే టెన్షన్.. మార్చి 29వ తేదీ.. ఆ రోజు షష్టగ్రహ కూటమితోపాటు సూర్యగ్రహణం ఏర్పడుతుంది. జ్యోతిష్య పండితులు రకరకాలుగా చెబుతున్నారు. రాబోయే కాలం అంతా గందరగోళంగా ఉంటుందని కొందరు అంటుంటే.. అలాంటిది ఏమీ లేదు చిన్న చిన్న పరిహారాలతో ఉపశమనం పొందొచ్చు అని భరోసా ఇస్తున్నారు. ఇంతకీ షష్టగ్రహ కూటమి, సూర్యగ్రహణం ప్రభావం ఏయే రాశులపై ఎలాంటి ప్రభావం చూపిస్తుంది.. ఆయా రాశుల వాళ్లు చేయాల్సిన పరిహారాలు ఏంటో తెలుసుకుందాం.. పుట్టిన తేదీ ఆధారంగా ఈ ప్రభావం, పరిహారం ఇవ్వటం జరుగుతుంది. 

సూర్యగ్రహణం :

మార్చి 29వ తేదీ మధ్యాహ్నం 2 గంటల 20 నిమిషాలకు ప్రారంభం అయ్యి.. సాయంత్రం 6 గంటల 13 నిమిషాలకు ముగుస్తుంది. ఈ సూర్యగ్రహణం ఇండియాలో కనిపించదు. ఇండియాపై ఎలాంటి ప్రభావం ఉండదు. కెనడా, పోర్చుగల్, స్పెయిన్, ఐర్లాండ్, ఫ్రాన్స్, యూకే, జర్మనీ, నార్వే, ఫిన్లాండ్, రష్యా దేశాల్లో సంపూర్ణ సూర్యగ్రహణం కనిపిస్తుంది.  

సూర్యగ్రహణ ప్రభావం మన దేశంలో లేనప్పుడు ప్రభావమే ఉండదు కదా.. మరి ఎందుకు దోషాలు చెబుతున్నారు.. పరిహారాలు ఎందుకు చేయించుకోవాలి అనే ప్రశ్న రావొచ్చు.. దీనికి కారణం అదే రోజు షష్ఠగ్రహ కూటమి ఏర్పడుతుంది. 

షష్ఠగ్రహ కూటమి ఏంటీ :

ఈ సూర్యగ్రహణం మీన రాశిలో జరుగుతుంది. ఈ మీనరాశిలోనే బుధుడు, శుక్రుడు, రాహువు, సూర్యుడు, చంద్రుడు ఆరు గ్రహాలు ఒకే రాశిలో అప్పటికే ఉంటాయి. ఈ ఆరు గ్రహాలతోపాటు శని కూడా కుంభం నుంచి మీన రాశిలోకి ప్రవేశిస్తాడు. మీనరాశిలో శని నెల రోజులు.. అంటే 30 రోజులు ఉంటాడు. ఒకే రాశిలో ఇన్ని గ్రహాలు ఉండటం.. ఇదే సమయంలో సూర్యగ్రహణం ఏర్పడటంతో ఆయా రాశులపై ప్రభావం చూపిస్తుంది అనేది జ్యోతిష్య పండితుల మాట. 

ఏయే రాశులపై ఎలాంటి ప్రభావం.. పరిహారం ఏంటో చూద్దాం :

మేషం (మార్చి 21 నుంచి ఏప్రిల్ 19) :

షష్ఠగ్రహ కూటమి, సూర్యగ్రహణం ప్రభావం వల్ల ఆరోగ్య, ఆర్థిక సమస్యలతో ఒత్తిళ్లను ఎదుర్కొంటారు. తల నొప్పులు, కీళ్ల నొప్పులు, వాపులు వంటి అనారోగ్య సూచనలు ఉన్నాయి. బైక్, కారు నడిపే సమయంలో అప్రమత్తంగా ఉండాలి. ఊహించని ఖర్చులు వచ్చి పడే ప్రమాదం ఉంది. పెట్టుబడుల విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి. 

పరిహారం ఏంటీ : ఎర్ర పప్పు (మసూర్ దాల్) దానం చేయండి. 

వృషభం  (ఏప్రిల్ 20 – మే 20) :

పెద్దగా మార్పులు ఏమీ ఉండవు. ఉద్యోగం, వ్యాపారం చేస్తు్న్నట్లయితే చిన్న చిన్న అడ్డంకులు, చిన్న వివాదాలు తలెత్తే సూచనలు ఉన్నాయి. ఓపిగ్గా ఉన్నట్లయితే వాటిని కూడా అధిగమించొచ్చు. చిన్న మాట పట్టింపులు వచ్చే అవకాశం ఉంది. మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. 

పరిహారం ఏంటీ : ఎలాంటి దానాలు చేయాల్సి అవసరం లేదు. మనస్సు నిగ్రహం కోసం గాయత్రి మంత్రాన్ని జపించండి.

మిథున రాశి (మే 21 – జూన్ 20): 


ఉద్యోగ, వ్యాపారంలో వృద్ధి ఉంటుంది. స్టార్టప్ వంటి రంగాల్లో ఉన్న వాళ్లకు మంచి కాలం ఇది. మీ తెలివితేటలతో విజయాలను సాధిస్తారు. కళా రంగంలో ఉండే వాళ్లకు మరిన్ని అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. 

పరిహారం ఏంటీ : దుర్గా చాలీసా చదువుకుంటే విజయం మీ వెంటే. దానాలు చేయాల్సిన అవసరం లేదు.

కర్కాటక రాశి (జూన్ 21 – జూలై 22): 


ఉద్యోగం, వ్యాపారంలోనే కాకుండా వ్యక్తిగత జీవితంలో పెద్ద మార్పులు రాబోతున్నాయి. కొత్త ప్రాజెక్టులు చేపట్టే అవకాశం ఉంది. ఉద్యోగ మార్పు సూచనలు బలంగానే ఉన్నాయి. మంచి టైం నడుస్తుంది. కుటుంబంలో లేదా సహోద్యోగులతో గతంలో ఉన్న పట్టింపులు సమసిపోతాయి. బంధాలు గట్టిపడతాయి. మీపై ఉన్న అపోహలు కూడా తొలగిపోయే సమయం ఇది. మంచి కాలం నడుస్తుంది. 

పరిహారం ఏంటీ : బియ్యం, చక్కెర, తెల్లటి దుస్తులు.. వంటి తెల్ల వస్తువులను దానం చేయండి. 

సింహ రాశి (జూలై 23 – ఆగస్టు 22) :

సూర్య గ్రహణం, షష్ఠగ్రహ కూటమి వల్ల కెరీర్ గందరగోళంలో పడే ప్రమాదం ఉంది. ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొనే సూచనలు స్పష్టంగా ఉన్నాయి. భాగస్వామ్య వ్యాపారాలు చేసే వారికి.. మీ భాగస్వామితో విబేధాలు రావొచ్చు. తొందరపాటు నిర్ణయాలు అస్సలు తీసుకోవద్దు. ఆచితూచి స్పందించాల్సిన కాలం ఇది. 

పరిహారం ఏంటీ : గోధుమలు లేదా బెల్లం దానం చేయటం వల్ల ప్రతికూల పరిస్థితులు తగ్గొచ్చు.

కన్య (ఆగస్టు 23 – సెప్టెంబర్ 22): 

ఈ రాశి వారికి మిశ్రమంగా ఉంటుంది. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు వస్తాయి. కాకపోతే మీరు ఆశించిన విధంగా ఆ ఉద్యోగం ఉండకపోవచ్చు. వ్యాపారం చేస్తున్న వాళ్లకు ఆశించిన స్థాయిలో లాభాలు ఉండవు. పెద్ద పెద్ద మార్పులు ఏమీ ఉండవు. 

పరిహారం ఏంటీ : గణేషా చాలీసా పఠనం చేయాలి. కూరగాయలు దానం చేయటం మంచి సూచన.

తులారాశి (సెప్టెంబర్ 23 – అక్టోబర్ 22): 

ఈ రాశిలోని ప్రేమికులకు ఇది అద్భుతమైన కాలం. బంధాలు, ప్రేమలు బలపడతాయి. పెళ్లికాని వారికి మంచి సంబంధాలు వచ్చే సూచనలు ఉన్నాయి. యువకులు ప్రేమ బంధంలోకి వెళ్లి అవకాశం కూడా గట్టిగా ఉంది. వివాహం అయిన వారు భార్యతో ఏమైనా గొడవలు ఉంటే అవన్నీ సమసిపోతాయి. 

పరిహారం ఏంటీ : లక్ష్మీదేవి అష్ణోత్రం పఠిస్తే అంతా మంచే జరుగుతుంది. 

వృశ్చికం (అక్టోబర్ 23 – నవంబర్ 21):

పెద్దగా మార్పులు ఏమీ ఉండవు. ఎప్పటిలాగానే జీవితం సాఫీగా సాగుతుంది. కొత్త అవకాశాలు వస్తే వదులుకోవద్దు. ఇప్పుడు కాకపోయినా.. భవిష్యత్ లో మంచి ప్రయోజనకరంగా ఉంటుంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త వహించండి. 

పరిహారం ఏంటీ : హనుమాన్ చాలీసా పఠించటం అనేది చెప్పదగిన సూచన

ధనుస్సు (నవంబర్ 22 - డిసెంబర్ 21):

ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటారు. మానసిక ఒత్తిడి పెరుగుతుంది. ఆఫీసులోని సహోద్యోగులతో విబేధాల సూచనలు ఉన్నాయి. వ్యక్తిగత జీవితంలోనూ ఆందోళన పెరుగుతుంది. అన్నింటికీ ఓర్పు, సహనం చాలా అవసరం. ఆవేశంలో.. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. 
 

పరిహారం ఏంటీ : వెండిని దానంగా ఇవ్వండి. ఓం నమో భగవతే వాసుదేవాయ అని పారాయణం చేయండి.

మకరం (డిసెంబర్ 22 – జనవరి 19):

పని చేసే ఉద్యోగంలోనే కాకుండా వ్యక్తిగత జీవితంలో మార్పులకు సూచనలు బలంగా కనిపిస్తున్నాయి. కొత్త బాధ్యతలతోపాటు భారీ ఖర్చులతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొనే ప్రమాదం ఉంది. పెట్టుబడులు పెట్టే విషయంలో జాగ్రత్తగా ఉండకపోతే నష్టపోయే సూచనలు ఉన్నాయి. 
 

పరిహారం ఏంటీ : నల్ల నువ్వులు దానం చేయండి లేదా నల్ల పప్పు (ఉదర్ దాల్) దానం చేయండి.

కుంభ రాశి (జనవరి 20 – ఫిబ్రవరి 18):

సూర్య గ్రహణం, షష్ఠగ్రహ కూటమి ప్రభావంతో బాగా కలిసి వచ్చే రాశుల్లో కుంభ రాశి ఉంది. గ్రహణం వల్ల ఈ రాశి వాళ్లకు కొత్త శక్తి వస్తుంది. కెరీర్ లో ఊహించని మంచి మార్పులు సూచిస్తుంది. వ్యతిగత జీవితంలో ఉన్న ఇబ్బందులు అన్నీ తొలగి గాడిన పడతారు. మంచి అవకాశాలు వస్తాయి. సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటే అద్భుత ప్రయోజనాలు ఉంటాయి. 

పరిహారం ఏంటీ : విజయం కోసం నీలం రంగు దుస్తులు దానం చేయండి.

మీనం (ఫిబ్రవరి 19 – మార్చి 20):

ఆత్మ పరిశీలనకు ఇది మంచి సమయంగా సూచిస్తుంది జ్యో్తిష్య శాస్త్రం. జీవితంలో చిన్న మార్పులు వస్తాయి. కెరీర్ బాగున్నా.. మీరు ఆశించిన స్థాయిలో ఎదగాలంటే మరికొంత సమయం ఓపిక పట్టాలి. కీలకమైన అంశాల్లో నిర్ణయాలను ఆచితూచి తీసుకోండి.

పరిహారం ఏంటీ : జలచరాలకు ఆహారం తినిపించండి. అంటే చెరువుల్లో పిండి పదార్థాలు వదలండి. 

ఇదంతా ఆయా తేదీల్లో పుట్టిన కోట్ల మందికి సంబంధించిన అంశం. వ్యక్తిగత జాతకం ఆధారంగా చూస్తే మార్పులు ఉంటాయి. పరిహారాల్లోనూ వ్యత్యాసం ఉంటుంది. ఇది సమూహానికి సంబంధించి.. జ్యోతిష్య శాస్త్రం చెబుతున్న సూచన.