
హైదరాబాద్, వెలుగు: అడవి జంతువులు, కోతుల నుంచి పంటల రక్షణకు సోలార్ ఫెన్సింగ్ స్కీమ్‌ను అమలు చేయాలని ప్రభుత్వం యోచిస్తుందని వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు అన్నారు. మంగళవారం సెక్రటేరియెట్‌లో హార్టీకల్చర్ ఆఫీసర్లతో నిర్వహించిన సమీక్షలో మంత్రి మాట్లాడారు. కోతులు ఇతర అడవి జంతువుల వల్ల ఇబ్బంది ఉన్న అన్ని జిల్లాలలో ఉద్యాన పంటల రక్షణకు సోలార్ ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలనుకుంటున్నట్టు తెలిపారు. ఇప్పటికే సోలార్ ఫెన్సింగ్ స్కీమ్ అమలు చేస్తున్న హిమాచల్ ప్రదేశ్‌లో పర్యటించి, విధివిధానాలు సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు.
హైదరాబాద్ చుట్టూ వెజ్ క్రాప్ క్లస్టర్లు..
హైదరాబాద్ సిటీకి 100 కిలోమీటర్ల పరిధిలోపు ప్రాంతాలలో కూరగాయాల సాగు చేపట్టేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అర్బన్ క్లస్టర్లను ఏర్పాటుచేసి, రైతులకు ప్రోత్సహకాలు అందించి, సాగును పెద్దఎత్తున ప్రోత్సహించాలన్నారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో డ్రిప్ స్ప్రింక్లర్ల పంపిణీ కోసం దరఖాస్తులను స్వీకరించి, గ్రౌండింగ్ మొదలు పెట్టాలని ఆదేశించారు. ఇతర రాష్ట్రాలలో సాగు చేస్తు లాభాలు పొందుతున్న మకడమియా పంటను రాష్ట్రంలో సాగు చేయడానికి వాతావరణ స్థితిగతులు, నేలలు, మార్కెటింగ్ అవకాశాలను స్టడీ చేయాలన్నారు.
మే కల్లా నర్మెట్ల ఆయిల్పామ్కంపెనీ
పనులు చేపట్టని ఆయిల్ పామ్కంపెనీలకు కంపెనీలకు అనుమతుల రద్దుకు చర్యలు తీసుకోవాలని తుమ్మల అన్నారు. ఇప్పటికే విశ్వతేజ కంపెనీకి ఇచ్చిన అనుమతులు రద్దు చేసి హిందుస్థాన్ యూనిలివర్ లిమిటెడ్‌కు అప్పగించామన్నారు. ప్లాంటేషన్ లక్ష్యాన్ని చేరుకోని వాటిని తొలగించి, ఆ స్థానంలో ఆయిల్ ఫెడ్‌కు బాధ్యతలు అప్పగిస్తామన్నారు. ఆయిల్ ఫెడ్ ఆధ్వర్యంలో చేపట్టిన నర్మెట్ట కర్మాగారాన్ని మే నెలాఖరుకల్లా పూర్తి చేయాలన్నారు. బీచుపల్లిలో, కల్లూరిగూడంలో డిసెంబర్ కల్లా పూర్తి చేయాలని సూచించారు.