- వేలాది ఎకరాల్లో ప్లాంట్ ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం కసరత్తు
- ముంపు భూముల్లో ప్లాంట్ ద్వారా 1000 మెగావాట్ల ఉత్పత్తికి చాన్స్
- సింగరేణికి అప్పగించే యోచనలో ప్రభుత్వం
పెద్దపల్లి, వెలుగు : సోలార్ పవర్ ప్లాంట్ల ఏర్పాటుపై రాష్ట్ర ప్రభుత్వం స్పెషల్ ఫోకస్ చేసింది. ఇప్పటికే సింగరేణి, ఎన్టీపీసీ ఆధ్వర్యంలో సోలార్ పవర్ ప్లాంట్లు నడుస్తుండగా, తాజాగా కాళేశ్వరం బ్యాక్ వాటర్‌లో ఫ్లోటింగ్ ప్లాంట్ల ఏర్పాటుకు కసరత్తు ప్రారంభించింది. ఈ ప్లాంట్‌ను సైతం సింగరేణికే అప్పగించే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది.
పెద్దపల్లి జిల్లాలో ఇప్పటికే నాలుగు ప్లాంట్లు
పెద్దపల్లి జిల్లాలో ఇప్పటికే నాలుగు సోలార్ ప్లాంట్లు ఉండగా 150 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి జరుగుతుంది. రామగుండం నియోజకవర్గంలోని ఎన్టీపీసీలో గ్రౌండ్ సోలార్ ప్లాంట్ ద్వారా 10 , వాటర్ ఫ్లోటింగ్ ప్లాంట్ ద్వారా 100 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి జరుగుతుంది. అలాగే మంథని, కాల్వశ్రీరాంపూర్ మండలాల్లోని సోలార్ ప్లాంట్ల ద్వారా మరో 40 మెగావాట్లు విద్యుత్ ఉత్పత్తి అవుతుంది.
అయితే ఇవి రైతుల నుంచి సేకరించిన భూములు కావడంతో తరుచుగా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దీంతో కాళేశ్వరం కింద నిర్మించిన బ్యారేజీల బ్యాక్‌వాటర్ ముంపు భూముల్లో సోలార్ ప్లాంట్లు నిర్మించాలని ప్రభుత్వం ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.
కాళేశ్వరం బ్యాక్ వాటర్ ఫ్లోటింగ్ ప్లాంట్
కాళేశ్వరం బ్యాక్ వాటర్‌లో వేలాది ఎకరాలు నీట మునుగుతున్నాయి. ఈ ముంపు భూములను వృథాగా పోనివ్వకుండా వాటర్ ఫ్లోటింగ్ సోలార్ ప్లాంట్ల నిర్మాణానికి సర్కార్ ప్లాన్ చేసింది. ముంపు భూముల్లో సోలార్ ప్లాంట్ల ఏర్పాటుకు ఇప్పటికే డీపీఆర్ రెడీ చేసినట్లు సమాచారం. బ్యాక్ వాటర్ ముంపు భూముల్లో ఫ్లోటింగ్ సోలార్ ప్లాంట్లు ఏర్పాటు చేస్తే కనీసం 1000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేయొచ్చన్న అంచనాలో అధికారులు ఉన్నట్లు సమాచారం.
పెద్దపల్లి జిల్లాలో ఇటీవల జరిగిన పలు మీటింగ్‌లలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఐటీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ మాట్లాడుతూ సోలార్ ప్లాంట్ల ఏర్పాటులో మహిళలకు ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు చెప్పారు. దీంతో సోలార్ ప్లాంట్ల ఏర్పాటు త్వరలోనే స్పీడందుకోనుందని ప్రజలు అభిప్రాయపడుతున్నారు.