- పైలట్ ప్రాజెక్ట్‌గా బల్దియా ఆఫీస్
- జీరో కరెంట్ బిల్లు దిశగా కసరత్తు
- ఫిబ్రవరి నాటికి స్ట్రీట్‌లైట్లకు కూడా సోలారే..
- ప్రతినెలా బల్దియాకు రూ.15లక్షలు ఆదా
గోదావరిఖని, వెలుగు : రామగుండం కార్పొరేషన్‌లో సోలార్ కరెంట్ వినియోగానికి అధికారులు కసరత్తు చేస్తున్నారు. తొలుత బల్దియా ఆఫీసులో ఉత్పత్తి చేసి వినియోగించేలా ప్లాన్ చేస్తున్నారు. ఆ తర్వాత ప్రభుత్వ ఆఫీసులకు సోలార్ కరెంట్‌ను అందించేలా ప్లాన్ చేస్తున్నారు. ఆ తర్వాత స్ట్రీట్ లైట్లకు కూడా ఈ కరెంట్‌నే ఇవ్వాలన్న ఆలోచనలో ఉన్నారు. దీనిలో భాగంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోనే రామగుండం కార్పొరేషన్ ఆఫీస్‌ను పైలట్ ప్రాజెక్ట్‌గా సెలెక్ట్ చేశారు.
బల్దియా ఆఫీస్‌పై ప్యానళ్ల ఏర్పాట్లు
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పైలట్ ప్రాజెక్ట్‌గా రామగుండం బల్దియాను గుర్తించి ఆఫీస్ బిల్డింగ్‌పై సోలార్ ప్యానళ్లు ఏర్పాటు చేయనున్నారు. ఆఫీస్‌లో ప్రస్తుతం పీక్ లోడ్ 84 కిలోవాట్స్‌గా నమోదవుతుంది. దీంతో 97 కిలోవాట్స్ కెపాసిటీతో ప్యానళ్లు ఏర్పాటు చేసేలా ప్రతిపాదనలు చేశారు. దీంతోపాటు బల్దియాలో కరెంట్ వినియోగించుకున్నందుకు ప్రతినెలా రూ.వేలల్లో బిల్లులు చెల్లించాల్సి వస్తోంది. ఈ బిల్లుల ఖర్చును జీరోకు తెచ్చేలా ఆఫీసర్లు కసరత్తు చేస్తున్నారు. ఈక్రమంలో ఫిబ్రవరి నాటికి సోలార్ ప్యానళ్లు బిగించి కరెంట్ సప్లై చేసేలా చర్యలు తీసుకోవాలని జిల్లా ఉన్నతాధికారులు ఇప్పటికే సంబంధిత ఆఫీసర్లకు ఆదేశాలు జారీ చేశారు.
స్ట్రీట్ లైట్ల బిల్లు రూ.10 లక్షలకు పైగానే
రామగుండం కార్పొరేషన్ పరిధిలో 50 డివిజన్ల పరిధిలో 20,327 స్ట్రీట్ లైట్లు ఉన్నాయి. ఈ లైట్ల కోసం ప్రతి నెలా సుమారు రూ.10 లక్షల వరకు ఖర్చవుతోంది. అలాగే వివిధ ప్రాంతాల్లో తాగునీటి అవసరాల కోసం వేసిన బోర్ల వాడకానికి, షాపింగ్ ఏరియా, సులభ్ కాంప్లెక్స్‌లు, సీనియర్ సిటిజన్హాల్స్.. తదితరాల కోసం వినియోగించే కరెంట్ కోసం రూ. 5 లక్షలకు పైగా బిల్లులు కడుతున్నారు. ఇప్పటికే సింగరేణి ప్రభావిత గ్రామాలు, ప్రాంతాల్లో ఆ సంస్థ సోలార్ స్ట్రీట్ లైట్లు ఏర్పాటు చేసింది.
రామగుండంలో సింగరేణి, ఎన్టీపీసీ, ఆర్ఎఫ్‌సీఎల్ సంస్థలు ఉన్నాయి. వీటిలో ఏదో ఒకదాని సహకారంతో బల్దియా అంతటా సోలార్ స్ట్రీట్ లైట్లను ఏర్పాటు చేయాలన్న ఆలోచనలో ఆఫీసర్లు ఉన్నారు. పూర్తి స్థాయిలో సోలార్ విద్యుత్ వినియోగం జరిగితే రామగుండం కార్పొరేషన్‌కు ప్రతినెలా రూ.15 లక్షలకు పైగా
ఆదా కానుంది.