- పైలట్ ప్రాజెక్టుగా ప్రతి జిల్లాలో 2 మెగావాట్ల ప్లాంటు
- 32 జిల్లాల్లో 64 మెగావాట్ల విద్యుత్ఉత్పత్తికి ప్రణాళిక
- స్త్రీనిధి ద్వారా రూ.192 కోట్ల రుణాలు
- సెక్రటేరియట్లో పీఆర్, ఆర్డీ, ఆర్థిక శాఖఅధికారుల సమావేశం
- నేడో, రేపో వర్క్ ఆర్డర్లు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో సోలార్ విద్యుత్ ఉత్పత్తికి వేగంగా అడుగులు పడుతున్నాయి. మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులకు ఉపాధి కల్పించడంతోపాటు వారిని పారిశ్రామిక వేత్తలుగా తీర్చిదిద్దాలనే సంకల్పం కార్యరూపం దాల్చుతున్నది. రాష్ట్రంలో మార్చి 8వ తేదీన మహిళా దినోత్సవం రోజున మహిళా సంఘాలు ఏర్పాటు చేసిన సోలార్ ప్లాంట్ల ద్వారా విద్యుత్ ఉత్పత్తి ప్రారంభించాలని ప్రభుత్వం టార్గెట్ పెట్టుకున్నది. ఇందులో భాగంగా మంగళవారం సెక్రటేరియెట్లో పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ, ఆర్థిక శాఖ అధికారులు సమావేశమయ్యారు. సోలార్ ప్లాంట్ల ఏర్పాటు, స్థల సేకరణ, ప్లాంట్ల నిర్వహణ, రుణాలు తదితర అంశాలపై చర్చించారు. ఈ మేరకు బ్యాంకర్లతో కూడా చర్చించారు.. అయితే ఒప్పందాలు, విధి విధానాలపై ఇంకా స్పష్టత రాలేదు. దీంతో మహిళా సంఘాల సోలార్ ప్రాజెక్టులో ఆలస్యం జరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో పీఆర్, ఆర్డీ ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా సోలార్ ప్లాంట్ల నిర్మాణాలు త్వరితగతిన పూర్తి చేసేందుకు పక్కా ప్రణాళికతో ముందుకెళ్తున్నది. ఇందుకోసం సెర్ప్ భాగస్వామ్యంతో మహిళా సంఘాలకు స్త్రీనిధి ద్వారా రుణాలు మంజూరు చేయనున్నది. కాగా, తొలి విడత ప్రతీ జిల్లాలో రెండు మెగావాట్ల విద్యుత్ ప్లాంట్ల నిర్మాణ పనులు చేపట్టనుండగా.. నేడో, రేపో ప్లాంట్ల పనులకు సంబంధించి ఉత్తర్వులు జారీ అయ్యే అవకాశం ఉంది.
పైలట్ ప్రాజెక్టుగా జిల్లాకో 2మెగావాట్ల ప్లాంటు
యుద్ధ ప్రాతిపదికన సోలార్ ప్లాంట్ల పనులు మొదలు పెట్టేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని మంత్రి సీతక్క అధికారులను ఆదేశించారు. దీంతో జిల్లాల్లో సోలార్ పవర్ ప్లాంట్ల ఏర్పాటుకు ఆసక్తి ఉన్న గ్రామైక్య సంఘాల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. వారు గతంలో తీసుకున్న రుణాలు చెల్లింపులు, వారి పొదుపు, లోన్ల చెల్లింపు సామర్థ్యం ఉన్న సంఘాలను డీఆర్డీఏ అధికారులు గుర్తించారు. అంతేకాకుండా, రెడ్కో (ఇంధన సంస్థ) ఆధ్వర్యంలో టెండర్ల ప్రక్రియ పూర్తి చేశారు. ప్రభుత్వం నుంచి వర్క్ ఆర్డర్ రాగానే కాంట్రాక్ట్ సంస్థలకు ప్లాంట్ల నిర్మాణ బాధ్యతలు అప్పగించనున్నారు. ప్రభుత్వం నిర్దేశించిన సమయానికి ఈ సంస్థలు ప్లాంట్లు నిర్మించి మహిళా సంఘాలకు అప్పగించేలా చర్యలు చేపడుతున్నారు. కాగా, రాష్ట్రంలో తొలి విడతలో 32 జిల్లాల్లో 64 మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించగా.. అధికారులు ఆ దిశగా ప్రణాళిక రూపొందించారు. 64 మెగావాట్ల పవర్ ఉత్పత్తికి అవసరమైన లోన్లను ప్రభుత్వం సమకూర్చనున్నది. రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాల్లో 4,36,512 మహిళా స్వయం సహాయక సంఘాలుండగా.. అందులో 46,66,523 మంది సభ్యులు ఉన్నారు. ప్రతీ జిల్లాకు రెండు మెగా వాట్ల యూనిట్ల ఏర్పాటుకు అవసరమైన భూసేకరణ చేశారు.
ఒక మెగావాట్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి చేసే ప్లాంట్లుకు 4 ఎకరాల స్థలం అవసరం కాగా.. ఇందుకోసం రూ.3 కోట్ల వరకు ఖర్చు అవుతుంది. ఇందుకు అవసరమైన నిధులను సెర్ప్ ఆధ్వర్యంలో స్త్రీనిధి ద్వారా మహిళా సంఘాలకు రుణాల రూపంలో అందజేయనున్నారు. 64 మెగా వాట్ల విద్యుత్ ఉత్పత్తి చేసేందుకు మొత్తం రూ.192 కోట్ల వరకు పెట్టుబడి అవుతుంది. ఇందులో 10 శాతం రూ.30 కోట్లు మహిళా సంఘాలు కాంట్రిబ్యూషన్ చేయాల్సి ఉంటుంది. మిగిలిన రుణాలు రూ.162 కోట్లు స్త్రీనిధి ద్వారా ప్రభుత్వం సమకూర్చనున్నది. కాగా, ఒక్కొక్క ప్లాంట్ ఏర్పాటుకు రూ.3 కోట్లు ఖర్చు కానుండగా.. ఇందులో మార్జిన్ మనీ కింద మహిళా సంఘం 10 శాతం జమ చేయాలి. స్త్రీనిధి బ్యాంక్ లింకేజీ ద్వారా రూ.2.70 కోట్లు వస్తే.. మిగతా రూ.30 లక్షలు గ్రామైక్య సంఘాలు జమ చేయాల్సి ఉంటుంది. అనుభవాన్ని బట్టి బ్యాంకర్ల ద్వారా మరిన్ని లోన్లు ఇప్పించి రాష్ట్రంలో వెయ్యి మెగా వాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తి చేసేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది.