1000 డిగ్రీల వేడి పుట్టించే సోలార్ ప్లాంట్ 

1000 డిగ్రీల వేడి పుట్టించే సోలార్ ప్లాంట్ 

వెలుతురునంతా ఒడిసి పట్టే ‘హీలియోజన్’ సోలార్ ప్లాంట్

బిల్ గేట్స్ సాయం.. ఏఐ టెక్నాలజీతో ఏర్పాటు 

సిమెంట్, స్టీల్, గ్లాస్ ఇండస్ట్రీలకు ఉపయోగం

పెద్ద ఎత్తున హైడ్రోజన్ ఫ్యూయెల్ తయారీకీ చాన్స్

వెయ్యి అద్దాలను తీసుకుని.. అన్నింటినీ ఎండలో ఉంచి.. అవి రిఫ్లెక్ట్ చేసే వెలుతురునంతటినీ ఒకే పాయింట్ మీదకు పడేలా చేస్తే ఎలా ఉంటది? విపరీతమైన వేడి పుట్టి.. కాల్చి బూడిద చేసేస్తది కదా! సూర్యుడి శక్తినంతా ఒడిసిపట్టేందుకు ఉపయోగించే ఈ టెక్నిక్ నే ‘కాన్సంట్రేటెడ్ సోలార్ పవర్’ అంటారు. గతంలోనూ ఈ టెక్నాలజీని కొందరు వాడినప్పటికీ పెద్దగా ఉపయోగం లేకపోయింది. కానీ.. లాస్ ఏంజెలిస్‌కు చెందిన ‘హీలియోజన్’ అనే స్టార్టప్ ఇప్పుడు ఈ టెక్నాలజీలో కీలక ముందడుగు వేసింది. సోలార్ పవర్ ప్లాంట్‌కు తాము ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)ని జోడించామని, దీంతో ఈ ఐడియా సూపర్ సక్సెస్ అయిపోయిందని ఆ కంపెనీ ఫౌండర్, సీఈఓ బిల్ గ్రాస్ చెబుతున్నారు. మైక్రోసాఫ్ట్ ఫౌండర్, ప్రపంచంలోనే ధనవంతుడు అయిన బిల్ గేట్స్ ఈ ప్లాంటు ఏర్పాటుకు సాయం చేయడం మరో విశేషం.

పొద్దు తిరుగుడు పూలలా..

పొద్దు తిరుగుడు పూలు సూర్యుడు ఎటువైపు మళ్లితే అటువైపు తిరుగుతుంటాయి. హీలియోజన్ సోలార్ ప్యానెళ్లు కూడా అలాగే తిరుగుతాయట. వెలుతురు ఏ కోణంలో బాగా వస్తుందో, ఆ వైపునకు ప్యానెళ్లు కరెక్ట్ గా తిరిగేందుకు, వాటి నుంచి ప్లాంటులోని పెద్ద టవర్ పై ఉన్న పాయింట్ వద్దకు వెలుతురును రిఫ్లెక్ట్ చేసేందుకు ఈ ప్లాంట్‌లోని ఏఐ టెక్నాలజీ పని చేస్తుందట. ప్రారంభించిన మొదటి రోజు నుంచే ఈ టెక్నిక్‌ విజయవంతంగా పని చేస్తోందని  బిల్ గ్రాస్ వెల్లడించారు.

సూర్యుడి ఉపరితలంలో పావు వంతు వేడి..

కేవలం ఐదారు వందల సోలార్ ప్యానెళ్లతోనే.. హీలియోజన్ ప్లాంటులోని టవర్ పాయింట్ వద్ద ఏకంగా 1000 డిగ్రీ ల వేడిని పుట్టించారట! సూర్యుడి ఉపరితలంపై దాదాపు 5, 6 వేల డిగ్రీ సెల్సియస్ ల వేడి ఉంటుంది. లోపలికెళ్లినకొద్దీ లక్షల డిగ్రీల వేడి పెరుగుతూ పోతుంది. అంటే.. సూర్యుడి ఉపరితలంలో పావు వంతు వేడిని ఈ ప్లాంటులో పుట్టించారన్నమాట! ఈ ప్లాంట్‌లో ఉత్పత్తి అయ్యే సోలార్ పవర్‌ను వాడుకోవడంతో పాటు ఇక్కడ ఉత్పత్తి అయ్యే వేడిని ఇండస్ట్రీల్లో భారీ హీటింగ్ సిస్టంల కోసం కూడా వాడొచ్చని కంపెనీ నిర్వాహకులు అంటున్నారు.

శిలాజ ఇంధనాలకు ప్రత్యామ్నాయం..

ప్రపంచవ్యాప్తంగా ఏటా వాతావరణంలోకి విడుదలయ్యే కార్బన్‌ డయాక్సైడ్‌ సిమెంట్ కంపెనీల వాటా ఎంతో తెలుసా? దాదాపు7 శాతం! ఒక్క సిమెంట్ కంపెనీలు ఉపయోగించే శిలాజ ఇంధనాల వల్లే ఇంత మొత్తంలో కార్బన్‌ డయాక్సైడ్‌ గాలిలోకి విడుదలవుతోందట. అందుకే.. సిమెంట్, స్టీల్, గాజు వంటి ఇండస్ట్రీలలో సోలార్ పవర్‌ను వాడటమే దీనికి పరిష్కారమని నిపుణులు ఎప్పటినుంచో చెబుతున్నారు. కానీ.. ఇప్పుడున్న సోలార్ ప్లాంట్లతో పెద్ద పెద్ద ఇండస్ట్రీలకు పవర్ సప్లై చేయడం కష్టం. ఎందుకంటే.. సిమెంట్, స్టీల్, గాజు తయారీ కోసం పెద్ద ఎత్తున వేడి పుట్టించాల్సి ఉంటుంది. ప్రస్తుత సోలార్ పవర్‌తో ఇది సాధ్యం కాదు కాబట్టి శిలాజ ఇంధనాలనే వాడుతున్నారు. అయితే, ఇకపై హీలియోజన్ ప్లాంట్లతో ఇండస్ట్రీలకు ఎంత కావాలంటే అంత వేడిని పుట్టించవచ్చని ఈ ప్రాజెక్టు వెనక కీలక పాత్ర పోషిస్తున్న లాస్ ఏంజెలిస్ టైమ్స్ ఓనర్ పాట్రిక్ సూన్ షియాంగ్ వెల్లడించారు. ఈ ప్లాంట్లలో వేడిని వాడుకుని భారీగా హైడ్రోజన్ ఇంధనం కూడా తయారు చేయొచ్చని, ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి ప్లాంట్లు వస్తే.. కార్బన్‌ డయాక్సైడ్‌ను చాలా వరకూ తగ్గించొచ్చని పేర్కొన్నారు.