మహిళా సంఘాలకు సోలార్ పవర్​ ప్లాంట్లు

  • 4వేల మెగావాట్ల ఉత్పత్తికి చేయూతనందించండి
  • అధికారులకు డిప్యూటీ సీఎంభట్టి విక్రమార్క ఆదేశాలు

హైదరాబాద్, వెలుగు: ఇందిరా మహిళా శక్తి పథకం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లోని స్వయం సహాయక సంఘాల సభ్యులను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. శుక్రవారం ప్రజాభవన్​లో అధికారులతో ఆయన సమీక్షించారు. మహిళా సంఘాల ఫెడరేషన్ల ద్వారా రాష్ట్రంలో 4 వేల మెగావాట్ల సోలార్ పవర్ ఉత్పత్తికి చర్యలు ప్రారంభించాలని ఆదేశించారు.

ఫెడరేషన్లకు అవసరమైన జాగలు సేకరించి వాళ్లకు లీజుకు ఇవ్వాలని తెలిపారు. సోలార్ పవర్ ఉత్పత్తికి అవసరమైన ఆర్థిక నిధులకుగాను బ్యాంకర్లతో సమావేశం ఏర్పాటు చేసి రుణాలు ఇప్పించాలన్నారు. రుణాల రీ పేమెంట్​లో స్వయం సహాయక సంఘాల సభ్యులు 99 శాతం ప్రగతిని కనబరుస్తున్నారని, వీరికి రుణాలు ఇచ్చేందుకు బ్యాంకర్లు ఆసక్తిగా ఉన్నారని చెప్పారు. మహిళా సంఘాలకు సోలార్ పవర్ ఉత్పత్తి ప్లాంట్లు ఏర్పాటు చేసుకునేలా అవకాశాలు కల్పిస్తామని ఇటీవల బ్యాంకర్ల సమావేశంలోనూ చెప్పినట్లు డిప్యూటీ సీఎం గుర్తుచేశారు.

బ్యాంకులు కూడా రుణాలు ఇచ్చేందుకు అంగీకరించిన విషయాన్నీ ఆయన అధికారులకు వివరించారు. మహిళా సంఘాలకు ఆర్థిక చేయూతను ఇవ్వడం, పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడం ద్వారా సామాజిక మార్పు సాధించేందుకు అవకాశం ఏర్పడుతుందన్నారు. స్వయం సహాయక సంఘాలు ఆర్థికంగా బలపడితే గ్రామీణ మహిళలు ఆర్థికంగా, సామాజికంగా బలోపేతం అయ్యేందుకు అవకాశం ఏర్పడుతుందన్నారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, విద్యుత్ శాఖ అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. సమావేశంలో లోకేశ్, దివ్య దేవరాజన్, కృష్ణ భాస్కర్, రెడ్కో వైస్ చైర్మన్, ఎండీ  తదితరులు పాల్గొన్నారు.