సోలార్ పవర్ టార్గెట్.. 26 వేల మెగావాట్లు.. 2035 నాటికి చేరుకోవాలని ప్రభుత్వ లక్ష్యం

  • క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ పాలసీ–2025 విడుదల
  • సోలార్, విండ్, బ్యాటరీ స్టోరేజ్,పంప్డ్ స్టోరేజీ ప్రాజెక్టులకు ప్రాధాన్యం 
  • వీటి ఏర్పాటుకు ముందుకొచ్చేకంపెనీలకు ప్రోత్సాహకాలు 
  • ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలకు కరెంట్ అమ్ముకునేందుకు చాన్స్​

 హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తిని పెంచడమే లక్ష్యంగా ప్రభుత్వం ‘క్లీన్‌‌‌‌‌‌‌‌ అండ్‌‌‌‌‌‌‌‌ గ్రీన్‌‌‌‌‌‌‌‌ ఎనర్జీ పాలసీ–2025’ని తీసుకొచ్చింది. ఈ పాలసీని శనివారం హైదరాబాద్ లోని కమాండ్ కంట్రోల్ సెంటర్​లో సీఎం రేవంత్​రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి జూపల్లి కృష్ణారావు విడుదల చేశారు. భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా గ్రీన్​ఎనర్జీ సామర్థ్యం పెంచుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం సోలార్, విండ్, హైబ్రిడ్‌‌‌‌‌‌‌‌ ప్రాజెక్టులను ప్రోత్సహించేందుకు ప్రత్యేక రాయితీలు ఇవ్వాలని పాలసీలో పేర్కొంది. ప్రధానంగా సోలార్ పవర్​పై దృష్టిపెట్టిన ప్రభుత్వం.. 2035 నాటికి 26,374 మెగావాట్ల కెపాసిటీకి చేరుకోవాలని టార్గెట్ పెట్టుకుంది. ఐదేండ్ల లెక్కన మొత్తం పదేండ్లలో ఎంత మేరకు గ్రీన్ ఎనర్జీ లక్ష్యాలను చేరుకోవాలనేది పాలసీలో పేర్కొంది. దీని ప్రకారం.. 2030 నాటికి సోలార్ పవర్ 19,874 మెగావాట్లు, విండ్ పవర్ 2,528 మెగావాట్లు, హైడ్రో పవర్ 2,518 మెగావాట్లు, బ్యాటరీ స్టోరేజీ 3,388 మెగావాట్లు, పంప్డ్​స్టోరేజీ 417 మెగావాట్లకు పెంచుకోవాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇక 2035 నాటికి సోలార్ పవర్ 26,374 మెగావాట్లు, విండ్ పవర్​4,528 మెగావాట్లు, హైడ్రో పవర్ 2,518 మెగావాట్లు, బ్యాటరీ స్టోరేజీ 5,450 మెగావాట్లు, పంప్డ్ స్టోరేజీ 2,467 మెగావాట్లకు పెంచుకోవాలని టార్గెట్ పెట్టుకుంది. కొత్త పాలసీతో రాబోయే పదేండ్లలో 1.98 లక్షల కోట్ల పెట్టుబడులతో పాటు 1.14 లక్షల ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని అంచనా వేసింది. ఈ పాలసీ ద్వారా వచ్చే పదేండ్లలో  కాలుష్య​తీవ్రత 33 శాతం తగ్గుతుందని అంచనా వేసింది. 

నోడల్​ ఏజెన్సీలుగా జెన్​కో, రెడ్​కో..  

గ్రీన్ ఎనర్జీ పాలసీకి నోడల్​ఏజెన్సీలుగా జెన్​కో, రెడ్​కోలను ప్రభుత్వం నియమించింది. గ్రీన్ పవర్ ప్రాజెక్టుల రిజిస్ట్రేషన్, కెపాసిటీల కేటాయింపు, ప్రభుత్వ స్థలాల  కేటాయింపు, పవర్​జనరేషన్​అనుమతులు, రెన్యూవబుల్ ఎనర్జీ కోసం టెండర్లను పిలవడం తదితర పనులన్నీ నోడల్ ఏజెన్సీలు చేయనున్నాయి. కేంద్రంలోని మినిస్ట్రీ ఆఫ్​న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీతో నోడల్ ​ఏజెన్సీలు సమన్వయం చేసుకుంటూ పాలసీని అమలు చేయనున్నాయి. సెంట్రల్ స్రీమ్స్ ద్వారా గ్రాంట్స్​సేకరించడం, ఇన్సెంటివ్స్ ను పవర్ జనరేషన్ కంపెనీలకు ఇప్పించేందుకు సాయం అందించనున్నాయి. ఎనర్జీ సెక్టార్​లో ఇన్నోవేషన్​కోసం ప్రత్యేక ఇంక్యుబేషన్ సెంటర్ ఏర్పాటు చేయనున్నారు. ఇక పవర్ ప్లాంట్ల ఏర్పాటుకు ఆన్​లైన్​ద్వారా అప్లికేషన్లు స్వీకరించేందుకు ప్రత్యేక పోర్టల్ ​ఏర్పాటు చేయనున్నారు. టీజీ ఐపాస్ ద్వారా సింగిల్​ విండో పద్ధతిలో వేగంగా అనుమతులు ఇవ్వనున్నారు. 

కరెంట్ కొనే బాధ్యత డిస్కంలకే.. 

సోలార్, విండ్ పవర్ ప్లాంట్లు ఏర్పాటు చేసే సంస్థలు ఓపెన్‌‌ యాక్సెస్‌‌ ద్వారా డిస్కంలకు, ప్రైవేటు సంస్థలకు కరెంట్​విక్రయించుకునే అవకాశం కల్పించారు. కొత్తగా గ్రీన్​ ఎనర్జీ ఉత్పత్తి చేసే సంస్థల నుంచి తెలంగాణ డిస్కంలు కాంపిటేటివ్ ​బిడ్డింగ్​ ద్వారా పవర్ టారిఫ్ ప్రకారం కరెంట్ సేకరిస్తాయి. ప్రాజెక్ట్ ప్రపోజల్స్ అప్రూవల్ కోసం డిస్కంలు, ట్రాన్స్​కోతో కోఆర్డినేట్ చేస్తాయి. ప్రాజెక్టులకు కెపాసిటీ అలకేషన్ తర్వాత రెండేండ్లలో పూర్తి చేయాల్సి ఉంటుంది. మహిళా సంఘాల ఆధ్వర్యంలో సోలార్ పవర్ ప్లాంట్లు నెలకొల్పేందుకు కూడా ప్రభుత్వం ప్రోత్సాహకాలు అందిస్తుంది. 500 కిలోవాట్‌‌నుంచి 2 మెగావాట్ల సామర్థ్యంతో ప్లాంట్ల ఏర్పాటుకు అవకాశమిస్తుంది. ఈ విద్యుత్‌‌ను డిస్కంలే కొనుగోలు చేస్తాయి. ప్రభుత్వ పాఠశాలలు, ఇందిరమ్మ ఇండ్లు, ప్రభుత్వ భవనాలు, గ్రామ పంచాయతీ కార్యాలయాలపై రూఫ్‌‌ టాప్‌‌ సోలార్ ప్లాంట్లు ఏర్పాటు చేస్తారు. గ్రీన్ ఎనర్జీకి వినియోగించే భూములను వ్యవసాయేతర భూములుగా పరిగణిస్తారు. సీలింగ్ పరిమితి ఉండదు. భూవినియోగ మార్పిడి అనుమతులు అవసరం ఉండదు.

ప్రత్యేక రాయితీలు.. 

కొత్త పాలసీ ప్రకారం సోలార్, విండ్, పంప్డ్ స్టోరేజీ తదితర గ్రీన్ పవర్ ప్రాజెక్టులను ఏర్పాటు చేసే కంపెనీలకు ప్రత్యేకంగా రాయితీలు ఇవ్వనున్నారు. పవర్ ప్లాంట్ల ఏర్పాటుకు కొనుగోలు చేసే భూములకు 100 శాతం స్టాంప్ డ్యూటీ రీయింబర్స్ చేస్తారు. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నుంచి అనుమతులు, ఎన్వోసీలను మినహాయించారు. సోలార్ ప్లాంట్లకు నీటి చార్జీలను రీయింబర్స్ చేస్తారు  ఎంఎస్ఎంఈలకు 8 ఏండ్ల పాటు ఎలక్ట్రిసిటీ డ్యూటీ మినహాయింపు ఉంటుంది. ఫిక్స్​డ్​క్యాపిటల్ ఇన్వెస్ట్ మెంట్ ప్లాంట్లకు ఐదేండ్ల కాలానికి రూ.30 కోట్లకు మించకుండా 25 శాతం సబ్సిడీ ఇస్తారు. ఏడేండ్ల పాటు మెషినరీపై 100 శాతం ఎస్జీఎస్టీ రీయింబర్స్ చేస్తారు. ప్రభుత్వ, ప్రైవేట్ స్థలాల్లో కొత్త ప్లాంట్ల ఏర్పాటుకు అనుమతులు ఇస్తారు. ప్రభుత్వ స్థలాలను నామమాత్రపు అద్దెతో లీజుకు ఇస్తారు. ఫ్లోటింగ్‌‌ సోలార్‌‌ ప్రాజెక్టులను సైతం ప్రోత్సహించనున్నారు. ఈ ప్రాజెక్టుల ఏర్పాటు కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థలకు జలాశయాలను నామినేషన్‌‌ విధానంలో కేటాయిస్తారు.