మంచులో చిక్కుకున్న సోల్జర్ .. 36 గంటల తర్వాత కాపాడిన్రు

మంచులో చిక్కుకున్న సోల్జర్ .. 36 గంటల తర్వాత కాపాడిన్రు
  • 4 అడుగుల లోతు మంచులో రెస్క్యూ చేపట్టిన ఆర్మీ దళాలు

న్యూఢిల్లీ: భారత్‌‌‌‌‌‌‌‌‌‌–చైనా బార్డర్​లో గస్తీ నిర్వహిస్తుండగా అదృశ్యమైన సైనికుడు, అతడి పోర్టర్ మూడోరోజు సురక్షితంగా బయటపడ్డారు. బిహార్​లోని బక్సర్​కు చెందిన అనిల్ రామ్ ఇండో టిబెటన్ బార్డర్ ఫోర్స్​లో పనిచేస్తున్నారు. డ్యూటీలో భాగంగా మంగళవారం బార్డర్​లోని మున్సియారి నుంచి మిలామ్ వరకు గస్తీకోసం మోహరించిన బృందంలో అనిల్ ఉన్నారు. ఆయన వెంట వస్తు సామగ్రిని మోసేందుకు వెళ్లిన పోర్టర్ దేవేంద్ర సింగ్ ఉన్నారు. విపరీతంగా మంచు కురుస్తుండటంతో దారి కనిపించక ఈ ఇద్దరూ తప్పిపోయారు. దీంతో సైనిక దళాలు రెస్క్యూ చేపట్టాయి. 

ప్రతికూల పరిస్థితిల్లోనూ అతడిని రక్షించడమే టార్గెట్​గా అన్వేషించాయి. తప్పిపోయిన తర్వాత రెస్క్యూ ఆపరేషన్ చేపట్టిన ఆర్మీ బలగాలు 36 గంటల తర్వాత వారి జాడను గుర్తించాయి. అనిల్, పోర్టర్ దేవేంద్ర ఉత్తరాఖండ్​లోని మున్సియారీ గ్రామానికి 84 కిలోమీటర్ల దూరంలో మంచులో చిక్కుకుపోయారని అధికారులు తెలిపారు. ఆ రోజు రాత్రంతా ఓ గుహలో తలదాచుకున్నారని..  అయితే, ఆ గుహను కూడా మంచు కప్పేసిందని తెలిపారు. నాలుగు అడుగుల లోతు మంచులో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగించామన్నారు. ప్రస్తుతం ఇద్దరూ ఆర్మీ ఆస్పత్రిలో క్షేమంగా ఉన్నారని అధికారులు తెలిపారు.