లడఖ్ ప్రమాదం: గన్నవరం విమానాశ్రయానికి సైనికుల మృతదేహాలు..

లఢఖ్ లో నది దాటుతుండగా ప్రమాదవశాత్తు మరణించిన ఐదుగురు సైనికుల్లో ఏపీకి చెందిన ముగ్గురు సైనికులు ఉన్నారు.ముగ్గురు సైనికుల మృతదేహాలు గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నాయి. వారి మృతదేహాలకు ఆర్మీ సైనికులు గౌరవ వందనం సమర్పించారు.శనివారం మంచు కరిగి శ్యోక్ నదికి వరదలు వచ్చి ట్యాంకు కొట్టుకుపోయిన విషయం తెలిసిందే.

ఈ ప్రమాదంలో మరణించిన సైనికుల్లో  ప్రకాశం జిల్లా రాచర్ల మండలం కాల్వపల్లె గ్రామానికి చెందిన జూనియర్ కమిషన్డ్ అధికారి (జేసీవో) ముత్తుముల రామకృష్ణారెడ్డి మృతిచెందారు. కృష్ణా జిల్లా పెడన మండలం చేవేండ్ర గ్రామానికి చెందిన సైనికుడు సాదరబోయిన నాగరాజు (32) మరణించారు. ధనలక్ష్మి, వెంకన్నల కుమారుడైన నాగరాజుకు ఐదేళ్ల కిందట మంగాదేవితో పెళ్లయింది. వారికి ఏడాది పాప ఉంది. నాగరాజు సోదరుడు శివయ్య కూడా సైనికుడిగా సేవలందిస్తున్నారు.

మరో సైనికుడు బాపట్ల జిల్లా రేపల్లే మండలం ఇస్లాంపూర్ కు చెందిన సుభాన్ ఖాన్ కూడా మరణించారు. ఇతను 17ఏండ్ల క్రితం సైనికుడిగా చేరి అంచెలంచెలుగా హవల్దార్ స్థాయికి ఎదిగారు. ప్రస్తుతం ఈఎంఈ మెకానికల్ విభాగంలో పనిచేస్తున్నారు.