మల్లు స్వరాజ్యానికి ఘన నివాళులు

మల్లు స్వరాజ్యానికి ఘన నివాళులు

తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు మల్లు స్వరాజ్యానికి నేతలు, అభిమానులు నివాలులర్పిస్తున్నారు. ప్రజల సందర్శనార్దం మల్లు స్వరాజ్యం పార్ధివదేహాన్ని కేర్ హాస్పిటల్ నుంచి సీపీఎం రాష్ట్ర కార్యాలయం.. ఎంబీ భవన్‎కు తరలించారు. 91 ఏళ్ల మల్లు స్వరాజ్యం అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్ కేర్ హాస్పిటల్లో శనివారం సాయంత్రం చనిపోయారు. మల్లు స్వరాజ్యం భర్త మల్లు వెంకట నర్సింహారెడ్డి ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శిగా, నల్లగొండ జిల్లా సీపీఎం కార్యదర్శిగా పనిచేశారు. ఆయన 2004 డిసెంబర్ 4న చనిపోయారు. వీరికి ఒక కుమార్తె పాదూరి కరుణ, ఇద్దరు కుమారులు మల్లు గౌతంరెడ్డి, మల్లు నాగార్జునరెడ్డి ఉన్నారు. 

మల్లు స్వరాజ్యం మృతికి సీఎం కేసీఆర్ సంతాపం తెలిపారు. నాటి రైతాంగ పోరాటానికి కేంద్రంగా నిలిచిన తుంగతుర్తి గడ్డ అందించిన చైతన్యంతో ఎదిగిన మహిళా యోధురాలు మల్లు స్వరాజ్యం అన్నారు. తన జీవితాంతం ప్రజల కోసం అహర్నిశలు కృషి చేసిన ఆమె జీవన గమనం, గమ్యం రేపటి తరాలకు స్పూర్తిదాయకమని తెలిపారు. మల్లు స్వరాజ్యం లాంటి మహిళా నేతను కోల్పోవడం తెలంగాణకు తీరని లోటని.. ఆమె కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు కేసీఆర్.

మల్లు స్వరాజ్యం మరణవార్త తీవ్రంగా బాధించిందన్నారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. చివరి వరకు నమ్మిన సిద్ధాంతం కోసం పనిచేసిన వ్యక్తి మల్లు స్వరాజ్యం అన్నారు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం నిరంతరం పోరాడిన వ్యక్తిని కోల్పోవడం.. తెలుగు ప్రజలకు తీరని లోటన్నారు. సిద్దాంతాలు వేరయినా.. పేదల పక్షాన మల్లు స్వరాజ్యం చేసిన పోరాటాలు చిరస్మరణీయమన్నారు రాష్ట్ర బీజేపీ చీఫ్ బండి సంజయ్.
 
తెలంగాణ సాయుధ పోరాటంతో పేదల పక్షాన పోరాటం చేసిన చైతన్య దీపిక మల్లు స్వరాజ్యమన్నారు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. స్వరాజ్యం మరణం పేదలకు తీరని లోటన్నారు రేవంత్. స్వరాజ్యం మరణానికి ఉభయ కమ్యూనిస్టు పార్టీల నేతలు సంతాపం ప్రకటించారు. ఉమ్మడి రాష్ట్రంలో మల్లు వెంకట నర్సింహారెడ్డి, స్వరాజ్యం దంపతులు చేసిన పోరాటాలను గుర్తు చేసుకొని కన్నీరు పెట్టుకున్నారు.

ఆదివారం ఉదయం 10 గంటలకు హైదరాబాద్ నుంచి  మల్లు స్వరాజ్యం భౌతికకాయాన్ని నల్గొండ జిల్లా కేంద్రానికి తరలించనున్నారు. నల్గొండ జిల్లా సీపీఎం పార్టీ ఆఫీస్‎లో ఒంటి గంట వరకు ముఖ్య నేతలు, కార్యకర్తలు నివాళులర్పించనున్నారు. ఒంటి గంట తర్వాత నల్గొండ సీపీఎం ఆఫీస్ నుంచి అంతిమయాత్ర మొదలుకానుంది. మధ్యాహ్నం మూడున్నర గంటలకు నల్గొండ మెడికల్ కాలేజీకి ఆమె పార్థివదేహాన్ని అప్పగించనున్నారు.