సర్వే పూర్తయ్యేదాకా పనులొద్దు

సర్వే పూర్తయ్యేదాకా పనులొద్దు
  • సంగారెడ్డి జిల్లా ప్యారానగర్​లో ఘనవ్యర్థాల శుద్ధి కేంద్రంపై ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం

హైదరాబాద్, వెలుగు: సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం ప్యారానగర్‌‌  గ్రామంలో భూములకు సంబంధించిన సర్వే పూర్తయ్యేదాకా మున్సిపల్‌‌  ఘన వ్యర్థాల నిర్వహణ కేంద్రం పనులను చేపట్టరాదని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు మంగళవారం ఆదేశాలు జారీ చేసింది. 

సర్వే నిర్వహించిన తరువాత పనులు చేసుకోవాలని సూచించింది. ప్యారానగర్‌‌లో ఘన వ్యర్థాల నిర్వహణ కేంద్రం ఏర్పాటులో భాగంగా తమకు చెందిన 86.13 ఎకరాల ప్రైవేటు భూములను చదును చేయడాన్ని సవాలుచేస్తూ పి.రమాదేవి, మరో ఐదుగురు హైకోర్టులో పిటిషన్‌‌  వేశారు. దీనిపై జస్టిస్‌‌  సీవీ భాస్కర్‌‌ రెడ్డి విచారణ చేపట్టారు. 

పిటిషనర్‌‌  తరపు న్యాయవాది బి.చంద్రసేన్‌‌రెడ్డి వాదిస్తూ సర్వే నిర్వహించే దాకా పనులు చేయరాదని గతంలో హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను అధికారులు పట్టించుకోకుండా పిటిషనర్ల పొలాల్లోకి చొరబడుతున్నారని అన్నారు. అడ్వొకేట్‌‌  జనరల్‌‌  సుదర్శన్‌‌ రెడ్డి వాదనలు వినిపిస్తూ  రెవెన్యూ శాఖ కేటాయించిన 152 ఎకరాల్లో పనులు చేపడుతున్నామని, ప్రైవేటు భూముల్లోకి వెళ్లడం లేదన్నారు. వాదనలు విన్న జడ్జి.. సర్వే పూర్తయ్యేదాక పనులు కొనసాగించరాదని ఆదేశించారు. పిటిషన్‌‌పై  విచారణను మూసివేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.