శిలాజ ఇంధనాల దహనం..ఆపడమే పరిష్కారం : డా. దొంతి నరసింహారెడ్డి

శిలాజ ఇంధనాల దహనం..ఆపడమే పరిష్కారం : డా. దొంతి నరసింహారెడ్డి

శిలాజ ఇంధనాల (బొగ్గు, గ్యాస్, ఆయిల్)  దహనంతో వెలువడే వివిధ వాయువుల ఉద్గారాల ఫలితంగా భూతాపంతోపాటు వాతావరణంలో మార్పులు సంభవిస్తున్నాయి. 2021 ఆగస్టులో ఐపీసీసీ ఇచ్చిన నివేదిక పెరుగుతున్న ఉద్గారాల నిరంతర విడుదల వల్ల భూలోకం మీద జీవనం చేయి దాటిపోతుంది అని హెచ్చరిస్తూ పరిస్థితిని ‘కోడ్ రెడ్’గా అభివర్ణించింది.

పుడమి వాతావరణంలో ఉష్ణోగ్రత పెరుగుదల వల్ల పర్యావరణ పరిణామాలు మరింత విస్తృతమై  ఊహకు అందని విధంగా మానవాళి విపరీత ప్రకృతి వైపరీత్యాల రూపంలో ఆర్థికంగా కుంగదీస్తూ పేదల ఆర్థిక స్థితి మీద భారం మోపుతున్నాయి. సగటు జీవనం అస్తవ్యస్తం అవుతున్నది. పర్యావరణ విధ్వంసం ఒక సుడిగాలి మాదిరి అంతకంతకు అనేక రూపాలలో పుడమిని చుట్టుకుంటున్న వాస్తవం ఈ నివేదిక గుర్తు చేసింది.

ఉష్ణోగ్రతల్లో  పెరుగుదల

పారిశ్రామిక విప్లవానికి ముందు, కార్బన్ డై ఆక్సైడ్ గాఢత మిలియన్ కు 280 భాగాలు (పీపీఎం). కానీ, జూన్, 2018 నాటికి, ఇది సుమారు 408 పీపీఎమ్. ప్రతి సంవత్సరం విపరీతంగా పెరుగుతోంది. కార్బన్ డై ఆక్సైడ్ తో పాటు, ఇతర జీహెచ్​జీలు వేగంగా వాతావరణంలోకి చేరుతూ కార్బన్ డై ఆక్సైడ్ తో సమానంగా వాతావరణంపై సామూహిక ప్రభావం చూపుతున్నాయని అంచనా వేయబడింది. కార్బన్ డై ఆక్సైడ్ పెరుగుదల్లో 80 శాతం శిలాజ ఇంధనాలను మండించడం వల్ల, మిగిలినది ఉష్ణమండల అడవులు, ఇతర కారకాలను మండించడం వల్ల అవుతున్నది. ప్రస్తుత పెరుగుదల రేటు ప్రకారం, 2035 నాటికి, జీహెచ్​జీ   సంచయనాల కారణంగా పుడమి ఉష్ణోగ్రత 4.5 సెంటీగ్రేడ్ కు పెరుగుతుందని అంచనా. ఉష్ణోగ్రత పెరుగుదల మానవుల ఆరోగ్యం జీవనంతో పాటు పర్యావరణంపై విపరీతమైన దుష్ప్రభావాన్ని చూపుతుంది.

అంతటా కార్బన్

1996లో వాతావరణ మార్పులపై అంతర్​ప్రభుత్వ ప్యానెల్ (IPCC) 'అందుబాటులో ఉన్న రుజువుల ప్రకారం ప్రపంచ వాతావరణంపై స్పష్టమైన మానవ ప్రభావాన్ని సూచిస్తున్నది' అని నిర్ధారించింది. భవిష్యత్తులో వాతావరణ కార్బన్ డై ఆక్సైడ్ గాఢత పెరిగే కొద్దీ, పుడమి ఉష్ణోగ్రత కూడా పెరుగుతుందని చాలా శాస్త్రీయ నమూనాలు అంచనా వేసాయి. అదనంగా, వాతావరణ మార్పు చాలా పెద్ద, సహజ కార్బన్ చక్రాన్ని మారుస్తుంది. ఫలితంగా ఇది వాతావరణ మార్పును వేగవంతం చేస్తుంది. వేడెక్కుతున్న నేలలు ఎక్కువ కార్బన్​ను విడుదల చేయవచ్చు. వృక్షజాలం నాశనం అవ్వడం వల్ల కార్బన్ డై ఆక్సైడ్  వాతావరణానికి తిరిగి రావచ్చు. వాతావరణం నుండి వెచ్చని సముద్రం సాధారణ స్థాయి కంటే తక్కువ కార్బన్ డై ఆక్సైడ్ ను పీల్చుకుంటుంది.

అణుశక్తి ఆమోదం పొందలేదు

కోపెన్ హాగన్ లోని COP–15 లో, ప్రపంచ సగటు ఉష్ణోగ్రత 2సి కంటే ఎక్కువ పెరగనివ్వకూడదని ప్రపంచ నాయకులు అంగీకరించారు. ఆ మేరకు 80% కంటే ఎక్కువ ప్రపంచ ఉద్గారాలకు ప్రాతినిధ్యం వహించే దేశాలు కోపెన్ హాగన్ ఒప్పందం, కాన్కున్ ఒప్పందాల కింద దేశీయ లక్ష్యాలను వెల్లడించాయి. కొన్ని దేశాలలో ఈ లక్ష్యాలు చేరుకోవడానికి కర్బన ఉద్గారాలపై నిర్దిష్టమైన చర్య అవసరం. వాతావరణం, మానవ ఆరోగ్యం పర్యావరణాన్ని దృష్టిలో ఉంచుకుని అన్ని ఇంధన వనరుల వినియోగం క్రమంగా తగ్గించాల్సి ఉంటుంది. ప్రపంచంలో, శిలాజ ఇంధనాల ఉత్పత్తి, ప్రాసెసింగ్, ఎగుమతి లేదా వినియోగం, సంబంధిత శక్తి-కేంద్రిత ఉత్పత్తులు లేదా శిలాజ ఇంధనాల వినియోగం నుంచి ఉత్పన్నమయ్యే ఆదాయంపై ఎక్కువగా ఆధారపడే దేశాలు ఉన్నాయి. సంప్రదాయ వాణిజ్య శిలాజ ఇంధనాలు చమురు, గ్యాస్ మరియు బొగ్గు వినియోగం తగ్గించాలని అంతర్జాతీయ వాతావరణ సదస్సులలో దేశాల మీద ఒత్తిడి ఉన్నది. అయితే, ఆ దిశగా ఆలోచించకుండా  సహజ వాయువు, లేదా అణు శక్తి ప్రత్యామ్నాయంగా కొన్ని దేశాలు మాట్లాడుతున్నాయి. కానీ, ఇది సార్వత్రిక ఆమోదం పొందలేదు. ఎందుకంటే, సహజ వాయువు మండించినా మిథేన్ వెలువడుతుంది కనుక దీనిని ప్రత్యామ్నాయంగా చూడటం లేదు.

సుస్థిర శక్తి ఇంధనం

దీర్ఘకాలంలో, వివిధ ఇంధన వనరుల ఎంపికలో ధర ప్రధాన కారణంగా మారింది. పీట్, ఆయిల్ షేల్, సముద్రపు అలల శక్తి (టైడల్ పవర్) వంటి శక్తి వనరులు అధిక ఉత్పత్తి ఖర్చుల కారణంగా ప్రాధాన్యత సంతరించుకోలేదు. గాలి, సౌర, జియోథర్మల్, కొంత మేరకు బయోమాస్, కలప పట్ల ఉత్సాహం పెరుగుతోంది. ఈ శక్తి వనరుల ధర, ఖర్చులు తక్కువ అవడంతో పాటు వాణిజ్యకరణలో పురోగతి కనిపిస్తున్నది. పవన విద్యుత్ ఉత్పత్తి చౌకగా, ఆధారపడే వనరుగా పరిణమించింది. సౌర శక్తి, ముఖ్యంగా ఫోటోవోల్టాయిక్స్ (పివి)కి అవకాశాలు పెరుగుతున్నాయి. ఉత్పత్తి, పరికరాల ఖర్చులు తగ్గడంతో ఫోటోవోల్టాయిక్స్ వేగంగా అభివృద్ధి చెందాయి. గ్రిడ్ అనుసంధానిత వ్యవస్థలలో పెద్ద వాణిజ్య సంస్థలు ఈ తరహ పరిశ్రమలోకి ప్రవేశించాయి. నాన్ గ్రిడ్ కనెక్టెడ్ సోలార్ సిస్టమ్​ల పురోగతి మీద కూడా ఆశలు ఉన్నాయి. పునరుత్పాదక ఇంధన టెక్నాలజీతో ఉపయోగించి ఉత్పత్తి చేసే శక్తి విద్యుత్  చాల శ్రేష్టమైన పద్ధతి అని నిర్ధారణ అయ్యింది. దాంతో పాటు శక్తి వినియోగంలో పొదుపు ద్వారా "2050 నాటికి శక్తి సంబంధిత కార్బన్ డై ఆక్సైడ్ ఉద్గారాలను గరిష్టంగా 3.5 గిగా టన్నులకు తగ్గించగలదు, 2050 నాటికి శిలాజ ఇంధనాలలో 80 శాతానికి పైగా దశలవారీగా తగ్గించగలదు" అని గ్రీన్ పీస్ సంస్థ నివేదిక అంచనా వేసింది. ఎఫీషియన్సీ మీద కూడా దృష్టి పెడుతున్నారు. రెండు యూనిట్ల విద్యుత్ బదులు ఒక యూనిట్ విద్యుత్ ఉపయోగించడం ద్వారా శక్తి అవసరాన్ని తగ్గించడం. తక్కువలో ఎక్కువ ఫలితాలు రాబట్టడం మీద అంతర్జాతీయంగా లక్ష్యాలు నిర్ధారిస్తున్నారు. ఈ చర్యల ద్వారా ఆర్థిక వృద్ధిని సాధించడం, అణు శక్తిని నివారించడం, అందరికి విద్యుత్ అందుబాటులోకి తేవడం కూడా ఇందులో ఇమిడి ఉన్న లక్ష్యాలు. 

ఇంధనాల వినియోగం తగ్గించాలి

వినిమయ జీవనశైలిలో మార్పుల ద్వారా శిలాజ ఇంధనాల వినియోగం పరిమితం చేయాలని ఒక వాదన. వాతావరణ మార్పులపై ఐక్యరాజ్యసమితి ఫ్రేమ్ వర్క్ కన్వెన్షన్ యొక్క ఆర్టికల్ 4 ప్రకారం, ప్రతి దేశం వాతావరణ మార్పులకు తమ ఉద్గారాల వంతు చర్యలను అంచనా వేసుకోవాలి. అమెరికా వంటి అభివృద్ధి చెందిన దేశాలు ఎర్త్ సమిట్ ప్రతిపాదించిన విధంగా ఈ దిశలో చర్యలు తీసుకోవడానికి ఇష్టపడటంలేవు. భారతదేశం వంటి అభివృద్ధి చెందుతున్న దేశాలు, అభివృద్ధి చెందిన దేశాలు తమ తలసరి జీహెచ్​జీ ఉద్గారాలను అభివృద్ధి చెందుతున్న దేశాల తలసరి స్థాయికి తగ్గించాలని వాదిస్తున్నాయి. ‘మార్పు తీసుకురావడానికి ప్రధాన బాధ్యత అభివృద్ధి చెందిన దేశాలది.... ఉద్గారాలను నియంత్రించడానికి వారు విశ్వసనీయమైన చర్యలు తీసుకోవాలి’ అని పెన్సిసెల్వేనియాలోని పిటస్​బర్గ్ లో జి20 శిఖరాగ్ర సమావేశం తరువాత జరిగిన విలేకరుల సమావేశంలో నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ అన్నారు. యుఎన్ఎఫ్​సీసీ చర్చల్లో అవసరమైన ఉద్గారాల తగ్గింపునకు ప్రధానంగా వాతావరణ జీహెచ్​జీ  విడుదలకు కారణమయిన అభివృద్ధి చెందిన దేశాలు ప్రధాన బాధ్యత వహించాలని భారతదేశం నొక్కి చెప్పింది. మరోవైపు, కార్బోనేషియస్ ఇంధనాలను మండించడం ముఖ్య కారణంగా భావిస్తే, అంతరిస్తున్న ఉష్ణమండల అడవులు, అసహజ వ్యవసాయ పద్ధతులు, సీఎఫ్​సీలు, ఇతర హాలోజెన్ ఉత్పత్తి వల్ల ఉత్పన్నమయ్యే సమస్యలు కూడా ముఖ్యమని వాదించారు. మొత్తంగా, పుడమిలో జీహెచ్​జీ  ఉద్గారాలను తీవ్రంగా తగ్గించాలనే నిజమైన లక్ష్యానికి అన్ని దేశాలు ముందడుగు వేయాలంటే స్వీయ నియంత్రణ, అంతర్జాతీయ ఒప్పందాల అమలు అవసరం అవుతాయి.

- డా. దొంతి నరసింహారెడ్డి, పాలసీ ఎనలిస్ట్​