భూ సమస్యనైనా పరిష్కరించండి..చావడానికైనా అనుమతివ్వండి

 భూ సమస్యనైనా పరిష్కరించండి..చావడానికైనా అనుమతివ్వండి
  • తహసీల్దార్ ఆఫీసు ఎదుట దళిత కుటుంబం ఆందోళన
  • నల్గొండ జిల్లా గుర్రంపోడు మండల కేంద్రంలో ఘటన

హాలియా, వెలుగు:  భూ సమస్యనైనా పరిష్కరించండి.. లేదంటే చనిపోవడానికైనా అనుమతి ఇవ్వండి.. అంటూ ఓ దళిత కుటుంబం ఆందోళనకు దిగిన ఘటన నల్గొండ జిల్లాలో జరిగింది. బాధిత కుటుంబం తెలిపిన ప్రకారం.. గుర్రంపోడు మండలం మొసంగి గ్రామానికి చెందిన బొంగరాల వెంకటమ్మ కుటుంబం 2008లో అదే మండలంలోని కొత్తలూరు గ్రామ శివారు సర్వే నంబర్. 97ఊ-లో 2 ఎకరాల భూమిని కొనుగోలు చేసింది.  

అప్పటినుంచి 2020 వరకు భూమిని సాగు చేస్తుండగా.. గత సర్కార్ తెచ్చిన ధరణి పోర్టల్ కారణంగా వెంకటమ్మ భూమిని.. పక్కనే ఉన్న వ్యక్తి పేరిట రికార్డుల్లో ఎక్కించారు. దీంతో రికార్డు మార్పు చేయాలని తహసీల్దార్ ఆఫీసులో వెంకటమ్మ కుటుంబం అప్లికేషన్ చేసుకుంది. క్షేత్రస్థాయిలో ఆర్ఐ పరిశీలించి ఆమెకు అనుకూలంగా రిపోర్ట్ ఇచ్చినా తహసీల్దార్ మాత్రం స్పందించడం లేదు. 

బాధిత కుటుంబం రెండేండ్లుగా ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నా పట్టించుకోవడం లేదు. భూమిపై పొజిషన్ లో ఎవరు ఉంటే వాళ్లదేనని తహసీల్దార్ అంటున్నారని, అధికారుల తప్పిదం కారణంగా భూమిని కోల్పోవాల్సి వస్తుందని వెంకటమ్మ ఆవేదనతో చెప్పింది. తమ భూ సమస్యనైనా పరిష్కారించాలని, లేదంటే చావడానికైనా పర్మిషన్ ఇవ్వాలని గురువారం బాధిత కుటుంబం తహసీల్దార్ ఆఫీసు వద్దకు వచ్చి నిరసన తెలిపారు. చనిపోవడానికి అనుమతి ఇవ్వాలని అధికారులను కోరారు.