- పీఆర్టీయూ నేతలకు మంత్రి పొన్నం ప్రభాకర్ హామీ
హైదరాబాద్, వెలుగు: బీసీ గురుకులాల్లో పనిచేస్తున్న టీచర్ల సమస్యలు తొందరలోనే పరిష్కరిస్తామని బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ హామీ ఇచ్చారు. బుధవారం పీఆర్టీయూ అనుబంధ గురుకుల టీచర్స్ అసోసియేషన్ (పీఆర్జీటీఏ) నూతన సంవత్సర క్యాలెండర్ను మంత్రి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా బీసీ గురుకులాల పనివేళలు మార్చాలని, జీవో 317 ద్వారా తలెత్తిన సమస్యలను పరిష్కరించాలని పీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు పి.శ్రీపాల్ రెడ్డి, కమలాకర్ రావు, ఎమ్మెల్సీ రఘోత్తంరెడ్డి మంత్రిని కోరారు.
వచ్చే వేసవి సెలవుల్లో ప్రమోషన్లు కల్పించాలని, బీసీ గురుకుల టీచర్లకు టీఎస్జీఎల్ఐ అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు. టీచర్లకు 010 ద్వారా వేతనాలు ఇవ్వాలని, రెండో శనివారం సెలవు ఇవ్వాలని కోరారు. కాగా, మంత్రి స్పందించి తొందరలోనే సమస్యలను పరిష్కరిస్తామని వారికి స్పష్టం చేశారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్, నేతలు ఇన్నారెడ్డి, దిలీప్ రెడ్డి, ఉప్పు అశోక్, శ్రీనివాసచారి తదితరులు పాల్గొన్నారు.