సంఘాల ఐక్యతతోనే..సమస్యల పరిష్కారం

ఐకమత్యమే మహాబలం అన్నారు పెద్దలు. చలిచీమలు కలిసికట్టుగా ఉండబట్టే  బలవంతమైన సర్పమును కూడా చంపగలిగాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తరువాత ఉపాధ్యాయుల సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి, అర్హులందరికీ పదోన్నతులు లభిస్తాయి, విద్యావ్యవస్థ పూర్తిగా ప్రక్షాళనం అవుతుందని భావించాం. కానీ అలా జరగలేదు. ఎక్కడి సమస్యలు అక్కడే ఉండిపోయాయి. ప్రశ్నించాల్సిన టీచర్​ఎమ్మెల్సీలు మౌనం వహిస్తుండగా, పరిష్కరించాల్సిన ప్రభుత్వమూ చూసీచూడనట్లుగా వ్యవహరిస్తున్నది. ఉపాధ్యాయ సంఘాలన్నీ ఎన్ని పోరాటాలు, ధర్నాలు, నిరసనలు చేసినా.. ఏ ఒక్క సమస్యా పరిష్కారం కాకపోగా సమస్యలు రోజురోజుకీ పెరుగుతున్నాయి. ‘విభజించు పాలించు’ అన్న రీతిలో ప్రభుత్వం ఉన్నది.

సంఘాల మధ్య ఐక్యత లేకపోవడం ద్వారా సమస్యలను పరిష్కరించకుండా చోద్యం చూస్తున్నది. ఒకటి రెండు ఉద్యమ నేపథ్యం కలిగిన సంఘాలు ధర్నాకు పిలుపునిచ్చినా.. ప్రయోజనం లేకుండా పోతున్నది. JACTO, USPC, TTJAC తదితర పేర్లతో కొన్ని సంఘాలు ఐక్యంగా ఏర్పడి ఉద్యమాలు చేసినప్పటికీ పెద్దగా ప్రభావం చూపలేదు. అందుకే ఐక్య ఉద్యమాలకు ఇప్పుడు ప్రాధాన్యత సంతరించుకుంది.

వాట్సాప్​ గ్రూపులతో సరిపోదు

ఇటీవల కొన్ని సంఘాలు సమస్యల పరిష్కారం కోసం ఐక్య ఉద్యమాల ఆవశ్యకతను గుర్తించి పెద్ద ఎత్తున ఉద్యమాలకు పిలుపునివ్వడానికి సోదర సంఘాలను కలవడం శుభపరిణామం. అయితే అన్ని సంఘాలు ఏకతాటి పైకి వస్తాయా? రావా? అనేది వేచి చూడాల్సిందే. క్షేత్రస్థాయిలో ఉపాధ్యాయులు కూడా సంఘాలన్నీ కలిస్తేనే సమస్యలకు పరిష్కారం దొరుకుతుందనే అభిప్రాయంతో ఉన్నారు. ఇటీవల కాలంలో ఉపాధ్యాయుల్లో ఉద్యమ స్ఫూర్తి కొరవడిందనేది సర్వత్రా వినిపిస్తున్న మాట. మండల, జిల్లా, రాష్ట్ర నాయకులు ఉద్యమం చేస్తారు, ఉద్యమ ఫలాలు మేము అనుభవిస్తాం అనే ధోరణిలో ఉంటే.. ప్రస్తుతం ఉన్న పరిస్థితులను ఎదుర్కోవాల్సి ఉంటుంది తప్ప ఎలాంటి ప్రయోజనం ఉండదు. ఇప్పుడు ఉద్యోగ, ఉపాధ్యాయులు అనుభవిస్తున్న సౌకర్యాలన్నీ ఏ ప్రభుత్వ దయాదక్షిణ్యాల మీద వచ్చినవి కావు, పోరాడి సాధించుకున్నవే అనే విషయాన్ని టీచర్లు గమనించాలి. వాట్సాప్ గ్రూపుల్లో మేసేజ్​లు పెడుతూ యుద్ధం చేస్తే ప్రయోజనం శూన్యం.

పోరాడాల్సిన సమయం

ప్రభుత్వంలో ఉపాధ్యాయులకు మాత్రమే ఉన్న అవకాశం ఎమ్మెల్సీ. కానీ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన అనంతరం మూడు పర్యాయాలు మండలికి ఎమ్మెల్సీలను ఎన్నుకొని పంపినా సమస్యలు ఎక్కడి గొంగళి అక్కడే అన్న చందంగా తయారయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వం దశాబ్ది ఉత్సవాలు ఘనంగా నిర్వహించినా.. ఇతర శాఖల ఉద్యోగుల మాట ఎలా ఉన్నా, టీచర్లు మాత్రం సంతోషంగా లేరన్నది అక్షరసత్యం. బదిలీలు, పదోన్నతులు లేక, 317 జీవో కారణంగా సొంత జిల్లాను వదిలి, కుటుంబానికి దూరంగా ఉంటూ.. సమయానికి జీతాలు రాక, పాఠశాల్లో కనీస సౌకర్యాలు లేక, స్కావెంజర్లు లేక, శారీరకంగా, మానసికంగా, ఆర్థికంగా సతమతమవుతూ విధులు నిర్వహిస్తున్నారు.

ఇన్ని కష్టాలు ఉన్నా బోధనపై ప్రభావం పడకుండా.. పిల్లకు పాఠాలు నేర్పుతుంటే.. ప్రభుత్వం టీచర్ల కనీస సమస్యలను పరిష్కరించడానికి ముందుకు రావడం లేదు. ఎదురుచూపులతో సమస్యలు పరిష్కారం అయ్యేలా కనిపించడం లేదు. అందుకే ఇప్పటికైనా ఉపాధ్యాయ సంఘాలన్నీ ఏకతాటిపైకి వచ్చి ప్రభుత్వానికి కనువిప్పు కలిగేలా పెద్దఎత్తున ధర్నాలు, ఆందోళనలకు పిలుపునివ్వాలి. టీచర్లంతా తెలంగాణ ఉద్యమంలో సకల జనుల సమ్మె ద్వారా రాష్ట్రాన్ని  ఏ విధంగా సాధించుకున్నారో అదే ఉద్యమ స్ఫూర్తిని చూపించాల్సిన తరుణం ఆసన్నమైంది. సంఘాలకు అతీతంగా ఉద్యమంలో పాల్గొన్ననాడే సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. ఉపాధ్యాయుడు ఏ ఆందోళన లేకుండా బడి పిల్లల భవిష్యత్​కు బాటలు వేస్తాడు.. ఏమంటారు?.

- సుధాకర్.ఏ.వీ, అసోసియేట్ అధ్యక్షుడు, ఎస్టీయూటీఎస్​