- ఖమ్మం, వరంగల్, నల్గొండ గ్రాడ్యూయేట్ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న
ఖమ్మం టౌన్, వెలుగు : కాంగ్రెస్ తోనే నిరుద్యోగుల సమస్యలు పరిష్కారం అవుతాయని ఆ పార్టీ ఖమ్మం, వరంగల్, నల్గొండ గ్రాడ్యుయేట్ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న అన్నారు. 27న జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో గ్రాడ్యుయేట్స్ తనను గెలిపిస్తే, విద్యావంతుల పక్షాన అండగా ఉంటానని హామీ ఇచ్చారు. సోమవారం ఖమ్మం నగరంలోని కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గాప్రసాద్, మాజీ ఎమ్మెల్సీ కపిలవాయి దిలీప్ కుమార్, డాక్టర్ కత్తి వెంకటస్వామితో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు.
ఏ అధికారం లేనప్పుడే తాను ప్రజాసమస్యలపై పోరాడిన నికార్సయిన వ్యక్తినని, అదే అధికారంలో ఉంటే ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఎంత దూరమైన వెళ్లగలుగుతానని తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల మ్యానిఫెస్టోలో యువతకు ప్రకటించిన అన్నీ హామీలు నెరవేరేలా కృషిచేస్తానని చెప్పారు. పట్టభద్రులు ఎవరు ప్రతినిధిగా ఉంటే న్యాయం జరుగుతుందో ఆలోచించి ఓటు వేయాలని కోరారు.
ఈ సమావేశంలో పార్టీ సిటీ అధ్యక్షుడు మహమ్మద్ జావీద్, నగర కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్ నాగండ్ల దీపక్ చౌదరి, మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, రాష్ట్ర ఓబీసీ సెల్ ఉపాధ్యక్షుడు వడ్డెబోయిన నరసింహారావు తదితరులు పాల్గొన్నారు.
తప్పుడు కేసులు పెట్టి వేధించిన్రు..
ఇల్లెందు : కేసీఆర్హయాంలో తనపై 70 తప్పుడు కేసుల పెట్టి తనను, తన కుటుంబాన్ని వేధించారని తీన్మార్ మల్లన్న ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం ఇల్లెందు పట్టణంలో నిర్వహించిన నియోజకవర్గ పట్టభద్రుల ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడారు. తనపై పెట్టిన కేసులన్నీ తన ఇంటి కేసులు కాదని, గత ప్రభుత్వ చేసిన అవినీతి, అక్రమాలపై ప్రశ్నించినందుకే కేసీఆర్ ఆ కేసులు పెట్టారని తెలిపారు. తన బిడ్డ మాదిరిగా ఎవరు అనారోగ్యంతో బాధపడవద్దనే లక్ష్యంతో ఎంతోమంది చిన్నారులకు ఉచితంగా ఆపరేషన్ చేయించినట్లు చెప్పారు.
దేశంలో ప్రతీ ఏడాది 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన బీజేపీ ప్రభుత్వం మాట తప్పిందన్నారు. రాష్ట్రంలోని కేసీఆర్ ప్రభుత్వం ఉద్యోగాల పేరుతో నిరుద్యోగులను మోసం, దోపిడీ చేసిందని మండిపడ్డారు. పల్లా రాజేశ్వర్రెడ్డి ఓట్లు వేసి గెలిపించిన పట్టభద్రులను గాలికి వదిలేసి తన స్వలాభం కోసం ఎమ్మెల్యే అయ్యారని విమర్శించారు.
రానున్న రోజుల్లో సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో జాబ్ క్యాలెండర్వేసి నిరుద్యోగులకు తీపి కబురు అందిస్తామని, తనను ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిపించాలని కోరారు. ఎమ్మెల్యే కోరం కనకయ్య, ఎమ్మెల్సీ ఎన్నికల ఇన్చార్జ్ మువ్వా విజయ్ బాబు, జిల్లా కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.