ప్రజాభిప్రాయం మేరకే పథకాలను అమలుచేయాలి

ప్రజాభిప్రాయం మేరకే పథకాలను అమలుచేయాలి

కాంగ్రెస్‌‌ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు, మొదటి ఆరు గ్యారంటీల్లో ఒకటి మహాలక్ష్మీ పథకం. ఈ పథకం కింద మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించారు.  గత సంవత్సరం డిసెంబర్‌‌ 9న ముఖ్యమంత్రి రేవంత్‌‌ రెడ్డి  ఈ పథకాన్ని ప్రారంభించిన సంగతి మనకు తెలిసిందే.  కర్నాటక  ప్రభుత్వం అమలుచేసిన మాదిరిగా ఈ పథకం ప్రకారం  మహిళలు అంతర్రాష్ట్ర  సర్వీసులోనే మహిళలందరికీ ఆధార్‌‌ కార్డు చూపితే ఉచితంగా ప్రయాణం చేయవచ్చును. జిల్లాల్లో  పల్లెవెలుగు,  ఎక్స్‌‌ప్రెస్‌‌  బస్సుల్లో,  భాగ్యనగరంలో  సిటీ,  ఆర్డనరీ,  సిటీ, మెట్రో బస్సుల్లో ఉచితంగా మహిళలు ప్రయాణించవచ్చు.  దీనికి అయ్యే ఖర్చు ప్రభుత్వం రీయింబర్స్‌‌మెంట్‌‌ రూపంలో ఆర్టీసీకి తిరిగి చెల్లిస్తున్నది.  దీనివలన ఆర్టీసీకి ఏ మాత్రం నష్టం లేదు. తిరిగే  మైలేజీ విషయంలోనూ పరిమితి లేదు.  తెలంగాణ  అంతటా  మహిళలు ప్రయాణించవచ్చు. మహిళా సాధికారత కోసం,  మహిళలు  ఆర్థిక స్వావలంబనతో  బతకడానికి ఈ కార్యక్రమాన్ని కాంగ్రెస్​ ప్రభుత్వం  చేపట్టడం జరిగింది.  మహిళల అభ్యున్నతి, ఆర్థిక ప్రగతిరీత్యా  ప్రభుత్వం ఆలోచన చాలా మంచిదే.  కానీ,  కొందరు ఉచితం పేరుతో  అనవసరమైన ప్రయాణాలు చేస్తున్నారని, దానితో  ఆర్టీసీ బస్సుల్లో  నిజంగా  పనులకి, అత్యవసరంగా  వెళ్ళేవారికి ఇబ్బంది జరుగుతోందని కొందరు మహిళలే  కామెంట్స్‌‌ చేస్తున్నారు.

మహిళల ప్రగతికి చేయూత

ఉద్యోగాలు,  స్వయం ఉపాధి,  జీవనోపాధి  పనులకు వెళ్ళేవారు, అదేవిధంగా  తమ అవసరాల కోసం వెళ్ళే మహిళలకు ఇది చాలా మంచి కార్యక్రమం. మహిళల ప్రగతికి ఈ పథకం చేయూతగా నిలుస్తున్నది.  కానీ, ఆర్థిక స్తోమత ఉండి కారుల్లో,  బైకుల్లో,  ఆటోలలో  వెళ్ళేవారు సైతం ఉచిత ప్రయాణం పేరుతో ఆర్టీసీ బస్సుల్లో  రాకపోకల వల్ల  ప్రభుత్వ ఆదాయానికి గండిపడుతున్నది.  రూ.10 వేల నుంచి రూ. 60 వేల జీతం పొందేవారు కూడా అందరూ సమానంగా ఆర్టీసీ బస్సులో ఉచితంగా బస్సు ప్రయాణం చేస్తున్నారు.  అయితే,  ఆర్థికంగా ఉన్నత స్థితిలో ఉన్నవారు కూడా ఉచితంగా ప్రయాణించడం వల్ల రాష్ట్ర ఆర్థికస్థితిపై భారం పడుతోంది. ఇదే కొనసాగితే ఆర్థిక అసమానతలు ఎలా  తొలుగుతాయి ? సమాజంలో సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన వర్గాల వారి అభ్యున్నతి కోసం రాజ్యాంగపరమైన నిబంధనలు ఉన్నప్పటికీ ఆచరణలో ప్రభుత్వాలు వెనకబడుతున్నాయి. గతంలో ఆటోలలో  ప్రయాణించే వారు కూడా ఉచిత ప్రయాణం పేరుతో బస్సు ప్రయాణం చేయడం వలన ఆటోవాళ్ళు కూడా జీవనోపాధిని కోల్పోతున్నారు.  

పథకాలపై అభిప్రాయ సేకరణ చేయాలి

ప్రభుత్వాలు ఒక నిర్ణయం తీసుకునేముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించి పథకాలను అమలుచేస్తే  బాగుంటుంది.  గతంలో  కూడా బీఆర్‌‌ఎస్‌‌  ప్రభుత్వం రైతుబంధు పథకం కింద భూమి ఉన్నవారందరికీ ఎన్ని ఎకరాలు ఉన్నా ఈ పథకాన్ని అమలుచేసింది.  ప్రతిపక్షాలు, సివిల్‌‌ సొసైటీ సంస్థలు 5 ఎకరాలలోపు వారికి,  వ్యవసాయం చేసేవారికి మాత్రమే రైతుబంధు పథకాన్ని వర్తింపచేయాలని కోరినా ప్రభుత్వం వినిపించుకోలేదు. దీంతో  రాష్ట్ర ఖజానాపై పెనుభారం పడింది.  దాని ప్రభావం ఇంకా కొనసాగుతూనే ఉంది. గత  ప్రభుత్వాల  అనుభవాలను,  వైఫల్యాలను పాఠాలుగా తీసుకుని ప్రభుత్వాలు  ముందుకువెళితే బాగుంటుంది.  ప్రజల పన్నులతో నడిచే ప్రభుత్వాలు పాలకులు తమ నిర్ణయాలను ప్రజల అభిప్రాయసేకరణకు అనుగుణంగా కొనసాగించవచ్చు.  ఎటువంటి బేషజాలకు వెళ్ళకుండా మార్పులు  చేర్పులు చేయవచ్చును. గెలుపు, ఓటములు పాలనలో పారదర్శకత,  నిజాయితీ, జవాబుదారీతనం,  ప్రజల భాగస్వామ్యం,  సమర్థవంతమైన  సుపరిపాలన అంశాలే సంక్షేమ పథకాల కంటే ఎక్కువగా అభివృద్ధిని ప్రభావితం చేస్తాయి.

- సోమ శ్రీనివాసరెడ్డి,కార్యదర్శి, ఫోరం ఫర్‌‌ గుడ్‌‌ గవర్నెన్స్‌‌