తెలుగు సాహితీవనంలో లేటుగా పూచిన పువ్వు సోమరాజు సుశీల. రచనారంగంపై ఆమెకు చాలా ఆలస్యంగా ఆసక్తి కలిగింది, అది కూడా ఆశ్యర్చకరంగా! ఒక ఎంటర్‌ప్రెన్యూర్‌గా తాను ఎదుర్కొన్న సమస్యలనే కథలుగా రాశారు. తనకు తెలిసిన ప్రపంచంలోని కతలు, కన్నీళ్లను గుండెకు హత్తుకునేలా, చేదు విషయాలకు షుగర్ కోట్ వేసి, పిప్పర్మెంట్ బిళ్లల్లా పాఠకులకు అందించారు.
ఆమె కథలన్నీ మన చుట్టూ తిరిగేవే. మనకు తెలిసిన పాత్రలే. యాక్సిడెంటల్‌గా రచయిత్రిగా మారిన సోమరాజు సుశీల ఒక ఇంటర్వ్యూలో… ‘నేను చాలా ఆలస్యంగా కథా రచనలోకి వచ్చాను. నా కథలన్నీ నోస్టాల్జియానే’ అన్నారు. గురువారం తెల్లవారుజామున కన్నుమూసిన సోమరాజు సుశీల (75) కేవలం రచనా రంగానికే పరిమితమైన వ్యక్తి కాదు. కెమిస్ట్రీలో పీహెచ్డీ చేశారు. ‘నేషనల్ కెమికల్ లేబొరేటరీ (ఎన్సీఎల్)’ వంటి ప్రతిష్టాత్మక సంస్థలో సైంటిస్టుగా పనిచేశారు. మౌలికంగా ఆమె ఓ టెక్నో క్రాట్. ఈ అనుభవంతో పారిశ్రామికరంగంలోకి ప్రవేశించారు. తెలుగునాట తొలి విమెన్ ఎంటర్ ప్రెన్యూర్‌గా పేరు తెచ్చుకున్నారు. ‘భాగ్యనగర్ లేబొరేటరీస్’ పేరుతో ఓ సంస్థను ఏర్పాటు చేసి చాలామంది మహిళా పారిశ్రామికవేత్తలకు స్పూర్తిగా నిలిచారు. ఈ అనుభవాలకు అక్షర రూపం ఇవ్వడానికి రైటర్‌గా మారారు. .
పారిశ్రామికవేత్తగా ఎంతో బిజీగా ఉన్నప్పటికీ రాయడానికి ఆమె టాప్ ప్రయారిటీ ఇచ్చారు. సహజంగా రైటర్స్ అందరికీ కాలేజీ డేస్ నుంచి రాయడం పట్ల ఆసక్తి ఉంటుంది. కానీ సుశీల యాభై ఏళ్లు దాటిన తరువాత రాయడం మొదలెట్టారు. ఎంత సీరియస్ విషయాన్నయినా చమత్కారంగా చెప్పడం ఆమె స్పెషాలిటీ. దాదాపుగా ప్రతి కథలోనూ హాస్యం తొంగి చూసేది. ఒకటని కాదు అనేక అంశాలపై ఆమె కథలు రాశారు, మెప్పించారు. ‘పెళ్లి పందిరి’ పేరుతో వచ్చిన కథా సంపుటిలో పేద బ్రాహ్మణులు తమ పిల్లల పెళ్లిళ్లు చేయడానికి ఎంతగా కష్టపడతారో అద్భుతంగా రాశారు సుశీల. ‘చిన్న పరిశ్రమలు – పెద్ద కథలు’ ఆమెకు బాగా పేరు తెచ్చిపెట్టాయి. ఓ చిన్న పరిశ్రమ పెట్టుకోవాలని ఎవరైనా డిసైడై, ఆర్థిక సాయం కోసం బ్యాంకుల దగ్గరకు వెళ్తే…ఏం జరుగుతుందో కళ్లకు కట్టినట్టు వివరించారు.
ఇంటింటికి చేరిన ‘ఇల్లేరమ్మ కథలు’
‘ఇల్లేరమ్మ కథలు’తో తెలుగునాట ప్రతి ఇల్లాలికి ఆమె దగ్గరయ్యారు. నిత్య జీవితంలో తనకు తారసపడ్డ, తాను చూసిన మనుషులను సందర్భానికి తగ్గట్టు కథల్లో పాత్రలుగా సుశీల ఉపయోగించుకున్నారు. ఈవెంట్ మేనేజ్మెంట్ అనేది బాగా వాడుకలోకి వచ్చిన మాట. అంతకంటేముందే ఈ టాపిక్‌పై సుశీల కథలు రాశారు. పెళ్లి సంబంధాలు కుదర్చడాన్ని మించిన ఈవెంట్ మేనేజ్మెంట్ లేదనేవారు. ఇలా ఎవరూ టచ్ చేయని సబ్జెక్ట్ల్ని తీసుకునేవారు సుశీల.
ఆడవారికి ఖర్చు పెట్టే హక్కేది!
స్త్రీ వాద సాహిత్యం పై సుశీల కు కొన్ని నిశ్చితాభిప్రాయాలున్నాయి. ఆడ, మగ సమానమే. అయినా ఆడవారే కాస్త ఎక్కువ అంటారు. మగవాళ్లతో పోలిస్తే ఆడవారే మానసికంగా చాలా స్ట్రాంగ్ అంటారామె. పాత రోజుల్లో ఆడవారు పైసా సంపాదించకపోయినా ఇంట్లో పెత్తనం చేసేవాళ్లంటారు ఆమె. ఇప్పుడు బాగా చదువుకుని వేలాది రూపాయలు సంపాదిస్తున్నా ఖర్చు పెట్టే హక్కు వారికి లేదంటారు. ఆడవారు ఈ మార్పును అర్థం చేసుకుని, అందుకు అనుగుణంగా జీవితాలను తీర్చిదిద్దుకోవాలంటారు. అమెరికా ప్రజల జీవితాలకు సంబంధించి సమాజంలో ఎన్నో అపోహలు ఉన్నాయి. ఇదే అంశం పై సుశీల రాసిన కథలు ఈ అపోహలను పటాపంచలు చేశాయి. అమెరికాలో కూడా కుటుంబాలను ప్రేమిస్తారని, వివాహ వ్యవస్థను గౌరవిస్తారని ఆమె తన కథల్లో వివరించారు.