- వచ్చే ఎన్నికల్లో ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తానని వెల్లడి
గోదావరిఖని, వెలుగు : రామగుండం మాజీ ఎమ్మెల్యే, ఆర్టీసీ మాజీ చైర్మన్ సోమారపు సత్యనారాయణ బీజేపీకి రాజీనామా చేశారు. రిజైన్ లెటర్‌ను శనివారం పార్టీ ఆఫీస్‌కు మెయిల్ ద్వారా పంపించానని గోదావరిఖనిలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన వెల్లడించారు. అభిమానులు, అనుచరుల అభిప్రాయం మేరకు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఇండిపెండెంట్ అభ్యర్థిగా బరిలో ఉంటానని, తాను పోటీ చేయడం కూడా ఇదే చివరిసారని తెలిపారు. ప్రధాని మోదీ గొప్ప వ్యక్తి అని, ఆయనతో కలిసి పనిచేయాలని భావించే బీజేపీలో చేరానని చెప్పారు. అయితే బీజేపీ, బీఆర్‌ఎస్ కలిసి పనిచేస్తున్నాయని ప్రజలు భావిస్తున్నారని, అందుకే ఏ ఉద్దేశంతో తాను బీజేపీలో చేరానో అది నెరవేరనందున పార్టీని వీడాల్సి వస్తోందని పేర్కొన్నారు.
బీజేపీకి తన రాజీనామా వ్యక్తిగతంగా బాధాకరం అయినప్పటికీ, రామగుండం పారిశ్రామిక ప్రాంత ప్రగతి కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. కాగా, రామగుండం నియోజకవర్గం నుంచి 2009లో ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా, 2014లో టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేగా గెలిచారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వంలో ఆర్టీసీ చైర్మన్‌గా రెండేండ్ల పాటు పనిచేశారు. 2018లో బీజేపీలో చేరగా, పెద్దపల్లి జిల్లా పార్టీ అధ్యక్షుడిగా కొనసాగారు. తాజాగా ఆ పార్టీకి రాజీనామా చేయడం చర్చనీయాంశంగా మారింది.