బీజేపీకి సోమారపు సత్యనారాయణ రాజీనామా


పెద్దపల్లిలో బీజేపీకి బిగ్ షాక్ తగిలింది.  మాజీ ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ ఆ పార్టీకి రాజీనామా చేశారు.  తన రాజీనామా లేఖను పార్టీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి పంపించారు.  స్వతంత్ర అభ్యర్థిగా బరిలో ఉంటేనే విజయం సాధిస్తామని ప్రజల అభిప్రాయాల మేరకు రాజీనామా చేసినట్లుగా సోమారపు తెలిపారు.  బీజేపీ నుండి బరిలో నిలిస్తే గెలిచే అవకాశాలు తక్కువగా ఉన్నాయని కార్యకర్తలు, ప్రజల అభిప్రాయం మీదకే ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో చివరి సారిగా ఎమ్మెల్యే గా పోటీ చేయాలని నిర్ణయించుకున్నానని వెల్లడించారు. ప్రజలు ఆశీర్వదిస్తే అవినీతి రహిత పాలన అందిస్తానని సోమారపు తెలిపారు. తనకు ప్రధాని  నరేంద్ర మోదీతో కలిసి పని చేయాలని కోరిక ఉండేదన్నారు. ఇక బీజేపీ, బీఆర్ఎస్ పార్టీ కలిసి పోయాయని ప్రచారం జోరుగా సాగుతోందని సోమారపు తెలిపారు.  

తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చిన సోమారపు సత్యనారాయణ 2004 అసెంబ్లీ ఎన్నికల్లో మంథని నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి కాంగ్రెస్‌ అభ్యర్థి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు చేతిలో ఓడిపోయారు.  2009 అసెంబ్లీ ఎన్నికల్లో రామగుండం నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి కాంగ్రెస్‌ అభ్యర్థి బాబర్‌ సలీంపాషాపై విజయం సాధించారు. ఆ  తరువాత కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. తెలంగాణ ఉద్యమం సమయంలో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి  టీఆర్ఎస్ లో  చేరారు.  2014లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో రామగుండం నుంచి టీఆర్ఎస్  అభ్యర్థిగాపోటీ చేసి గెలిచారు.  2016లో తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ చైర్మన్‌గా భాద్యతలు చేపట్టారు.  2018లో అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి అనంతరం బీజేపీలో చేరారు.  తాజాగా ఆ పార్టీకి కూడా రాజీనామా చేసిన ఆయన..రాబోయే ఎన్నికల్లో స్వతంత్య్ర అభ్యర్థిగా బరిలోకి దిగనున్నారు.   
.