- పర్మిషన్ ఇచ్చేందుకు వాటా అడుగుతున్న ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్
- వరద వస్తున్నా బోటింగ్ ప్రారంభానికి చర్యలు చేపట్టని ఆఫీసర్లు
నాగర్‌కర్నూల్, వెలుగు: నల్లమల అటవీ ప్రాంతంలో, కొండల మధ్య ప్రవహించే కృష్ణా నదిలో పడవ ప్రయాణం పర్యాటకులను ఎంతో ఆకట్టుకుంది. ఎత్తైన కొండల మధ్య, సహజసిద్ధంగా ఏర్పడిన ఇసుక తిన్నెలను దాటుకుంటూ సోమశిల నుంచి శ్రీశైలం వరకు సాగే పడవ ప్రయాణం కోసం ప్రకృతి ప్రేమికులు, పర్యాటకులు ఆతృతగా ఎదురుచూస్తుంటారు. కానీ ఈ సీజన్‌లో ఇప్పటివరకు రివర్ బోటింగ్ స్టార్ట్ చేయకపోవడంతో పర్యాటకులు నిరాశ చెందుతున్నారు.
70 కిలోమీటర్లు.. 6 గంటలు
టూరిజం డిపార్ట్‌మెంట్ ఆధ్వర్యంలో గతంలో కొల్లాపూర్ మండలం సోమశిలలో రూ. 30 కోట్లతో ఏసీ, నాన్ ఏసీ కాటేజీలు నిర్మించి లాంచీ ఏర్పాటు చేసి రివర్ బోటింగ్‌ను ప్రారంభించారు. సోమశిల నుంచి శ్రీశైలం వరకు లాంచీని నడిపేవారు. కృష్ణా నదిలో సుమారు 70 కిలోమీటర్ల మేర ఆరు గంటల పాటు ప్రయాణం సాగించాల్సి ఉంటుంది. 120 మంది ప్రయాణించేలా ఏసీ లాంచీని ఏర్పాటు చేసే టూరిజం శాఖ 70 మంది ఉన్నా టూర్‌ను స్టార్ట్ చేస్తుంది. ఈ టూర్ కోసం గతంలో ప్రత్యేక ప్యాకేజీలను సైతం ప్రకటించింది. హైదరాబాద్ నుంచి టూరిజం బస్‌లో సోమశిలకు తీసుకొచ్చి అక్కడి నుంచి లాంచీలో శ్రీశైలం తీసుకెళ్తారు. పాతాళగంగ వరకు చేరాక రోప్ వే ద్వారా పైకి ఎక్కి, శ్రీశైలంలో దర్శనం అనంతరం తిరిగి లాంచీలో సోమశిలకు తీసుకొస్తారు. ప్రయాణ సమయంలో టూరిజం డిపార్ట్‌మెంట్ ఆధ్వర్యంలోనే టిఫిన్, లంచ్ అరేంజ్ చేసేవారు. 2020 వరకు సోమశిల – శ్రీశైలం లాంచీ ప్రయాణం సాఫీగానే సాగినా ఆ తర్వాత కరోనా ఎఫెక్ట్‌తో వరుసగా మూడేళ్లు మూలకు పడింది. గతేడాది కృష్ణాలో ఆశించిన వరద లేకపోవడంతో ఏసీ లాంచీని లోకల్ ట్రిప్‌లకు పరిమితం చేశారు.
ప్రయాణంలో అనేక పర్యాటక ప్రాంతాలు
సోమశిల నుంచి శ్రీశైలం వరకు సాగే లాంచీ ప్రయాణంలో అనేక చూడదగిన ప్రదేశాలు ఉన్నారు. సోమశిల పరిసరాల్లో లలిత సోమేశ్వర ఆలయ సమదాయంతో పాటు సంగమేశ్వరం, సప్తనది సంగమ ప్రాంతాలు, అమరగిరి వంటి ప్రదేశాలు ఉన్నాయి. నదీ మార్గంలో చీమలతిప్ప, అంకాలమ్మ కోట, గుండ్లపెంట, అక్క మహాదేవి గుహలు కనిపిస్తాయి. కొండల నడుమ నదీ తీరంలో జీవించే మత్స్యకారుల గుడిసెలు కనిపిస్తాయి. శ్రీశైలంలోని పాతాళగంగ నుంచి దేవస్థానం వరకు రోప్‌వే ప్రయా ణం, నదిలో తిరుగు ప్రయాణం పర్యాటకులకు మధురానుభూతిని మిగిలిస్తుంది
వాటా ఇవ్వాలంటున్న ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్
కృష్ణా నదికి జూలైలోనే వరదలు ప్రారంభం అయ్యాయి. అయినప్పటికీ సోమశిల- – శ్రీశైలం లాంచీ ప్రయాణంపై టూరిజం డిపార్ట్‌మెంట్ ఆఫీసర్లు దృష్టి సారించడం లేదు. ఫారెస్ట్ ఏరియాలో ఎకో టూరిజం డెవలప్‌మెంట్‌పైన ఫోకస్ చేసిన రాష్ట్ర పర్యాటక శాఖ నల్లమల అడవిలోని దేవాలయాలు, ప్రాచీన కట్టడాలు, జలపాతాలు, నదీ తీరాలను కలుపుతూ టూరిజం సర్క్యూట్ ఏర్పాటుకు ప్లాన్ చేస్తోంది. అయితే నల్లమల అటవీ ప్రాంతం గుండా ప్రవహించే కృష్ణానదిలో పర్యాటకానికి ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్ పర్మిషన్ తప్పనిసరి అవుతోంది. దీంతో సోమశిల- శ్రీశైలం మధ్య లాంచీ టూరిజానికి అనుమతి ఇవ్వాలంటే లాభాల్లో వాటా ఇవ్వాలని ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్ అడుగుతున్నట్లు సమాచారం. మరోవైపు లాంచీ మూడేళ్లుగా నదిలో ఎక్కువ దూరం ప్రయాణించలేదు. ఇప్పుడు శ్రీశైలం వరకు నడపాలంటే కొన్ని రిపేర్లు చేయించాల్సి ఉంది. ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్ పర్మిషన్ ఇవ్వడంతో పాటు, రిపేర్లు పూర్తి అయితేనే గానీ లాంచీ కదిలే పరిస్థితులు లేవు.
మంత్రి దృష్టికి తీసుకెళ్తా
సోమశిల నుంచి శ్రీశైలం లాంచీ ప్రయాణం ప్రారంభించడంలో ఎదురవుతున్న సమస్యలను రాష్ట్ర టూరిజం మంత్రి జూపల్లి కృష్ణారావు దృష్టికి తీసుకువెళ్తా. అటవీ శాఖ అనుమతులు, లాభాల్లో వాటా గురించి అడుగుతున్న విషయంపై మంత్రితో మాట్లాడుతాం. సోమశిల – శ్రీశైలం రివర్ బోటింగ్, సోమశిల, అమరగిరి, సింగోటం, మల్లేశ్వరం సమీపంలో ఐల్యాండ్ డెవలప్‌మెంట్ తదితర అంశాలు, టూరిజం సర్క్యూట్ విస్తరణపై చర్యలు తీసుకుంటాం.– కల్వరాల నర్సింహ, జిల్లా టూరిజం ఆఫీసర్