- తాడోబా తరహాలో ఏర్పాటుకు నిర్ణయం
- ఎకో టూరిజం స్పాట్‌పేరిట రూట్‌మ్యాప్
- కోర్, బఫర్ ఏరియాల కేటాయింపు
- జంగిల్‌సఫారీ కోసం ఐదు వాహనాల ఏర్పాటుకు సన్నాహాలు
- పీపీపీ విధానంలో నిర్వహణ
నిర్మల్, వెలుగు:కవ్వాల్ టైగర్‌జోన్ పరిధిలోని కొంత ప్రాంతాన్ని టూరిజం స్పాట్‌గా తీర్చిదిద్దేందుకు అటవీ శాఖ కసరత్తు మొదలుపెట్టింది. మహారాష్ట్రలోని తాడోబా తరహాలో కవ్వాల్ టైగర్ జోన్‌లో ఎకో టూరిజం స్పాట్ ఏర్పాటుకు నిర్ణయించారు. మొత్తం ఫారెస్ట్ విస్తీర్ణంలో 20 శాతం మేర కోర్, బఫర్ ఏరియాల్లో టూరిజం స్పాట్ ఏర్పాటు చేయనున్నారు. అలాగే సందర్శకుల కోసం సఫారీ వాహనాలను సైతం అందుబాటులోకి తీసుకురానున్నారు.
కోర్, బఫర్ ఏరియాల కేటాయింపు
కవ్వాల్ ఫారెస్ట్ నిర్మల్, మంచిర్యాల జిల్లా పరిధిలో సుమారు 80 వేల హెక్టార్ల మేర విస్తరించి ఉంది. ఇందులో 20 శాతం కోర్, బఫర్ ఏరియాలను మాత్రమే టూరిజం స్పాట్‌కు కేటాయించారు.
కడెం నుంచి మొదలుకొని గంగాపూర్, ఎక్బాల్‌పూర్, ఉడుంపూర్, మైసంపేట, లక్ష్మీపూర్, కల్వకుంట్ల, అకోండపేట, దిమ్మదుర్తి తదితర ప్రాంతాల్లోని దట్టమైన అడవి తో పాటు పర్యాటక ప్రాంతాలు, గడ్డి మైదానాలు, వణ్యప్రాణుల సంచారం ఎక్కువగా ఉండే ప్రాంతాన్ని సెలెక్ట్ చేశారు.
ఈ అటవీ గ్రామాలన్నింటినీ కలుపుతూ ప్రత్యేక రూట్ మ్యాప్ తయారు చేసి టూరిస్టుల కోసం రోడ్డును కూడా నిర్మిస్తున్నారు. ఈ అడవుల్లో ఇప్పటికే గడ్డి మైదానాలను పెంచగా, వన్యప్రాణుల సంఖ్య కూడా విపరీతంగా పెరిగిపోయింది.
అడవిలోని ప్రకృతి సౌందర్యంతో పాటు నీటి కొలనులు, చిన్న చిన్న జలాపాతాలు, అటవీ జంతువులు టూరిస్టులను విపరీతంగా ఆకట్టుకోనున్నాయి. టూరిస్ట్‌లు అడవిలో పర్యటించే సమయంలో వారికి అన్ని రకాల సౌకర్యాలతో పాటు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా రక్షణ చర్యలు సైతం చేపట్టనున్నారు.
అందుబాటులోకి ఐదు సఫారీ వాహనాలు
సందర్శకులు కవ్వాల్ టైగర్ జోన్‌లో తిరిగేందుకు ప్రత్యేకంగా సఫారీ వాహనాలను సిద్ధం చేయనున్నారు. మొత్తం ఐదు వాహనాలను సమకూర్చేందుకు తెలంగాణ స్టేట్ ఫారెస్ట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ నిధులు కేటాయించింది.
కడెం మండలంలోని ఉడుంపూర్ వద్ద గల ‘ఐ లవ్ కవ్వాల్’ లోగో ప్రాంతం నుంచి మైసంపేట్, గంగాపూర్, లక్ష్మీపూర్ తదితర ప్రాంతాల మీదుగా సఫారీని ఏర్పాటు చేయనున్నారు. అలాగే ఎక్బాల్‌పూర్ వద్ద ప్రవేశ మార్గాన్ని ఏర్పాటు చేసేందుకు నిర్ణయించారు.
టూరిస్ట్‌ల వసతి కోసం దిమ్మదుర్ది వద్ద 12, జన్నారం వద్ద 10 చొప్పున కాటేజీలను నిర్మించాలని ప్రతిపాదించారు. టూరిజం ఏరియా కింద కడెం ప్రాజెక్టును సైతం కలిపారు. ప్రాజెక్ట్ సమీపంలోని సుమారు 550 మీటర్ల ఎత్తయిన గుట్టపైన ఇప్పటికే వాచ్ టవర్ నిర్మించారు.
టూరిస్టులను ఇక్కడి వరకు తీసుకెళ్లి కడెం ప్రాజెక్ట్ బ్యాక్ వాటర్‌తో పాటు దట్టమైన అడవిని చూపించనున్నారు. టూరిజం స్పాట్‌కు సంబంధించిన పనులు మరో నెల రోజుల్లో పూర్తి కానున్నాయని, ఆ తర్వాత సందర్శకులను అనుమతించనున్నట్లు అధికారులు చెబుతున్నారు.
ఈ రూట్ మ్యాప్‌కు అనుగుణంగా సఫారీ వాహనాలు తిరిగేందుకు ఇప్పటికే రోడ్ల నిర్మాణాలు సైతం పూర్తి చేశారు. కవ్వాల్ టైగర్ జోన్ విశేషాలు వివరించేందుకు ప్రత్యేకంగా గైడ్లను నియమించనున్నారు.
పీపీపీ పద్దతిలో నిర్వహణ
టైగర్ కన్జర్వేషన్ ప్లాన్ పేరిట ఏకో టూరిజం కోసం ఈ యాక్షన్ ప్లాన్‌ను సిద్ధం చేశారు. అయితే ఈ టూరిజం నిర్వహణ మొత్తాన్ని పీపీపీ (ప్రైవేట్ పబ్లిక్ పార్టిసిపేషన్) కింద చేపట్టనున్నారు.
టైగర్ జోన్ పరిధిలోని గ్రామాలకు చెందిన వీడీసీలు, అక్కడి యువకులు సఫారీ వాహనాల నిర్వహణ చేపట్టేలా చర్యలు తీసుకుంటున్నారు. వాహనాల కొనుగోలుకు ఫారెస్ట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ సహకరించనున్నప్పటికీ, స్థానిక యువకులకు లోన్లు ఇచ్చి వాహనాలను అప్పగించనున్నారు.
జంతువులు, వివిధ రకాల చెట్ల ప్రత్యేకతలను వివరించేందుకు స్థానిక యువకులనే గైడ్స్‌గా నియమించనున్నారు.