అమెరికన్ కస్టమర్లను నిలబెట్టుకోవడానికి ఇండియా వైపు చూస్తున్న చైనీస్ కంపెనీలు

అమెరికన్ కస్టమర్లను నిలబెట్టుకోవడానికి ఇండియా వైపు చూస్తున్న చైనీస్ కంపెనీలు
  • చైనీస్ కంపెనీలకు కమీషన్ ఇచ్చి, వారి కస్టమర్లకు గూడ్స్ సప్లయ్
  • యూఎస్ ప్రభుత్వం చైనాపై 145 శాతం టారిఫ్ వేయడమే కారణం

న్యూఢిల్లీ: చైనాపై యూఎస్ ప్రభుత్వం 145 శాతం టారిఫ్ వేయడంతో తీవ్రంగా నష్టపోయిన  కొన్ని చైనీస్ కంపెనీలు ఇండియా వైపు చూస్తున్నాయి. తమ అమెరికన్ కస్టమర్లను నిలబెట్టుకోవడానికి,  ట్రేడ్ వార్‌‌‌‌ నుంచి పెద్దగా నష్టపోకుండా ఉండడానికి  భారతీయ ఎగుమతిదారులను  సంప్రదిస్తున్నాయి.  చైనీస్ కంపెనీలు తమ యూఎస్ కస్టమర్లకు వస్తువులను సరఫరా చేయడానికి  అనేక భారతీయ సంస్థలను  సంప్రదించాయని ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఎక్స్‌‌‌‌పోర్ట్ ఆర్గనైజేషన్స్ డైరెక్టర్ జనరల్ అజయ్ సహాయ్ పేర్కొన్నారు.

చైనీస్ వ్యాపారాలకు కమీషన్ చెల్లించి, వీరి కస్టమర్లకు గూడ్స్‌‌‌‌ను భారతీయ సంస్థలు సరఫరా చేయనున్నాయని ఆయన ఒక ఇంటర్వ్యూలో తెలిపారు.  చైనా నుంచి యూఎస్‌‌‌‌కు చేసే ఎగుమతులలో ఎక్కువ భాగం 145 శాతం సుంకాలతో దెబ్బతిన్నాయి. దీనికి విరుద్ధంగా,  భారతదేశం నుంచి యూఎస్‌‌‌‌కు రవాణా అయ్యే  వస్తువులపై ప్రస్తుతం 10 శాతం సుంకం పడుతోంది.    ట్రంప్ తన రెసిప్రోకల్ సుంకాలను అమలు చేస్తే జులైలో 26 శాతానికి పెరగొచ్చు. 

ట్రంప్ మొదటి టర్మ్‌‌‌‌లోనూ అంతే
 ట్రంప్ మొదటి టర్మ్‌‌‌‌లో కూడా ఇలాంటి పరిస్థితులే కనిపించాయి. అప్పుడు సుంకాల వలన నష్టపోయిన చైనీస్ ఎగుమతిదారులు యూఎస్‌‌‌‌కు గూడ్స్‌‌‌‌కు పంపడానికి  ఆగ్నేయ ఆసియా దేశాల చుట్టూ  తిరిగారు.  వియత్నాం‌‌‌‌లో ఫ్యాక్టరీలను స్థాపించడం లేదా థాయ్‌‌‌‌లాండ్ వంటి దేశాల నుంచి వస్తువులను రవాణా చేయడం వంటివి చేశారు.  ఈసారి, ట్రంప్ వియత్నాం వంటి దేశాలపై 46 శాతం రెసిప్రోకల్ సుంకాలను విధించింది. దీంతో ఇండియాకు చైనీస్ కంపెనీల నుంచి ఎక్కువ ఆర్డర్లు వస్తాయని అంచనా. అయితే, ఆగ్నేయ ఆసియా దేశాలకు  భిన్నంగా, భారత ప్రభుత్వం చైనీస్ పెట్టుబడులపై ఆంక్షలను కొనసాగిస్తోంది.

ఫలితంగా చైనీస్ కంపెనీలు  దేశంలో కార్యకలాపాలను స్థాపించడం లేదా భారతదేశం ద్వారా యూఎస్‌‌‌‌కు వస్తువులను రవాణా చేయడం కష్టంగా మారింది. భారతీయ సంస్థలను చైనీస్ సంస్థల బ్రాండ్‌‌‌‌ల కింద లేదా భారతీయ సంస్థలతో సహ-బ్రాండెడ్‌‌‌‌గా యూఎస్ కంపెనీలకు వస్తువులను సరఫరా చేయాలని గంగ్జౌ (చైనా) లో జరుగుతున్న ట్రేడ్ ఫెయిర్‌‌లో భారతీయ సంస్థలను సంప్రదించారని సహాయ్ తెలిపారు.

హ్యాండ్ టూల్స్, ఎలక్ట్రానిక్స్,  హోమ్ అప్లయెన్సెస్ వంటి ప్రొడక్ట్‌‌‌‌ల ఎగుమతి కోసం ఎక్కువగా ఆరా తీశారని   అన్నారు. కొంతమంది యూఎస్ కస్టమర్లు నేరుగా భారతీయ సరఫరాదారులతో చర్చలు ప్రారంభించవచ్చని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు.   జలంధర్ బేస్డ్ కంపెనీ ఓయ్‌‌‌‌కే టూల్స్, డ్రాప్ ఫోర్జ్ హామర్స్,  కోల్డ్ స్టాంప్ మెషిన్ వంటి హ్యాండ్ టూల్స్‌‌‌‌ను తయారు చేస్తోంది.  ఇది యూఎస్ మార్కెట్‌‌‌‌కు సరఫరా చేయడానికి చైనాలోని అమెరికన్ సంస్థలు,  చైనీస్ కంపెనీలతో చర్చలు జరుపుతోంది. “సుమారు నాలుగు నుంచి ఐదు కంపెనీలు మమ్మల్ని సంప్రదించాయి,” అని ఓయ్‌‌‌‌కే టూల్స్ ఎక్స్‌‌‌‌పోర్ట్ ఆఫీసర్ సిద్ధాంత్ అగర్వాల్ తెలిపారు. యూఎస్‌‌‌‌, చైనా మధ్య ట్రేడ్ డీల్ కుదురుతున్న టైమ్‌‌‌‌లో భారతీయ కంపెనీలకు ఆర్డర్లు పెరగడం విశేషం.