దళితబంధులో బర్రెలెప్పుడిస్తరు సార్​?

ఖమ్మం, వెలుగు:దళితబంధు పథకాన్ని పైలట్ ప్రాజెక్టుగా అమలు చేస్తున్న చింతకాని మండలంలో డెయిరీ యూనిట్లు సెలక్ట్​ చేసుకున్న లబ్ధిదారులకు పూర్తి స్థాయిలో బర్రెలు అందకపోవడంతో కొందరు కలెక్టర్​వీపీ గౌతమ్​ కు ఫిర్యాదు చేశారు. రామకృష్ణాపురం, అనంతసాగర్​ గ్రామాలకు చెందిన లబ్ధిదారులు సోమవారం జడ్పీ హాల్ లో జరిగిన గ్రీవెన్స్​ కు వచ్చారు. బర్రెల కోసం నాలుగైదు నెలల క్రితమే భూమి కౌలు తీసుకుని గడ్డి పెంచామని, ఏపుగా పెరిగి కంకులు కూడా వేస్తోందంటూ ఊరి నుంచి తీసుకువచ్చిన గడ్డి కట్టను చూపించారు. దీంతో గడ్డి ఎందుకు తీసుకువచ్చారంటూ ఆయన లబ్ధిదారులను మందలించారు. మరో 15 రోజుల్లో బర్రెలు వస్తాయని నచ్చజెప్పారు. ఈ సందర్భంగా డిస్ట్రిక్ట్ వెటర్నరీ అండ్​యానిమల్ హజ్బెండరీ ఆఫీసర్​ వేణు మనోహర్ పై కలెక్టర్​సీరియస్​అయ్యారు. దేశవ్యాప్తంగా పశువులకు వస్తున్న లంపీ స్కిన్​వ్యాధి కారణంగా డెయిరీ యూనిట్ల గ్రౌండింగ్ ఆలస్యమవుతుందన్న విషయంపై లబ్ధిదారులకు అవగాహన కల్పించలేదా అని ప్రశ్నించారు. ఆ విషయం తెలియక వారు ఇక్కడి వరకు వస్తుంటే, మీరెందుకు చెప్పలేదని మండిపడ్డారు. వెంటనే డెయిరీ యూనిట్లు సెలక్ట్ చేసుకున్న వారితో మీటింగ్ పెట్టి అందరికీ తెలియజేయాలని సూచించారు. మరోవైపు తమిళనాడు, హర్యానా, గుజరాత్ కు చెందిన బర్రెలను ఇప్పటికే తెచ్చుకున్న లబ్ధిదారులు, ఇక్కడి వాతావరణానికి అవి అడ్జస్ట్ కాలేకపోవడం వల్ల పాల దిగుబడి తగ్గిందని, అందువల్ల తమకు ఆంధ్రప్రదేశ్ లోని భీమవరం, ఇతర ప్రాంతాల నుంచి బర్రెలు కొని తెచ్చుకునేలా అనుమతి ఇవ్వాలని కలెక్టర్​కు వినతిపత్రం ఇచ్చారు.

ఖాతాల్లో డబ్బులు జమ చేశాం

చింతకాని మండలంలో 3462 మంది లబ్ధిదారుల అకౌంట్లలో రూ.9.90 లక్షల చొప్పున జమ చేశామని ఎస్సీ కార్పొరేషన్​ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్​ఏలూరి శ్రీనివాసరావు తెలిపారు. సోమవారం 'వెలుగు'లో పబ్లిష్​అయిన ‘షాపులు, షెడ్లు రెడీ, దళిత బంధు పైసలేవి? ’ అనే వార్తకు వివరణ ఇచ్చారు. 3462 లబ్ధిదారులకు గాను1566 యూనిట్లు పూర్తిగా, 1896 యూనిట్లు పాక్షికంగా గ్రౌండింగ్ అయ్యాయని చెప్పారు. అంతేగాకుండా ప్రతి నియోజకవర్గంలో100 మంది చొప్పున ఎంపిక చేసిన 483 మంది లబ్ధిదారుల్లో అందరికీ రూ.9.90 లక్షల చొప్పున జమ చేశామన్నారు. ఇందులో 428 యూనిట్లు పూర్తిగా, 55 యూనిట్లు పాక్షికంగా గ్రౌండింగ్ అయ్యాయన్నారు.

15 రోజుల్లో బర్రెలు ఇస్తామన్నరు

ఐదు నెలల షెడ్డు వేసి, గడ్డి పెంచి బర్రెల కోసం చూస్తున్నాం. ఎన్నిసార్లు అడిగినా కొద్ది రోజులు ఆగండి అని ఆఫీసర్లు చెబుతున్నారు. అందుకే ఎన్ని రోజులో తెలుసుకునేందుకు వచ్చినం. 15 రోజుల్లో వస్తున్నయని చెప్తున్నరు.  
-  ఉపేందర్, రామకృష్ణాపురం, చింతకాని