జగిత్యాల చైర్​పర్సన్​ పీఠం కోసం తెర వెనుక రాజకీయం

జగిత్యాల చైర్​పర్సన్​ పీఠం కోసం తెర వెనుక రాజకీయం

ప్రైవేట్ ఫంక్షన్ హాల్ లో బీఆర్ఎస్ కౌన్సిలర్ల మీటింగ్
పార్టీ వర్గాల్లో హీట్ పెంచుతున్న అవిశ్వాసం

జగిత్యాల, వెలుగు :  జగిత్యాల మున్సిపల్ చైర్​పర్సన్ భోగ శ్రావణిపై అవిశ్వాసం పెట్టేందుకు కొందరు కౌన్సిల్ సభ్యులు చేసిన సంతకాల సేకరణ జగిత్యాల బీఆర్ఎస్ వర్గాల్లో పోటికల్ హీట్ పెంచింది. ఆదివారం ధరూర్ క్యాంప్ సమీపంలోగల ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్లో కొందరు కౌన్సిల్ సభ్యులు దావత్ ఏర్పాటు చేయడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఈ సమావేశం లో చైర్​పర్సన్ పీఠం కోసం బేర సరాలు కొనసాగినట్లు సమాచారం.

ఫంక్షన్​ హాల్​లో రహస్య సమావేశం..

బల్దియా కౌన్సిల్ సభ్యులు ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్ లో ఆదివారం ఏర్పాటు చేసిన రహస్య సమావేశంలో తర్వాతి చైర్ పర్సన్ ఎవరనే విషయం చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. గతంలో జగిత్యాల బల్దియా పీఠం బీసీ మహిళలకు కేటాయించడంతో కాపు సమాజికవర్గానికి చెందిన ఇద్దరు కౌన్సిలర్లు పదవి ఆశించారు. అయితే అనూహ్యంగా పద్మశాలి సామాజికవర్గానికి చెందిన భోగ శ్రావణి పీఠం దక్కించుకోవడంతో వారు భంగపడ్డారు. ఇపుడు అవిశ్వాసం అంశం తెర మీదకు రావడంతో ఎలాగైనా ఈసారి పీఠం దక్కించుకోవాలని పావులు కదుపుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. కానీ అధిష్టానం మాత్రం పద్మశాలి సామాజికవర్గానికి చెందిన బిల్డర్ గా పేరున్న మరో కౌన్సిలర్ కు అవకాశం ఇచ్చే అలోచనలో ఉన్నట్లు కౌన్సిల్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అలాగే స్టేట్ బీఆర్ఎస్ లీడర్లతో టచ్ లో ఉన్న ఓ కౌన్సిలర్(బడా కాంట్రాక్టర్) కూడా చైర్ పర్సన్ ప్రయత్నం మొదలు పెట్టి కౌన్సిలర్ల మద్దతు కోరుతున్నట్లు తెలుస్తోంది.

ఆధిష్టానం ఎటు వైపు?

ప్రస్తుతం చైర్ పర్సన్ భోగ శ్రావణిపై ఆవిశ్వాసం పెట్టాలని కౌన్సిల్ సభ్యులు సంతకాలు చేసి ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కు అప్పగించినట్లు తెలుస్తోంది. కౌన్సిల్ సభ్యుల అభిప్రాయం తీసుకోకుండా శ్రావణి ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటోందని కొందరు కౌన్సిల్ సభ్యులు చెబుతుంటే.. మరికొందరు చైర్ పర్సన్ అంటే గిట్టని వారు అధిష్టానానికి అసత్య ఆరోపణలు చెబుతున్నారని, చైర్ పర్సన్ పీఠం కోసం పార్టీ పరువును తీస్తున్నారనే విమర్శలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఈక్రమంలో వచ్చే అసెంబ్లీ ఎన్నికలను దృష్టి లో పెట్టుకుని పార్టీని గాడిలో పెట్టుకోవాల్సిన హైకమాండ్​ అవిశ్వాసానికి మొగ్గు చూపుతుందో లేదోనని పలువురు చర్చించుకుంటున్నారు.

జనవరి 27కు మూడేళ్లు నిండిన పదవీ కాలం..

మున్సిపల్ యాక్ట్ 2019 ప్రకారం చైర్ పర్సన్ గా కొనసాగుతున్న సభ్యులపై అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టాలంటే కనీసం మూడేళ్లు పూర్తి చేసుకోవాలనే నిబంధనలు ఉన్నాయి. గతేడాది మినిస్టర్ కేటీఆర్ మూడేళ్ల పదవీ కాలాన్ని నాలుగేళ్లు పొడిగిస్తూ చట్టాన్ని సవరణ చేసి అసెంబ్లీలో ఆమోందించారు. ప్రస్తుతం మున్సిపల్ చట్ట సవరణ బిల్లుకు గవర్నర్ అమోదం తెలపకపోవడంతో అది పెండింగ్ లో ఉంది. జగిత్యాల బల్దియా చైర్ పర్సన్ పదవీ కాలం జనవరి 27తో మూడేళ్లు పూర్తి చేసుకుంటుంది. దీంతో అవిశ్వాసంపై రోజురోజుకు చర్చ తీవ్రమవుతోంది.