- సింగరేణిలో ఆన్ ఫిట్ దందాలో కొందరు ఉద్యోగుల బదిలీ
- యాజమాన్యం ఉత్తర్వులిచ్చి నెల దాటినా రిలీవ్ కావట్లేదు
- ఉన్న చోటే ఉండేందుకు పెద్ద ఎత్తున పైరవీలు చేస్తున్నారనే ప్రచారం
- మెడికల్ బోర్డు దందాపై ఏసీబీ విచారణ చేసినా చర్యల్లేవ్
- ప్రత్యేక విజిలెన్స్ఎంక్వైరీ తోనూ ఎలాంటి ఫలితం లేదు
- ఆగని మెడికల్ బోర్డు దందాపై అంతటా జోరుగా చర్చ
భద్రాద్రి కొత్తగూడెం, వెలుగు: సింగరేణి లో కార్మికుల ఇన్వాలిడేషన్లోని మెడికల్‌బోర్డు దందాలో వైద్య శాఖ ఉద్యోగులు ఉన్నట్టు గుర్తించి.. ట్రాన్స్ఫర్స్చేస్తూ ఉత్తర్వులు జారీ చేసినా కుర్చీ వదట్లేదు. వేటుపడిన ఉద్యోగులు తమకు డోకా లేదన్నట్టుగా పైరవీలు చేసుకుంటున్నారు. నెల దాటినా వారు రిలీవ్కాకపోవడంపై జోరుగా చర్చ జరుగుతోంది. సింగరేణిలోని కార్మికులు అనారోగ్య కారణాలతో కారుణ్య నియామకాల్లో భాగంగా అన్ఫిట్కోసం మెడికల్‌బోర్డుకు దరఖాస్తు చేసుకుంటారు. అర్హులను గుర్తించి అన్ఫిట్సర్టిఫికెట్ ఇస్తే వారి పిల్లలకు డిపెండెంట్కింద జాబ్ వస్తుంది.
అదే అదునుగా కొందరు ఉద్యోగులతో పాటు రిటైర్డ్వర్కర్స్, పలువురు కార్మిక సంఘాల నేతలు దళారులుగా అవతారమెత్తారు. అన్ఫిట్చేయించేందుకు ఒక్కో కార్మికుడి వద్ద రూ. 6 లక్షల నుంచి రూ. 10లక్షల వరకు వసూలు చేస్తున్నారు. దళారులను ఆశ్రయిస్తే చాలు.. అర్హుల కన్నా అనర్హులకే అన్ఫిట్సర్టిఫికెట్ ఇవ్వడం కామన్‌గా మారింది. దీంతో దందాను నియం త్రించేందుకు యాజమాన్యం ఏసీబీతోనూ ఎంక్వైరీ చేయించినా పెద్దగా ఫలితం లేకపోయింది.
నెల రోజులు దాటినా జాయినింగ్ కాలే
అన్ ఫిట్ సర్టిఫికెట్ల దందాపై కొంత కాలంగా విజిలెన్స్అధికారులు కొత్తగూడెంలోని సింగరేణి మెయిన్హాస్పిటల్ తో పాటు సింగరేణి వ్యాప్తంగా పలు ఏరియా హాస్పిటల్స్ లో విచారణ చేపట్టారు. దీంతో మెయిన్హాస్పిటల్ లో వైద్య శాఖ ఉద్యోగితో పాటు ఆర్జీ–1, మందమర్రి ఏరియాల్లో మరో ముగ్గురు, మెయిన్హాస్పిటల్లో వార్డు బాయ్ కి దందాలో భాగస్వాములుగా ఉన్నట్టు విజిలెన్స్ఆఫీసర్లు గుర్తించారు. గత నెల 19న వారిని ట్రాన్స్ఫర్చేస్తూ యాజమాన్యం ఉత్తర్వులు జారీ చేసింది. ఈనెల 6 లోపు రిలీవ్కావాలి. మరుసటి రోజు ట్రాన్స్ఫర్అయిన ప్రాంతానికి వెళ్లి జాయిన్కావాల్సి ఉంది. కానీ.. నెల రోజులు దాటినా రిలీవ్కాకపోవడం, ఎక్కడున్న వారు అక్కడే డ్యూటీలు చేస్తుండడం చర్చనీయాంశమైంది. పనిచేస్తున్న చోటు నుంచి కదలకుండా ఉండేందుకు పెద్ద ఎత్తున పైరవీలు చేస్తున్నారనే ప్రచారం సాగుతోంది. దీంతో యాజమాన్యం ఉత్తర్వులకే దిక్కులేకుండా పోయిందని పలువురు కార్మికులు విమర్శిస్తున్నారు.
ఎంక్వైరీల కారణంగా..
సింగరేణి వైద్యశాఖలోని కొందరిని గత నెల 19న అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ చేశామని సింగరేణి చీఫ్‌మెడికల్ ఆఫీసర్ సుజాత చెప్పారు. కొన్ని ఎంక్వైరీల కారణంగా రిలీవ్ కాలేదని పేర్కొన్నారు. విజిలెన్స్ఎంక్వైరీ పైన అడగగా ఆమె సమాధానం దాట వేశారు. విజిలెన్స్ జీఎం వివరణ కోసం ప్రయత్నించగా ఆయన స్పందించలేదు.
ప్రత్యేక విజిలెన్స్ విభాగం ఉన్నా కానీ..
మెడికల్‌బోర్డు దందాపై గతంలో ఏసీబీ రెండు నుంచి మూడు నెలల పాటు విచారణ చేసి ఉన్నతాధికారులకు నివేదికలు ఇచ్చింది. అయినా ఇప్పటివరకూ ఎలాంటి చర్యలు లేకపోవడంతో దళారుల దందాకు అడ్డూ అదుపు లేకుండాపోయింది. మరోవైపు సింగరేణిలో ప్రత్యేకంగా విజిలెన్స్‌విభాగం ఉంది. దీనికి జీఎంతో పాటు ప్రత్యేకంగా సిబ్బంది ఉన్నారు. కానీ ఏం లాభం లేదు. మెడికల్దందాకు పాల్పడే ఉద్యోగులపై పూర్తిస్థాయి ఆధారాలను వెల్లడించకపోవడంపై ఆంతర్యమేమిటో వారికే తెలియాల్సి ఉందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మెడికల్‌బోర్డులో దందాలో కొత్తగూడెంలోని మెయిన్హాస్పిటల్లో కీలకమైన వ్యక్తులున్నారనే ఆరోపణలు ఉన్నాయి.