పంటల మద్దతు ధరలపై సముచిత విధానం రావాలి

పంటల మద్దతు ధరలపై సముచిత విధానం రావాలి

 కొన్ని రైతు సంఘాలు తమ పంటలకు కనీస మద్దతు ధర విషయంలో ‘లీగల్ గ్యారంటీ’ సంపాదించుకునేందుకు ఆందోళనకు దిగాయి.  లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో  కేంద్ర ప్రభుత్వం మెడ వంచవచ్చునని అవి భావిస్తున్నాయి. కానీ, వాటి బెదిరింపులకు ప్రభుత్వం ఈసారి లొంగేటట్లు కనిపించడం లేదు. కేంద్ర ప్రభుత్వం 22 పంటలకు కనీస మద్దతు ధర ప్రకటించింది. వాటిలో చాలా పంటలకు మద్దతు ధర కాగితాలకే పరిమితమైంది. డిమాండ్, సరఫరా పరిస్థితులను బట్టే పంటల ధర నిర్ణయమవుతోంది. వరి, గోధుమల విషయంలో మాత్రమే మద్దతు ధర నెరవేరుతోంది. 

ఆహార ధాన్యాలను ప్రభుత్వం కొనుగోలు చేస్తూండడం వల్లనే మద్దతు ధర అంశం తరచు తెరపైకి వస్తోంది. రైతులు ఆశించినంతగా ప్రభుత్వం కొనుగోలు చేయలేకపోతే మద్దతు ధర ప్రకటించినా దానికి విలువ ఉండదు. మద్దతు ధర ఎక్కువగా ఉన్న పంటల వైపు రైతులు మరలుతున్నట్లు సూచించడం లేదు. ఉదాహరణకు, 2014-–15 నుంచి 2023–-24 మధ్య కాలంలో మద్దతు ధరలో వరి  5.4 శాతం, గోధుమలు 5.1 శాతం, సజ్జలు 8 శాతం వార్షిక పెరుగుదలను చూశాయి. మద్దతు ధర ఎక్కువగా ఉంది కనుక రైతులు మామూలుగా అయితే సజ్జల వైపు మరలాలి. కానీ, 2011–-12 నుంచి 2021-–22 మధ్య కాలంలో సజ్జల సాగు విస్తీర్ణం 24 శాతం తగ్గితే వరి, గోధుమల విస్తీర్ణం ఓ మోస్తరు పెరిగింది. మిగిలిన చిరు ధాన్యాల విస్తీర్ణం కూడా తగ్గింది.  కొనుగోలుకు భరోసా ఉంటే,  ధరల హెచ్చు తగ్గులను దృష్టిలో పెట్టుకుని  రైతులు ప్రధాన పంటల సాగుకే మొగ్గు చూపుతున్నారని అర్థమవుతోంది. 

పంజాబ్ ధోరణి ప్రమాదకరం

రైతుల డిమాండ్ల మేరకు వరాలిస్తూపోవడం, ఎప్పటికప్పుడు ఎరువులు వంటివాటిపై సబ్సిడీలను పెంచుతూ రావడం వల్ల పంజాబ్ దివాలా తీసిన స్థితికి చేరుకుంది. సబ్సిడీలు తక్కువ మోతాదులో ఉంటే ఉద్దీపన ఔషధంలా పనిచేసి పనితీరును (ప్రస్తుత సందర్భంలో ఉత్పాదకతను) మెరుగుపరుస్తాయి. హెచ్చు మోతాదుల్లో ఇస్తే రైతులు వాటికి అలవాటుపడే  ప్రమాదం ఉంది. వ్యవసాయానికి ఉచిత విద్యుత్ అనడంతో  రైతులు నీరు ఎక్కువ అవసరమయ్యే పంటల సాగుకు వెనుకాడడం లేదు. నిజానికి, స్వల్పకాలిక లాభాల కోసం, దీర్ఘకాలిక ప్రయోజనాలను పణంగా పెట్టి  భూగర్భ జలాలను అపరిమితంగా తోడేస్తున్నారని చెప్పాలి. పంజాబ్ ప్రభుత్వం అప్పుల్లో కూరుకుపోవడానికి వ్యవసాయానికి ఇస్తున్న ఉచిత విద్యుత్తే కారణమని ఆర్థిక నిపుణులు మొత్తుకుంటున్నారు. జనాకర్షక పథకాలలో ఇతర రాష్ట్రాలు కూడా పంజాబ్ బాట పడితే అవి రుణాల ఊబిలో కూరిపోక తప్పదు.  అప్పులు- స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ) మధ్య నిష్పత్తి పంజాబ్ విషయంలో 48 శాతంగా ఉంది. దీన్ని 20 శాతానికి తగ్గించాలని సవరించిన ఫినాన్షియల్ బాధ్యత- రుణ నిర్వహణ విధానం నిర్దేశిస్తోంది. కానీ, పంజాబ్ విషయంలో అది 55 శాతానికి పెరిగే అవకాశం ఉందని అంచనాలు సూచిస్తున్నాయి. అన్ని రాష్ట్రాలకన్నా అత్యధికంగా అప్పుల్లో ఉన్నది పంజాబే. ఒక్క గుజరాత్ లో మాత్రమే అది 20 శాతానికి తగ్గింది. అది 2027–-28 నాటికి 18 శాతానికి చేరుకోవచ్చని భావిస్తున్నారు.   ఒకప్పుడు అత్యధిక తలసరి ఆదాయంలో పంజాబ్ నంబర్ వన్ గా ఉండేది. ఇపుడు సగటు వద్ద ఊగిసలాడుతోంది. 
  
భూముల ధరల పెరుగుదల, ఆహార భద్రత

వ్యవసాయం మీద ఆదాయం అధికంగా ఉండడంతో సహజంగానే పంజాబ్ లో భూముల రేట్లు పెరిగాయి. మారుమూల ప్రాంతాల్లోనే ఎకరం కోటి రూపాయలదాకా ఉంది. మొహాలి చుట్టుపక్కలైతే ఎకరం ఐదు కోట్ల రూపాయలు పలుకుతోంది. ఈ భూముల ధరలకు భయపడి పంజాబ్ కు పరిశ్రమలు రావడం మానేశాయి. పరిశ్రమలకు ఇస్తున్న సబ్సిడీలు వ్యవసాయ సబ్సిడీలంత పెద్ద మొత్తాలలో లేవు.  వివిధ పరిశ్రమలకు వాటి అమ్మకాల్లో లభిస్తున్న నికర లాభం 1.6 శాతం నుంచి 9.4 శాతం వరకు ఉంది.  ప్రస్తుతం పంజాబ్  రైతులు ఆహార ధాన్యాల అమ్మకాల్లో తమకొచ్చే లాభం 33.33 శాతంగా ఉండాలని డిమాండ్ చేస్తున్నారు.  ఇది ఆహార భద్రతతో కూడా ముడిపడిన అంశం కనుక చాలా పార్శ్వాల నుంచి దీన్ని చూడాల్సి ఉంటుంది. సుమారు 80 కోట్ల మందికి ఉచితంగానో లేదా సబ్సిడీ ధరలకో ఆహార ధాన్యాలను సరఫరా చేయడాన్ని లక్ష్యంగా పెట్టుకున్న ఏ ప్రభుత్వమైనా ఈ విషయంలో ఆచితూచి అడుగులు వేయాలి.

అధిక రాబడి కోరుకుంటున్న రైతులు

వ్యవసాయ ఆదాయం కన్నా మిగిలిన రంగాల్లో వచ్చే ఆదాయం పెరుగుతోంది. ఆయా రంగాల్లోనివారు ముఖ్యంగా ఇన్ఫోటెక్ రంగం వినిమయ ధోరణులు రైతులను అధిక రాబడులకు పురికొల్పుతున్నాయి. మిగిలిన వర్గాలవారి ఆదాయాలతో వారు తమ ఆదాయాలను పోల్చి చూసుకుంటున్నారు. దానికితోడు, భారతదేశంలో భూ ఉత్పాదకత ప్రపంచంలో అత్యుత్తమంగా ఉన్నవాటితో పోల్చదగినదిగా లేదు. దేశంలో కూడా హరిత విప్లవాన్ని చవిచూసిన ప్రాంతాలు, మిగిలిన ప్రాంతాల రైతుల మధ్య అభిలాషలలో తేడాలున్నాయి. హరిత విప్లవ ప్రాంతాల రైతులు వ్యవసాయం నుంచి అధిక రాబడులు కోరుకుంటున్నారు. పంజాబ్, హర్యానా రైతులు వరి, గోధుమల మద్దతు ధర అమ్మకాలకు యాభై ఏళ్ళకు పైగా అలవాటుపడ్డారు. మార్కెట్ ఆధారిత మధ్యవర్తులు రైతుల నుంచి ధాన్యాలను కొంటే, సెంట్రల్ పూల్ కోసం ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా
 (ఎఫ్​సీఐ) వారి నుంచి వాటిని కొంటున్నది. 

చిరుధాన్యాల సాగుకు ఒడిశా ప్రోత్సాహం

మధ్యప్రదేశ్ మద్దతు ధరకు గోధుమలు కొంటే,  తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, చత్తీస్ గఢ్ వంటి రాష్ట్రాలు వరిని కొనుగోలు చేస్తున్నాయి. ప్రభుత్వ ఆహార పంపిణీ వ్యయాలు కొంత తగ్గాయి. ఆహార భద్రత నుంచి పౌష్టికాహార లభ్యత వైపు అడుగులు వేసేందుకు ఒడిశా చిరుధాన్యాల సాగును ప్రోత్సహిస్తూ వస్తోంది. వాటిని కొనుగోలు చేయడమే కాక పంపిణీ చేస్తోంది. గడచిన నిరసన ప్రదర్శనల సందర్భంలో పోలీసులు పెట్టిన కేసులను ఉపసంహరించుకోవడం,  స్వాధీనం చేసుకున్న ట్రాక్టర్లను తిరిగి రైతులకు అప్పగించడం వంటి అంశాలకు మాత్రమే రైతుల ప్రతినిధులకు, ప్రభుత్వానికి మధ్య చర్చలు పరిమితం కావాలి. ఓట్లకు ప్రలోభపడి ప్రభుత్వం శక్తిమంతమైన పంజాబ్ రైతుల సంఘాల ఒత్తిడులకు లొంగిపోకూడదు. పారిశ్రామిక, సేవా రంగాల్లో ఎక్కువ ఉద్యోగాలు సృష్టించడం ద్వారా వ్యవసాయంపై ఆధారపడుతున్నవారి సంఖ్యను తగ్గించుకొనే దిశగా అడుగులు వేయాలి.  మన దేశంలో సగం జనాభా వ్యవసాయంపైనే ఆధారపడుతూ జీడీపీలో కేవలం 14 శాతం వాటాకి దోహదపడుతున్నారు. కనుక, ఆహార ధాన్యాలతోపాటు పండ్లు, కూరగాయలు, పూలు, తోటల పెంపకంలాంటి వాటిని ప్రోత్సహిస్తూ రైతుల ఆదాయాలు పెరిగేటట్లు చూడాలి.

మద్దతు ధర మధ్యేమార్గంగా ఉండాలి

ఉల్లిపాయలు, ఆలుగడ్డలతో సహా కొన్నింటి ఎగుమతులను ప్రభుత్వం నిషేధిస్తూ వస్తోంది. స్థానికంగా వాటి ధరలు పెరిగిపోవచ్చనే (భయం) అంచనాతో అది అలా చేస్తోంది. అది రైతుల రాబడికి గండి కొట్టడమేనని మార్కెట్ ఆధారిత ఆర్థికవ్యవస్థకు అనుకూలురైనవారు వాదించడం సబబుగానే తోస్తుంది.  మద్దతు ధర పూర్తిగా జోక్యం చేసుకునేదిగానో  లేదా అసలు జోక్యం చేసుకోనదిగానో కాకుండా మధ్యేమార్గాన్ని అనుసరించేదిగా ఉండాలి. వివిధ ప్రాంతాలలోని ఆహారపు అలవాట్లు, ఆహార ధాన్యాల లభ్యతను పరిశీలనలోకి తీసుకుని దాన్ని రూపొందించుకోవాలి. మద్దతు ధర ఉత్పత్తి వ్యయంపైన కొంత మొత్తం ఇచ్చేదిగా తప్ప, ఆదాయాన్ని గణనీయంగా పెంచే ఉద్దేశంతో రూపొందించినది కాకూడదు. నూనెగింజలు, పప్పు ధాన్యాలను పరిమిత పరిమాణంలోనైనా కొంటే,  వాటి సాగును ప్రోత్సహించినట్లు, ధరల స్థిరీకరణకు తోడ్పడినట్లు అవుతుంది. 

-  మల్లంపల్లి ధూర్జటి,
సీనియర్​ జర్నలిస్ట్​